► 1.91 లక్షల నిరుపేదల పాలిట వరంగా మారిన వైఎస్ మానసపుత్రిక
► పేదల జీవితాల్లో వెలుగులు నింపిన పథకం
► రూ.496.36 కోట్ల విలువైన వైద్య సేవలు
► దివంగత నేత వైఎస్సార్ ఈ పథకం ప్రవేశపెట్టి నేటితో పదేళ్లు
► వైఎస్సార్ మేలు మరువలేమంటున్న లబ్ధిదారులు
నల్లగొండటౌన్/చిలుకూరు/మునగాల/భువనగిరి :
పేదలు చేతిలో చిల్లగవ్వలేకున్నా కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లి వైద్య సదుపాయం పొందే పథకం రాజీవ్ ఆరోగ్య శ్రీ. ఈ పథకాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2007 మార్చి 31న ప్రవేశపెట్టారు. చిన్నారులు, వృద్ధులు, యువకులు, మహిళలు అనే భేదం లేకుండా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా హైదరాదాద్, విజయవాడ, గుంటూరు, ఖమ్మం, నల్లగొండ, మిర్యాలగూడ సూర్యాపేట ప్రాంతాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో వివిధ రకాల జబ్బులకు చికిత్సలు చేయించుకున్నారు. ఆరోగ్య శ్రీ వైద్య సేవలను ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లక్షా 91 వేల 896 మంది వివిధ రకాల శస్త్ర చికిత్సలను ఉచితంగా పొందారు.
సుమారు రూ. 496,36,592 విలువ గల వైద్య సేవలను ఈ పథకం ద్వారా నిరుపేదలు ఉచితంగా పొంది ప్రాణాలను దక్కించుకున్నారు. ముఖ్యంగా ఖరీదైన గుండె, మూత్రపిండాలు, ఊపిరి తిత్తుల, కీళ్లు, మెదడు, కేన్సర్, ప్లాస్టిక్ సర్జరీ, మూత్రకోశ వంటి వ్యాధులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందారు. అదే విధంగా నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ప్రస్తుతం క్రిటికల్ కేర్, ఈఎన్‌టీ సర్జరీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గర్భకోశ వ్యాధులు, ఆర్ధోపెడిక్ సర్జరీలు, పీడియాట్రిక్ , ప్లాస్టిక్ సర్జరీ, పాలిట్రామా, శ్వాసకోశ వ్యా«ధులకు సంబంధించిన వైద్య సేవలు, శస్త్ర చికిత్సలను ఈ పథకం ద్వారా చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ లేకుంటే తాము ఏమైపోయే వారమో అని, ఈ పథకాన్ని ప్రవేశ పెట్టి వైఎస్‌రాజశేఖరరెడ్డి తమకు ప్రాణభిక్ష పెట్టారని బాధితులు పేర్కొంటున్నారు. ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరుకుంటున్నారు.
సూర్యాపేట జిల్లాలో ఆరు ఆస్పత్రుల్లో సేవలు
ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకం కింద నూతనంగా ఏర్పడిన సూర్యాపేట జిల్లాలో ఆరు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ పథకం కింద సేవలు అందుతున్నాయి. సూర్యాపేట, హుజూర్‌నగర్ ఏరియా ఆస్పత్రులు, విజయకృష్ణ మల్టీస్పెషల్ ఆసుపత్రి(సూర్యాపేట), శోభా డెంటల్, శ్రీలక్ష్మి డెంటల్ ఆస్పత్రులు(సూర్యాపేట), నిత్యశ్రీ డెంటల్ అస్పత్రి(కోదాడ)లో ఈ సేవలు అందుతున్నాయి.
ఈ పథకమే నన్ను కాపాడింది
2013లో నాకు గుండెజబ్బు రాగా చేతిలో చిల్లిగవ్వలేదు. అప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేస్తారని చెప్పారు. వెంటనే నన్ను హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆపరేషన్ చేసి డాక్టర్లు నన్ను బతి కించారు. ఈ ఆపరేషన్‌కు నాకు రూ.70వేలు ఖర్చు కాగా ప్రభుత్వమే భరించింది. ఆరోగ్యశ్రీ పథకం మేలు ఎప్పటికి మరచిపోలేను.-గుంటకండ్ల పిచ్చిరెడ్డి, విజయ్‌నగర్ కాలనీ, నాగారం
ఎళ్లవేళలా రుణపడి ఉంటాం..
నేను నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తిని, నాకు గుండె కవాటాలు మొత్తం మూసుకుపోయాయి. దీంతో వైద్యులు ఓపెన్ సర్జరీ చేయాలని, ఇందుకోసం రూ.ఐదులక్షలు ఖర్చువుతుందని తెలిపారు. వైద్యం చేయించుకోలేని స్థోమత లేని నాకు ఆరోగ్యమిత్ర ఇచ్చిన సలహాతో ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్ చేసి పునర్జన్మ ప్రసాదించారు. ఈ పథకం ప్రవేశపెట్టిన మహానుభావుడు వైఎస్సార్‌కు మాకుటుంబం ఎల్లవేళలా రుణపడి ఉంటాం.– తంగెళ్ల సత్యనారాయణ, మునగాల, ఆరోగ్యశ్రీ లబ్ధిదారుడు