ప్రమాదవశాత్తు చెరువు గుంతలో పడి ఓ బాలుడు మంగళవారం రాత్రి మృతిచెందాడు.
ధారూరు: ప్రమాదవశాత్తు చెరువు గుంతలో పడి ఓ బాలుడు మంగళవారం రాత్రి మృతిచెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ధారూరు మండల పరిధిలోని శేరిగడ్డతండాలో బుధవారం వెలుగు చూసింది. ఏఎస్‌ఐ నవీన్ తెలిపిన వివరాల ప్రకారం... శేరిగడ్డతండాకు చెందిన విస్లావత్ లక్ష్మణ్, మంగ్లీబాయి దంపతులు కుమారుడు చరణ్(6), కూతురు ప్రియలతో కలిసి మంగళవారం పీపసీఎం తండాలో జరిగిన తుల్జాభవానీ పండుగకు వెళ్లారు.
అందరు పండుగలో ఉండగా చరణ్ తల్లిదండ్రులకు చెప్పకుండా పీపసీఎంతండా నుంచి శేరిగడ్డతండాకు వచ్చాడు. తండా సమీపంలోని చెరువు వైపు వెళ్లిన చరణ్ ప్రమాదవశాత్తు అందులో పడి మృతిచెందాడు. ఈ విషయం తెలియని తల్లిదండ్రులు రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకుని చరణ్ కోసం వెదికారు. ఎక్కడా బాలుని ఆచూకి తెలియకపోవడంతో బుధవారం ఉదయం వెతుకుతుండగా తండావాసులకు చెరువు గుంతలో శవమై కన్పించాడు. తండ్రి లక్ష్మణ్ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ చెప్పారు.