విద్యార్థులు లేని బడికి 9 మంది టీచర్లు

9 Teachers without students - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: 10 తరగతి గదులు, 9 మంది ఉపాధ్యాయులు.. పేరుకు పెద్దబడే. కానీ ఏం లాభం. ఒక్కడంటే ఒక్క విద్యార్థి కూడా లేడు. వరంగల్‌ రూరల్‌ జిల్లా నలబెల్లి మండలం ముచ్చింపుల జెడ్పీ హైస్కూల్‌ పరిస్థితి ఇది. ప్రాథమికోన్నత పాఠశాలగా ఉన్న దీన్ని 2002లో ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్‌ చేశారు. 2013 తర్వాత విద్యార్థుల సంఖ్య  తగ్గుతూ వచ్చింది.

గత ఏడాది 6 నుంచి 10వ తగరతి వరకు ఒక్కొక్క తరగతిలో ఒక్క విద్యార్థి చొప్పున ఐదుగురు విద్యార్థులున్నారు. ఈ ఏడాది నలుగురు విద్యార్ధులు టీసీలు తీసుకొని వేరే పాఠశాలలో చేరిపోయారు. 10వ తరగతి చదివే ఒకే ఒక బాలిక మాత్రమే జూలై వరకు స్కూల్‌కు వచ్చింది. తర్వాత ఆమె కూడా టీసీ తీసుకుని వెళ్లిపోయింది. ఇప్పుడు పాఠశాలలో ఒక్క విద్యార్థి కూడా లేడు. కానీ.. హెడ్‌మాస్టర్‌ శ్రీనివాస్‌తోపాటు మరో 8 మంది ఉపాధ్యా యులు రోజూ పాఠశాలకు వచ్చి సాయంత్రం వరకు ఉండి వెళ్లిపోతున్నారు.

900 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో 18 మంది హై స్కూల్‌ విధ్యనభ్యసించే విద్యార్థులు ఉన్నారు.   సమీప గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు కూడా ప్రైవేటు పాఠశాలలకే వెళ్లడంతో ఈ ఏడాది ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. దీనిపై హెడ్‌మాస్టర్, జిల్లా సైన్స్‌ అధికారి కె.శ్రీనివాస్‌ వివరణ కోరగా తెలుగు మీడియం పాఠశాల కావడంతో గ్రామంలో ఉన్న కొద్దిమంది విద్యార్థులు ప్రైవేటు బడులకు వెళ్తున్నారన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top