వాటర్‌గ్రిడ్‌లో 700 ఉద్యోగాలు | 700 requirements in Water grid posts, says KTR | Sakshi
Sakshi News home page

వాటర్‌గ్రిడ్‌లో 700 ఉద్యోగాలు

Nov 14 2014 5:13 AM | Updated on Sep 2 2017 4:24 PM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు కింద 700 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

వివిధ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తాం: మంత్రి కేటీఆర్
ఉపాధి హామీ కొనసాగింపునకు మండలి ఏకగ్రీవ తీర్మానం
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు కింద 700 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి కేటీఆర్ ప్రకటించారు. వివిధ ఉద్యోగాల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రం ఏర్పడి ఐదు నెలలు గడిచినా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళన నివారణకు ఏం చర్యలు తీసుకున్నారంటూ శాసనమండలిలో గురువారం పలువురు సభ్యులు విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని ప్రశ్నించారు. ప్రశ్నోత్తరాల్లో పేర్కొన్నవాటికి సంబంధం లేకుండా ప్రశ్నలు అడుగుతున్నారని మంత్రి అనడంతో.. ఎమ్మెల్సీలు నాగేశ్వర్, నర్సారెడ్డి, డి.శ్రీనివాస్ తదితరులు మండిపడ్డారు. ఇంతలో మంత్రి కేటీఆర్  కలుగజేసుకొని సభ్యులకు సర్దిచెప్పారు. టీఆర్‌ఎస్ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాన్ని పరిశీలిస్తోందని, ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా కమిటీని కూడా నియమించినట్లు చెప్పారు. నిరుద్యోగుల ఆశలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తామని, వాటర్‌గ్రిడ్ కింద 700 ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు.
 
 ఆర్‌ఎంపీలను డాక్టర్లుగా పరిగణించలేం
 గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందిస్తున్న ఆర్‌ఎంపీ, పీఎంపీలను డాక్టర్లుగా పరిగణించలేమని, ప్రిస్క్రిప్షన్ రాసేందుకు కూడా అనుమతించేది లేదని ఉప ముఖ్యమంత్రి రాజయ్య స్పష్టం చేశారు. అయితే.. వారికి శిక్షణ ఇప్పించి గ్రామస్థాయిలో ‘కమ్యూనిటీ పారామెడిక్’లుగా వారి సేవలను వినియోగించుకోనున్నట్లు తెలిపారు. మొత్తం 25,741 మందిని గుర్తించామని, వీరిలో ఇప్పటికే 12 వేల మందికి శిక్షణ పూర్తయిందన్నారు. రాష్ట్రంలో మలేరియా, డెంగీ, చికున్ గున్యా తదితర జ్వరాలు ఉన్నమాట వాస్తవమే గానీ, మరణాలు మాత్రం నమోదు కాలేదని చెప్పారు. జ్వరాల బారిన పడిన  వారి కోసం అవసరమైన వైద్య పరీక్షలు, ప్లేట్‌లెట్ల సదుపాయాలను జిల్లా ఆసుపత్రుల్లో కల్పించామన్నారు. మెరుగైన చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రిలో 20 పడకలతో ఐసోలేటెడ్ వార్డును ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
 
 ‘ఉపాధి’ని కుదించేందుకు కేంద్రం యత్నం: కేటీఆర్
 గ్రామీణాభివృద్ధి కోసం గత యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకాన్ని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం కుదించాలని చూస్తున్నట్లు తెలిసిందని కేటీఆర్ చెప్పారు. తెలంగాణలోని 443 మండలాల్లో 73 మండలాలకే ఉపాధి హామీ పథకాన్ని పరిమితం చేయాలని కేంద్రం భావిస్తోందన్నారు. గ్రామాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్న ఈ పథకం కొనసాగింపునకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం ఉపాధి హామీని కొనసాగించాల్సిందేనని మండలి ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఉపాధి హామీ పథకం కొనసాగింపుపై ఉభయ సభల్లో తీర్మానాలు చేసి కేంద్రానికి  పంపనున్నట్లు మంత్రి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement