ప్రభుత్వాలు బాలకార్మికుల విముక్తి కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడో ఒక చోట బాలలు కార్మికులుగా పని చేస్తూనే ఉన్నారు.
ఖానాపూర్ (ఆదిలాబాద్ జిల్లా) : ప్రభుత్వాలు బాలకార్మికుల విముక్తి కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడో ఒక చోట బాలలు కార్మికులుగా పని చేస్తూనే ఉన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం కులంగూడ ఏజెన్సీ గ్రామంలో ఆరుగురు బాలకార్మికులను గుర్తించి పోలీసులు విముక్తులను చేశారు. గ్రామంలోని పలువురు రైతుల వద్ద పని చేసే ఆరుగురు బాలకార్మికులు రైతులు పెట్టే బాధలను తట్టుకోలేక వారి వద్ద నుంచి తప్పించుకొని వెళ్లారు. ఈ క్రమంలోనే వెళ్తున్న ఆరుగురు బాలకార్మికులు(నలుగురు బాలురు, ఇద్దరు బాలికలు)లను అడవిసారంగపురి గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజన నాయకులు గుర్తించారు.
బాలురుని విషయాలు అడిగి తెలుసుకొని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాలకార్మికులలో బాలికలను స్థానిక కస్తూర్బా బాలికల పాఠశాలకు, బాలురను ఆశ్రమ పాఠశాలలకు తరలించారు. ఈ బాలకార్మికులు ఉల్వంపాండె గ్రామానికి చెందిన పన్నేండేళ్లలోపు బాలబాలికలుగా పోలీసులు గుర్తించారు. కాగా పోలీసులు ప్రాథమిక విచారణలో రైతులు ఈ బాలకార్మికులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసినట్లు తేలింది. దీంతో పోలీసులు రైతులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.