పెండింగ్‌ బిల్లులు రూ. 440 కోట్లు.. 

440 Crores Has Ben Pending In Irrigation department  - Sakshi

నిలిచిన చెల్లింపులు 

కొన్ని బిల్లులు ఆరు నెలలుగా..

నీటి పారుదల శాఖలో బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. పెండింగ్‌ బిల్లులు సుమారు  రూ.440 కోట్లలో పేరుకుపోయాయి. నెలల తరబడి బిల్లులు రావడం లేదు. ప్రస్తుతం కొనసాగుతున్న పనులకు కూడా బిల్లులు రాకపోవడంతో వాటి ప్రగతి కుంటుపడింది. ఇప్పటికే పూర్తయిన పనులకు కూడా చెల్లింపులు ఆగిపోయాయి. చిన్న నీటిపారుదల విభాగంతో పాటు, ప్రాజెక్టుల విభాగంలో బిల్లులు నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పాటు, నాబార్డు వంటి కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనుల బిల్లుల పరిస్థితి కూడా ఇలాగే ఉండటం గమనార్హం.

సాక్షి. నిజామాబాద్‌: నీటి పారుదల శాఖలో కొత్త పనుల మంజూరును ప్రభుత్వం నిలిపేసింది. దీనికి తోడు బిల్లుల చెల్లింపులు కూడా జాప్యం జరుగుతోంది. జిల్లా నీటి పారుదలశాఖ నిజామాబాద్‌ ఐబీ డివిజన్‌ పరిధిలో సుమారు రూ.253.46 కోట్ల మేరకు చెల్లింపులు జరగాల్సి ఉంది. ప్రధానంగా మిషన్‌కాకతీయ పథకం కింద చేపట్టిన చెరువుల మరమ్మతు పనుల బిల్లు లు ఆగిపోయాయి. ఎక్కువగా మూడో విడ త, నాలుగో విడతల్లో చేపట్టిన చెరువుల పనులకు చెల్లింపులు చేయాల్సి ఉంది.

ఇలా ఒక్క మిషన్‌కాకతీయకు సంబంధించి 192 పనులకు గాను రూ.101.23 కోట్ల మేరకు బిల్లులు నిలిచిపోయాయి. అలాగే ట్రిపుల్‌ ఆర్‌ (రిపేర్స్, రిస్టోరేషన్, రెనోవేషన్‌) పథ కం కింద మంజూరైన పనులకు సంబంధిం చి కూడా రూ.8.90 కోట్లు, చెక్‌డ్యాం నిర్మాణాలకు సంబంధించి మరో రూ.6.12 కో ట్లు చెల్లించాల్సి ఉంది. నాబార్డు ఆర్థిక సహాయంతో చేపట్టిన పనులు, పీఎంకేఎస్‌వై పనులకు కూడా నిధులు ఆగిపోయాయి. చిన్న నీటి వనరుల అభివృద్ధి పనులన్నీ ఈ ఐబీ డివిజన్‌ పరిధిలో కొనసాగుతున్నాయి.  

ఎత్తిపోతల పథకాల బిల్లులు సైతం.. 
బోధన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ప్రాజెక్టు డివిజన్‌ పరిధిలో జరిగిన పనులదీ ఇదే పరిస్థితి. ఇందులో సుమారు రూ.186.86 కోట్ల మేరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అలీసాగర్‌ ఎత్తిపోతల పథకం నిర్వహణ నిధులు రావాల్సి ఉంది. ఈ లిఫ్టు పరిధిలోని పనులకు మొత్తం రూ.95.51 కోట్లు రావాల్సి ఉంది. అర్గుల్‌ రాజారాం ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించి రూ.56.06 కోట్లు, నిజాంసాగర్‌ ప్రాజెక్టు, ప్రధాన కాలువ ఆధునీకరణ బిల్లులు సుమారు రూ.ఏడు కోట్లున్నాయి. కౌలాస్‌నాలా ప్రాజెక్టుతో పాటు, ఇతర ఎత్తిపోతల పథకాల నిర్వహణ ఖర్చులకు సంబంధించిన బిల్లులు చెల్లించాలి. ఇందులో ఇప్పటికే పూర్తయిన పనులు కొన్ని కాగా, కొన్ని ప్రస్తుతం ప్రగతిలో ఉన్న పనులు ఉన్నాయి. గత ఆరు ఆరు నెలలుగా బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. ఈ విషమయమై ‘సాక్షి’ నీటి పారుదల ఓ ఉన్నతాధికారిని సంప్రదించగా ఈ అంశంపై తాను స్పందించలేనని దాటవేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top