సంస్కరణలకు ఆద్యుడు రాజీవ్‌

 28th death anniversary of Rajiv Gandhi in Gandhibhavan - Sakshi

పంచాయతీ రాజ్‌ వ్యవస్థను పటిష్టం చేసింది ఆయనే

చనిపోయిన 28 ఏళ్లకు ఆయనను మోదీ విమర్శించడం దారుణం

రాజీవ్‌ వర్ధంతి సభలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

గాంధీభవన్‌లో దివంగత ప్రధానికి ఘనంగా నివాళి

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో సాంకేతిక సంస్కరణలకు ఆద్యుడు రాజీవ్‌గాంధీ అని, దేశ ప్రజల హృదయాల్లో ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. దేశంలోకి కంప్యూటర్లు, సెల్‌ఫోన్ల ప్రవేశానికి రాజీవే కారకుడని, పంచాయతీరాజ్‌ వ్యవస్థను పటిష్టం చేసింది కూడా ఆయనేనని కొనియాడారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 28వ వర్ధంతి సందర్భంగా మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఉత్తమ్‌ నివాళులర్పించారు. అనంతరం ప్రకాశం హాల్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, దేశంకోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్‌ చిరస్మరణీయుడని అన్నారు. రాజీవ్‌ చనిపోయిన 28 ఏళ్ల తర్వాత ఆయన ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రధాని మోదీ వ్యాఖ్యానించడం దారుణమని, రాజకీయ అనైతికతకు నిదర్శనమని అన్నారు.

లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై వెల్లడయిన ఎగ్జిట్‌పోల్స్‌ను తాము నమ్మడం లేదని, దేశవ్యాప్తంగా, రాష్ట్రంలో తమకు ఆశించిన ఫలితాలు వస్తాయని ఉత్తమ్‌ ధీమా వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి మాట్లాడుతూ, 21వ శతాబ్దంలో భారత్‌ అన్ని రంగాల్లో ముందుండేందుకు రాజీవ్‌గాంధీ ఆలోచనా విధానమే కారణమన్నారు. ఆయన తీసుకువచ్చిన సంస్కరణల కారణంగానే దేశంలో ఆర్థిక, సాంకేతిక అభివృద్ధి సాధ్యమైందని చెప్పారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో భారతీయులు మూడో వంతు ఉండడానికి రాజీవ్‌ తీసుకువచ్చిన సంస్కరణలే కారణమన్నారు. రాజీవ్‌ మరణంపై మోదీ వ్యాఖ్యలు దారుణమని, దేశంలో రాజకీయ తీవ్రవాదాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉండాలనే ఆలోచనతో 18 ఏళ్లకే ఓటు హక్కు తీసుకువచ్చింది రాజీవ్‌ అని, కేంద్రం నుంచి నేరుగా గ్రామాలకు నిధులివ్వాలనే ఆలోచన కూడా ఆయనదేనని అన్నారు. మాజీ మంత్రి షబ్బీర్‌అలీ మాట్లా డు తూ, ప్రధానిగా ఉన్న ఐదేళ్లలో దేశాన్ని అన్ని రంగా ల్లో అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చారని, ఐటీని అగ్రగామిగా నిలపడంలో రాజీవ్‌ పాత్ర మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెట్టి కుసుమకుమార్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, టీపీసీసీ ఓబీసీ సెల్‌ చైర్మన్‌ కత్తి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సోమాజీగూడలోని రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్‌ నేతలు నివాళులర్పించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top