సింగరేణి కార్మికులకు 20% బోనస్ | 20 percent bonus for singareni workers | Sakshi
Sakshi News home page

సింగరేణి కార్మికులకు 20% బోనస్

Sep 23 2014 1:58 AM | Updated on Sep 2 2018 4:23 PM

సింగరేణి కార్మికులకు శుభవార్త. దసరా, దీపావళి పండుగల సందర్భంగా సింగరేణి లాభాల్లో కార్మికులకు 20 శాతం బోనస్ ఇవ్వాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.

సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికులకు శుభవార్త. దసరా, దీపావళి పండుగల సందర్భంగా సింగరేణి లాభాల్లో కార్మికులకు 20 శాతం బోనస్ ఇవ్వాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. కోల్ ఇండియా తరహాలో 240 కోట్ల రూపాయల ప్యాకేజీని బోనస్‌గా కార్మికులకు అందించనున్నట్టు ముఖ్యమంత్రి సోమవారం ప్రకటించారు. ఈ నిర్ణయంతో 61,778 మందికి లబ్ధి చేకూరనుంది. ప్రతీ కార్మికునికి సగటున రూ. 40 వేలు అందుతాయని కేసీఆర్ తెలిపారు. పనితీరు ఆధారిత బోనస్(పీఎల్‌ఆర్) పద్ధతిలో ఈ చెల్లింపులు జరుగుతాయని వివరించారు. సింగరేణి గతంలో కేవలం ఒక శాతమే బోనస్     ఇచ్చేదని, పండుగల సందర్భంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 20 శాతం బోనస్ ప్రకటిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వెయిటింగ్‌లో ఉన్న 3,100 మంది డిపెండెంట్లకు ఉద్యోగ అవకాశం    కల్పించాలని కూడా సీఎం నిర్ణయించారు. దీపావళి కానుకగా దీన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు నల్లాల ఓదెలు, సోమారపు సత్యనారాయణ, చెన్నయ్య దివాకర్‌రావు తదితరులు కార్మికుల పక్షాన సీఎంకు వినతిపత్రం సమర్పించిన సందర్భంగా ఈ ఆదేశాలు జారీచేసినట్టు సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement