ప్రాజెక్టులు భేష్‌

15th Finance Commission visits and satisfied on Telangana projects - Sakshi

తెలంగాణ సాగు, తాగునీటి పథకాలు దేశానికే ఆదర్శం

కేంద్ర ఆర్థిక సంఘం కార్యదర్శి అరవింద్‌ మెహతా ప్రశంస

‘భగీరథ’, కాళేశ్వరం ప్రాజెక్టుల పరిశీలన

పనుల పురోగతి అద్భుతంగా ఉంది

మిషన్‌ భగీరథతో జీవన ప్రమాణాల మెరుగు

అన్ని రాష్ట్రాలు వీటిని అమలు చేయాలి

కేంద్ర నిధులు సద్వినియోగం అవుతున్నాయి

ఆర్థిక సంఘం తరఫున సహకారమందిస్తాం

త్వరలో మరోసారి ప్రాజెక్టులను సందర్శిస్తామని వెల్లడించిన మెహతా

సాక్షి,సిద్దిపేట/చిన్నకోడూరు/గజ్వేల్‌/కాళేశ్వరం (మంథని)
రాష్ట్రంలో సాగు, తాగునీటి కోసం చేపట్టిన ప్రాజెక్టులు అద్భుతంగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక సంఘం కార్యదర్శి అరవింద్‌ మెహతా ప్రశంసించారు. దేశాభివృద్ధికి వ్యవసాయం కీలకమని, దీనికి ప్రాజెక్టులే మూలమని.. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులు నిర్మిస్తోందని కితాబిచ్చారు. ఇంటింటికీ సురక్షిత మంచినీరు అందించాలన్న సంకల్పంతో చేపట్టిన మిషన్‌ భగీరథ దేశమంతటికీ ఆదర్శనీయమని శ్లాఘించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల పనులను ఆయన శనివారం పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, రాష్ట్ర ఆర్థిక సంఘం ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు తదితరులతో కలసి హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌ ద్వారా బయలుదేరి ప్రాజెక్టుల వద్దకు చేరుకున్నారు. గజ్వేల్‌లోని కోమటిబండ గుట్టపై ఉన్న ‘భగీరథ’హెడ్‌ రెగ్యులరేటరీని, సిద్దిపేట జిల్లా చంద్లాపూర్‌ శివారులో నిర్మిస్తున్న రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ను, ‘కాళేశ్వరం’లో భాగమైన అన్నారం బ్యారేజీని పరిశీలించారు. ఆయా ప్రాజెక్టుల పరిధిలో జరుగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రాజెక్టుల వద్దే విలేకరులతో మాట్లాడారు.

ఇది ఆరోగ్య ‘మిషన్‌’!
‘మిషన్‌ భగీరథ’పథకం భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తుందని అరవింద్‌ మెహతా ప్రశంసించారు. సురక్షిత నీరు అందితేనే ప్రజారోగ్య పరిరక్షణ సాధ్యమవుతుందని, తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా కృషి చేయడం అభినందనీయమని చెప్పారు. దీనిని అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. మిషన్‌ భగీరథతో రాబోయే ఐదేళ్లలో తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు కచ్చితంగా మెరుగవుతాయని చెప్పారు. 20 ఏళ్ల కింద కేసీఆర్‌ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిద్దిపేటలో ప్రారంభించిన తాగునీటి పథకమే మిషన్‌ భగీరథకు స్ఫూర్తి కావడం, తెలంగాణ వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా చేపట్టడం బాగుందని పేర్కొన్నారు. ప్రాజెక్టులో 98 శాతం నీటి సరఫరా గ్రావిటీ ద్వారానే జరుగుతుండడం ఆశ్చర్యకరమని, తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని అద్భుతంగా వినియోగించుకున్నారని కితాబిచ్చారు.  

సంతృప్తికరంగా ‘కాళేశ్వరం’పనులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయని అరవింద్‌ మెహతా పేర్కొన్నారు. ఇంత తక్కువ వ్యవధిలో ప్రాజెక్టు పనులు పురో గతి సాధించడం బాగుందని కితాబిచ్చారు. నాలుగైదు నెలల వ్యవధిలో 15వ ఆర్థిక సంఘం సభ్యులతో కలసి మళ్లీ రాష్ట్ర ప్రాజెక్టులను పరిశీలిస్తామని చెప్పారు. ఆర్థిక సంఘం నిధుల కేటాయింపు కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

దేశానికే ఆదర్శం..
సాగు, తాగునీటి కోసం తెలంగాణ ప్రభుత్వం శ్రద్ధ అభినందనీయమని, ప్రాజెక్టులు అద్భుతంగా ఉన్నాయని అరవింద్‌ మెహతా ప్రశంసించారు. రాష్ట్రంలో సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులకు ఇస్తున్న ప్రాధాన్యతను ఇతర రాష్ట్రాలు గుర్తించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. మంచి పథకాలను ప్రోత్సహించాలని ఆర్థిక సంఘం నిర్ణయిస్తే.. ఆ ప్రోత్సాహకాలన్నీ తెలంగాణకే దక్కుతాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న నిధులను తెలంగాణ ప్రభుత్వం సక్రమంగా వినియోగించుకుంటోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇలాంటి మంచి పనులకు 15వ ఆర్థిక సంఘం సహకారం ఉంటుందని.. మరిన్ని నిధులు కావాలంటే ప్రభుత్వం తరఫున మెమోరాండం అందించాలని సూచించారు.

ఆర్థిక సహకారం అందించండి: ఎస్‌కే జోషి
దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌గా తెలంగాణను తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని.. ఈ మేరకు రాష్ట్రానికి ఆర్థిక సహకారం అందించాలని అరవింద్‌ మెహతాకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి విజ్ఞప్తి చేశారు. ప్రధాన సాగు, తాగునీటి ప్రాజెక్టులకు 15 ఆర్థిక సంఘం నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కాగా.. దక్షిణాది రాష్ట్రాలు, మహారాష్ట్రతో కేంద్ర ఆర్థిక సంఘం సమావేశం జరిగిందని.. రాష్ట్రాలు తీసుకున్న అప్పులను ఏయే అభివృద్ధి పనులకు, ఎలా వెచ్చిస్తున్నది తెలుసుకోవడానికి అరవింద్‌ మెహతా పర్యటించారని రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top