ఈ ‘చేప’ వయసు 12 కోట్ల ఏళ్లు

12 Crores Years to this Fish Prints - Sakshi

చేప, ఆకు, జంతువు పాద ముద్రల శిలాజాలు లభ్యం

కొన్ని కోట్ల ఏళ్ల క్రితం నాటివిగా గుర్తింపు

రాతిపై పెయింట్‌ చేసిన చేప బొమ్మలాగా ఉంది కదూ ఇది. కానీ, ఇది నిజమైన చేప అచ్చు. సహజంగా ఇలా రాతిలో నిక్షిప్తమైంది. దీని వయసు ఎంతో తెలుసా? దాదాపు 12 కోట్ల ఏళ్లు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. శిలాజంగా మారిన ఆ చేప ఆకృతి ఇలా రాతి పొరల్లో ఉండిపోయింది. 

సాక్షి, హైదరాబాద్‌: కోట్ల ఏళ్ల నాటి చేపలు, వృక్షాలు, ఆకులు, జంతువుల పాద ముద్రలతో కూడిన అచ్చులకు సంబంధించిన శిలాజాలు రాష్ట్రంలో లభ్యమయ్యాయి. శిలాజంగా మారిన చేప ఆకృతి రామగుండం ఎన్టీపీసీ పరిధిలో లభించింది. ఈ ప్రాంతంలో శిలాజాలకు కొదవే లేదు. కొన్ని కోట్ల ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో రాక్షస బల్లులు కూడా జీవించాయనడానికి సాక్ష్యంగా గతంలో వాటి శిలాజాలు లభ్యమయ్యాయి. బీఎం బిర్లా సైన్స్‌ సెంటర్‌లోని డైనోసారియంలో ఉన్న రాక్షసబల్లి ఆకృతి శిలాజాల రూపం ఇక్కడ లభించిందే. ఇప్పటికీ పూర్వపు ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలో రకరకాల శిలాజాలు లభిస్తూనే ఉన్నాయి. తాజాగా కోట్ల ఏళ్ల నాటి చేపలు, వృక్షాలు, ఆకులు, జంతువుల పాద ముద్రలతో కూడిన అచ్చులకు సంబంధించిన శిలాజాలు లభించాయి.
చెన్నూరు కోటపల్లి అటవీ ప్రాంతంలో లభించిన ఆకుల ముద్రలున్న శిలాజం 

ఔత్సాహిక పరిశోధకుడు సముద్రాల సునీల్‌ తాజాగా వీటిని సేకరించారు. చెన్నూరు కోటపల్లి అటవీ ప్రాంతంలో కొన్ని ఆకుల ఆకృతులతో కూడిన శిలాజాలు లభించాయి. ఇవి ప్రాచీన వృక్షజాతి గ్లోసోప్టెరీస్‌కు చెందినవిగా నిష్ణాతులు అభిప్రాయపడుతున్నట్లుగా వాటిని పరిశీలించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు శ్రీరామోజు హరగోపాల్‌ పేర్కొన్నారు. ఈ జాతి చెట్లలో నారవేప, తిరుమణి తదితరాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ పత్ర శిలాజాల వయసు 10 కోట్ల ఏళ్లుగా ఉంటుందని అంచనా వేశారు. మంచిర్యాల జైపూర్‌ ప్రాంతంలో ఒక జంతువు పాద ముద్ర నిక్షిప్తమైన శిలాజాన్ని కూడా గుర్తించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top