ఈ సర్పంచ్‌లు సాధించారు..

100% toilet constructions within the deadline - Sakshi

గడువులోగా 100 శాతం టాయిలెట్ల నిర్మాణాలు

నగలు తాకట్టు పెట్టి ఒకరు.. అప్పు తెచ్చి మరొకరు...  

వరంగల్‌ జిల్లాలో ఇద్దరు మహిళా సర్పంచుల ఘనత

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: స్వచ్ఛత సాధించేందుకు, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు నడుం బిగించారు ఇద్దరు మహిళా సర్పంచ్‌లు. టాయిలెట్ల నిర్మాణం చేసుకోవాలంటూ ఇం టింటా తిరిగి చెప్పారు. ఆరుబయటకు వెళ్లొ ద్దంటూ ఉదయాన్నే డప్పు చాటింపు వేయించారు. టాయిలెట్లు నిర్మించుకోం అని ఎవరైనా అంటే వారికి కరెంటు కనెక్షన్‌ నిలిపి వేయించారు.

ఆఖరికి టాయిలెట్ల నిర్మాణానికి నిధులు తక్కువైతే ఒకరు ఒంటిపై బంగారం తాకట్టు పెట్టి, అప్పులు తెచ్చి మరీ నిర్మించారు. మరొకరు అప్పులు తెచ్చి నిర్మాణాలు చేపట్టారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం సర్పంచ్‌ కొర్రా భారతి, బొల్లోనిపల్లి సర్పంచ్‌ పొన్నం వనజ తమ గ్రామాలను బహిరంగ మల విసర్జన రహిత (ఓపెన్‌ డెఫికేషన్‌ ఫ్రీ, ఓడీఎఫ్‌) గ్రామాలుగా మార్చి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు.  

ముహూర్తాలు లేవు..  
ముత్తారం గ్రామపంచాయతీ çపరిధిలో 1,200 మంది జనాభా, 329 గడపల ఇళ్లు ఉన్నాయి. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం కాలకృత్యాలు తీర్చుకునేందుకు పొలం గట్లు, ఊరిబయట నిర్జన ప్రదేశాలు, బావి గట్లకు వెళ్లడం రివాజు. స్వచ్ఛభారత్‌ మిషన్‌ మొదలుకాక ముందు ముత్తారంలో 70 ఇళ్లలో టాయిలెట్లు ఉన్నాయి.

ఆ తర్వాత మరో 100 టాయిలెట్ల నిర్మాణం జరిగింది. మిగిలిన వారిలో కొందరికి ఆర్థిక కారణాలు అడ్డంపడితే, మరికొందరికి టాయిలెట్ల నిర్మాణం ఓ అనవసర అంశంగా మారింది. 2 నెలలుగా ఇళ్లలో టాయిలెట్లు నిర్మించుకోవాలంటూ సర్పంచ్‌ భారతి ఇంటింటికి ప్రచా రం నిర్వహించారు.

ఈ క్రమంలో మా ఇళ్లలో టాయిలెట్లు కట్టాలంటూ ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు. ఇందులో మీకు ఏం లాభం ఉంది అంటూ ప్రజలు ప్రశ్నించారు. మరికొన్ని చోట్ల మా ఇంట్లో వాస్తు ప్రకారం టాయిలెట్‌ కట్టకూడదంటూ ఎదురు తిరిగారు. ఇప్పుడు మంచి ముహూర్తాలు లేవు. మంచి టైం చూసి కట్టుకుంటామంటూ దాటవేసే ప్రయత్నం చేశారు.

డప్పు పట్టుకుని..
రోజూ తెల్లవారుజామున 4 నుంచి 7 గంటల వరకు గ్రామంలో డప్పు కొడుతూ, విజిల్స్‌ వేస్తూ ఎవరూ ఆరుబయటకు వెళ్లొద్దంటూ భారతి పంచాయతీ సిబ్బందితో దండోరా వేయించారు. రెండు నెలల పాటు ఈ తంతు కొనసాగింది. ఇంటింటికీ తిరుగుతూ టాయిలెట్‌ నిర్మాణం కోసం కుటుంబాల వారీగా దరఖాస్తులు చేయించారు.

ఎవరైనా మొండికేస్తే కరెంటు కనెక్షన్‌ తొలగించారు. దీంతో కొందరు గ్రామస్తుల్లో వ్యతిరేకత వచ్చినా క్రమంగా టాయిలెట్లు నిర్మించుకునేందుకు ముందుకొచ్చారు. ఎస్సీ కాలనీలో నిధుల కొరతతో పనుల పురోగతి లేదు. దీంతో గ్రామంలో మరో 50 ఇళ్లకు టాయిలెట్లు లేని పరిస్థితి నెలకొంది.

బొల్లోనిపల్లిలో..
బొల్లోనిపల్లి సర్పంచ్‌ పొన్నం వనజ ఇదే తీరుగా 100 శాతం ఓడీఎఫ్‌ కోసం శ్రమించారు. ఈ గ్రామంలో 180 కుటుంబాలుండగా అందులో 70కి పైగా కుటుంబాలకు మరుగుదొడ్లు లేవు. దీంతో ఇతరుల వద్ద రూ. 30 వేలు అప్పు తెచ్చింది. మరుగుదొడ్ల నిర్మాణంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు చేయూతనందించింది. దీంతో ఈ గ్రామంలోని అన్ని ఇళ్లలో మరుగుదొడ్లు నిర్మించగలిగారు.

పదిరోజుల్లో
2017, అక్టోబరు 17న వరంగల్‌లో ఓడీఎఫ్‌పై జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే సతీశ్‌బాబు, జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలి.. గ్రామంలో అన్ని ఇళ్లకు మరుగుదొడ్లు నిర్మించేందుకు ప్రయత్నించాలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ భారతి మాట్లాడుతూ పది రోజుల్లో లక్ష్యాన్ని సాధిస్తామని చెప్పారు. దీంతో అప్పటికే పంచాయతీ పరిధిలో మరో యాభై ఇళ్లకు టాయిలెట్ల నిర్మాణం మధ్యలో ఉంది.

అప్పటికే భారతి శ్రమను చూసిన గ్రామస్తులు ముందు పెట్టుబడి పెడితే బిల్లులు వచ్చాక డబ్బులు తిరిగి ఇస్తామంటూ హామీ ఇచ్చారు. దీంతో చివరి ప్రయత్నంగా తన మూడు తులాల బంగారం తాకట్టు పెట్టగా వచ్చిన రూ. 43 వేలతో అప్పటికప్పుడు మెటీరియల్‌ తెప్పించింది. నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం అన్ని ఇళ్లలో టాయిలెట్ల నిర్మాణం పూర్తి చేశారు. ముల్కనూరు డెయిరీకి పాలు అమ్మగా వచ్చిన రూ. 2 లక్షలతోపాటు బ్యాంకు నుంచి అప్పు తీసుకుని మొత్తం రూ.4 లక్షల వరకు గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణానికి భారతి వెచ్చించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top