breaking news
-
ఓడితే మగాడు కాదా?.. కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు
సాక్షి, కామారెడ్డి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ చిల్లరగా మాట్లాడటం ఇకనైనా మానాలని.. తన సవాల్‌కు స్పందించి మల్కాజ్‌గిరిలో గెలిచి దమ్మేంటో నిరూపించుకోవాలని అన్నారు. ఎన్నికల్లో గెలిస్తే మగాడు.. ఓడితే మగాడు కాదా?. నా సవాల్‌ను రేవంత్ రెడ్డి ఎందుకు స్వీకరించడం లేదు. మల్కాజ్‌గిరిలో ఇద్దరం పోటీ చేద్దాం.. ఎవరు మగాడో తేల్చుకుందాం అని రేవంత్‌ను కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. మా అయ్య పేరు కేసీఆర్. నేను ఉద్యమం చేసి రాజకీయాల్లోకి వచ్చా. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా. అంతేగానీ రేవంత్‌రెడ్డిలాగా రాంగ్ రూట్లో రాలేదు. ఆంధ్రోళ్ల బూట్లు నాకి, పార్టీ మారి రేవంత్ సీఎం అయ్యారు. కారు కూతలు, చిల్లర మాటలు రేవంత్ ఇకనైనా మానుకోవాలి. సీఎంలాగా హుందాగా మాట్లాడాలి.. .. మేడిగడ్డలో 85 పిల్లర్లు ఉంటే.. అందులో మూడు కుంగిన మాట వాస్తవం. అంతేకానీ కాళేశ్వరం, మేడిగ్డ కొట్టుకుపోలేదు. మూడు నెలల సమయంలో ఈ ప్రభుత్వానికి పిల్లర్లు బాగు చేసే సమయం దొరకడం లేదా?. ఈ నెల 17వ తేదీ వరకు ఓపిక పడతాం. కాంగ్రెస్ పాలన వంద రోజులు అయ్యాక ప్రజల్లోకి వెళ్తాం. గొర్రె కసాయివాడ్ని నమ్మినట్లు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మారు. రుణమాఫీ చేయకపోతే రైతులు కాంగ్రెస్ భరతం పడతారు అని కేటీఆర్ హెచ్చరించారు. ఇక చివర్లో.. కామారెడ్డి ఫలితం చేదు అనుభవం మిగిల్చిందన్న కేటీఆర్ ఆ ఎన్నికలపై చర్చ వద్దంటూ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. -
TS Congress: భట్టి విక్రమార్కపై వీహెచ్ సంచలన ఆరోపణలు
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై సీనియర్ నేత హన్మంతరావు సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుందోని వీహెచ్ వ్యాఖ్యలు చేశారు. కాగా, వీహెచ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘భట్టి విక్రమార్క నాకు ఖమ్మం లోక్‌సభ సీటు రాకుండా చేస్తున్నారు. భట్టి నాకు ద్రోహం చేస్తున్నారు. సీటు రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో నాకు తెలియడం లేదు. మొదట సీటు ఇస్తా అన్నారు.. ఇప్పుడు నన్ను పట్టించుకోవడం లేదు. ఈరోజు భట్టి పార్టీలో ఆ స్థానంలో ఉన్నాడంటే అందుకు నేనే కారణం. భట్టిని ఎమ్మెల్సీని చేసింది నేనే. నా కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లో లేరు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాకు న్యాయం చేయాలి. నేను లోకల్ కాదు అంటున్నారు. రేణుకా చౌదరి, నాదెండ్ల భాస్కర్, రంగయ్య నాయుడు లోకలా?. పార్టీ కోసం పదవులు ఆశించకుండా పనిచేసిన నాకు న్యాయం చేయండి. ఖమ్మం లోక్‌సభ సీటు నాకు కేటాయిస్తే ఖచ్చితంగా గెలుస్తాను. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోంది. బీసీల ఓట్లు కాంగ్రెస్‌కు అవసరం లేదా?. బీసీలు కేవలం ఓట్లు వేసే మిషన్లు మాత్రమేనా?. రాహుల్ గాంధీ న్యాయ్ యాత్ర, కుల గణన అంటున్నారు. రాహుల్ అయినా నాకు న్యాయం చేయాలి. ఖమ్మం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తే నేను తప్పుకుంటాను. లేకపోతే ఖమ్మం నుంచి పోటీకి నేనే అర్హుడిని. నేను పార్టీ కోసం పనిచేశాను. నేను చనిపోయే వరకు పార్టీలోనే ఉంటాను. చనిపోయిన తరువాత పార్టీ జెండా నాపై ఉంటుంది. నేను పార్టీ మారే వ్యక్తిని కాదు. నేను పార్టీలో ఎందరికో సహాయం చేశాను. నా వయసు నాకు అడ్డంకి కాదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
TS: బీజేపీ బిగ్ ప్లాన్.. పార్టీలో చేరుతున్న ముగ్గురికి టికెట్స్!
సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు చేస్తోంది. ఈ క్రమంలో బీజేపీ చేరుతున్న నేతలకు టికెట్ ఇచ్చే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నేడు ముగ్గురు సీనియర్ నేతలు బీజేపీలో చేరుతున్నట్టు సమాచారం. అయితే, రేపు(సోమవారం) బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ క్రమంలో రెండో జాబితాలను అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా ఎనిమిది మంది అభ్యర్థుల ఎంపికపై రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి అధిష్టానాకికి జాబితాను పంపించారు. ఇక, నిన్న(శనివారం)రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కిషన్‌రెడ్డి భేటీ కూడా అయ్యారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో చర్చలు జరిపారు. కాగా, తెలంగాణలో పార్టీలో చేరికపై బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో సీతారాంరాయక్, నగేష్, జలగం వెంకట్రావ్‌ను బీజేపీలో చేరుతున్నట్టు తెలుస్తోంది. వీరు ముగ్గురు ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నట్టు సమాచారం. ఇక, వీరు బీజేపీలో చేరిన అనంతరం, పలు పార్లమెంట్ స్థానాల్లో వీరికే సీట్లు ఇస్తున్నట్టు పలువురు పార్టీ నేతలు లీకులు ఇస్తున్నారు. సీఈసీ పరిశీలనలో ఉన్న పేర్లు 1. మహబూబ్‌నగర్ :డీకే అరుణ 2. మహబూబాబాద్ : సీతారాం నాయక్ 3. ఖమ్మం : జలగం వెంకట్రావుఔ 4. ఆదిలాబాద్ : నగేష్ 5. వరంగల్ : కృష్ణ ప్రసాద్ 6. నల్గొండ: మనోహర్ రెడ్డి 7. పెద్దపల్లి : ఎస్ కుమార్/ మిట్టపల్లి సురేంద్ర 8. మెదక్: రఘునందన్ రావు/ అంజిరెడ్డి. -
బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది.. కారు దిగుతున్న కీలక నేతలు!
పార్లమెంట్ ఎన్నికలు ముంగిట్లోకి వచ్చిన వేళ తెలంగాణలో పార్టీల మధ్య కప్ప గెంతులు పెరిగిపోయాయి. ఓ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎంపీ బీజేపీలో చేరిపోయారు. ఆయన కొడుక్కి బీజేపీ ఎంపీ సీటు ఇచ్చేసింది. దీంతో అలిగిన బీజేపీ ముఖ్యనేత ఒకరు హస్తం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. టిక్కెట్ వచ్చినా రాకపోయినా.. బీజేపీలో ఉండేది లేదని ఆ మహిళా నేత తెగేసి చెబుతున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? ఆ నేత ఎవరు?.. తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లు గెలవాలని కమలం పార్టీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. అందులో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాపై ఫోకస్ పెట్టింది. సీట్ల కేటాయింపుపై ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే నాగర్‌కర్నూల్ ఎస్సీ లోక్‌సభ స్దానం నుంచి పార్టీ అభ్యర్దిగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు తనయుడు భరత్‌ప్రసాద్ పేరు ప్రకటించింది. నాగర్‌కర్నూల్ అభ్యర్థిని అందరికంటే ముందుగా ప్రకటించటంతో అక్కడి బీజేపీ నేతల్లో ఉత్సాహం కనిపిస్తోంది. వివాద రహితుడు, సౌమ్యుడిగా పేరున్న ఎంపీ రాములు ఇటీవలే బీజేపీలో చేరారు. ఆయన అచ్చంపేట నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. 2019 ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ ఎంపీగా గెలిచారు. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వటం లేదని కొంతకాలంగా రాములు నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవి తన కుమారుడు భరత్ప్రసాద్కు ఇవ్వాలని రాములు కోరినా.. జిల్లాలోని కొందరు నేతల కారణంగా ఆయన కోరిక తీరలేదు. రెండుసార్లు భరత్ప్రసాద్కు పదవి చేజారటంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న రాములు పార్టీకి అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. ఎంపీ రాములు తనయుడు భరత్‌ప్రసాద్ అచ్చంపేటలో విస్తృతంగా పర్యటించి గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు సీటు కావాలని కోరారు. కానీ, బీఆర్ఎస్ నాయకత్వం ఆయన్ను పట్టించుకోలేదు. అచ్చంపేట నియోజకవర్గంలో తన అనుమతి లేకుండా పోస్టర్లు, కటౌట్లు వేయరాదని గువ్వల బాలరాజు హుకుం జారీ చేయటం సంచలంగా మారింది. ఇటీవల అచ్చంపేట, నాగర్‌కర్నూల్ సెగ్మెంట్లలో పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో కూడా ఎంపీ రాములు పాల్గొనలేదు. సమావేశాల గురించి తనకు సమాచారం లేదని రాములు చెప్పటం పార్టీతో ఎంపీకి ఉన్న గ్యాప్ గురించి అందరికీ తెలిసింది. మూడు నెలలుగా రాములు పార్టీ మారుతున్నారని ప్రచారం జరిగింది. నాలుగు రోజుల క్రితమే రాములు, ఆయన తనయుడు భరత్ కమలం గూటికి చేరారు. రాములుకు వయసు మీద పడటంతో తనయుడికి సీటు కేటాయించారు. రాములుకు ఉన్న మంచిపేరుతో పాటు మోదీ చరిష్మా కలిసి వస్తుందని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు. నాగర్‌కర్నూల్ ఎస్సీ నియోజకవర్గంలో మాదిగల ఓట్లు అధికంగా ఉన్నాయి. తమ అభ్యర్థి కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటం.. మరోవైపు ఎస్సీ వర్గీకరణ విషయంలో బీజేపీ సానుకూలంగా ఉండటం నాగర్‌కర్నూల్‌లో భరత్‌కు సానుకూలంగా మారుతుందని భావిస్తున్నారు. దీంతో ఈసారి ఇక్కడ బీజేపీ విజయం ఖాయమని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. గత ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతికి ఈసారి నిరాశ ఎదురైంది. పార్టీ నాయకత్వం తనకు సీటు నిరాకరించటంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న శృతి ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని కలవటం చర్చనీయాంశంగా మారింది. ఆమె బీజేపీని వీడుతారంటూ ప్రచారం సాగుతోంది. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్ది ఎవరో ఇంకా తెలియడంలేదు. ఇక కాంగ్రేస్ పార్టీలో సీటు కోసం మల్లురవి, సంపత్‌కుమార్ మధ్య తీవ్ర పోటీ కనిపిస్తోంది. బీఎస్పీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పోటీ చేస్తానని ప్రకటించటం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు రక్తి కట్టిస్తున్నాయి. -
కలిసొచ్చిన కరీంనగర్ నుంచే బీఆర్ఎస్ శంఖారావానికి భారీ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికల్లో ఎదురైన ఓటమితో నిరాశా నిస్పృహల్లోకి వెళ్లిన పార్టీ యంత్రాంగంలో జోష్ నింపేందుకు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమాయత్తమవుతు న్నారు. శాసనసభ ఎన్నికల అనంతరం తుంటి ఎముక విరగడంతో ఆసుపత్రిలో చేరిన కేసీఆర్ ఇటీవలి కాలంలోనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కేఆర్ఎంబీ పరిధిలోకి కృష్ణా ప్రాజెక్టు లను అప్పగించే ప్రతిపాదనలకు వ్యతిరేకంగా నల్లగొండలో నిర్వహించిన బహిరంగసభకు మాజీ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా హాజరైన ఆయన తరువాత తెలంగాణ భవన్లో జరిగిన పార్లమెంటరీ సమావేశాల్లో పాల్గొని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇదే ఊపులో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను గెలవడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఇటీవల పార్టీ కార్యాలయంలో జరిగిన కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల సమావే శంలో కరీంనగర్ వేదికగా భారీ బహిరంగసభకు పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికలకు సమర శంఖారావం పూరిస్తూ ఈనెల 12న కరీంనగర్‌లోని శ్రీ రాజరాజేశ్వర డిగ్రీ కళాశాల ఆవరణలో లక్ష మందితో సభ నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడమే లక్ష్యంగా... నల్లగొండలో నిర్వహించిన బహిరంగసభ కృష్ణా జలాల అంశంపైనే కాగా, కరీంనగర్ సభను మాత్రం ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధమనే వాయిస్‌ను జనంలోకి తీసుకెళ్లే ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు. 2001లో పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి ఎన్నికల సభలను కరీంనగర్ నుంచే ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. కలిసొచ్చిన ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానాన్ని ఇందుకు మరోసారి వేదికగా ఎంచుకున్నారు. ఈ సభకు సంబంధించి సన్నాహక సమావేశం శుక్రవారం జరగ్గా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై పార్టీ యంత్రాంగంలో జోష్ నింపే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ నా యకులే లక్ష్యంగా కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ప్రస్తావించగా, ప్రజలు అన్నీ గమనిస్తు న్నారని, తగిన సమయంలో బుద్ధి చెపుతారని కేటీ ఆర్ వ్యాఖ్యానించారు. కాగా కరీంనగర్లో బీఆర్ ఎస్ కార్పొరేటర్ల అరెస్టులు, నాయకులపై కేసులు నమోదు అంశంపైన కూడా శుక్రవారం నాటి సమా వేశంలో చర్చ జరిగింది. పార్టీ నుంచి వెళ్లాలనుకునే వారికి భరోసా ఇవ్వడం పైనా... బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన మూడు నెలల వ్యవధిలోనే రాజకీయాలు వేగంగా మారుతున్నా యి. బీఆర్ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచి నప్పటికీ, కొందరు పక్క చూపులు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు వెంకటేశ్ నేత (పెద్దపల్లి), పి.రాములు (నాగర్క ర్నూలు), బీబీ పాటిల్ (జహీరాబాద్) ఇప్పటికే వేరే పార్టీల్లోకి జంప్ చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా సిట్టింగ్‌లు భయపడు తున్నారని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీ అధిష్టానానికి సంకేతాలు ఇవ్వగా, మల్కాజిగిరి నుంచి తమ కుటుంబ సభ్యులెవరూ పోటీలో ఉండరని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి శుక్రవారం కేటీఆర్‌ను కలిసి చెప్పారు. దీంతో పార్టీ బలంగా ఉందనే సంకేతాలు ఇచ్చేందుకు కరీంనగర్లో భారీ బహిరంగ సభతో సత్తా చాటాలని నిర్ణయించారు. ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మాజీ మంత్రి గంగుల కరీంనగర్ ఎస్ఆర్ఆర్ గ్రౌండ్స్‌లో జరిగే సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పర్యవేక్షిస్తున్నారు. కేటీఆర్ కూడా శుక్రవారం గ్రౌండ్స్‌కు వెళ్లి పరిశీలించారు. ఏయే నియోజకవర్గాల నుంచి ఎంత మంది జనం వస్తారో లెక్కలు వేసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి లక్ష మందికి పైగా జనాలు ఎస్ఆర్ఆర్ గ్రౌండ్స్‌కు తరలివస్తారని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇందుకోసం మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులకు బాధ్యతలు అప్పగించారు. సభను విజయవంతం చేసి బీఆర్ఎస్ సత్తాను మరోసారి చాటుతామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ‘సాక్షి’కి చెప్పారు. -
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు
సిరిసిల్ల: తెలంగాణలో పొలాలు ఎండుతున్నాయి.. మోటార్లు కాలుతున్నాయి.. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడంతోనే కరువు వచ్చిందని ఆరోపించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రాల్లో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. లంకెబిందెలు ఉన్నాయని వస్తే ఉత్త మట్టికుండలే ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని, లంకెబిందెల కోసం రాత్రిపూట గడ్డపార, తట్టలతో వెతికేవాళ్లను ఏం అంటారని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని దొంగచేతిలో పెట్టారని ధ్వజమెత్తారు. ఈ ఏడాది కాలం లేక కరువు వచ్చిందంటున్నారని, కానీ గతేడాది 14 శాతం అధికంగా వర్షాలు పడ్డాయని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టును రిపేరు చేసి నీళ్లను ఎత్తిపోస్తే.. ఒక్క ఎకరం కూడా ఎండిపోయేది కాదన్నారు. అదే కేసీఆర్ ముఖ్య మంత్రి అయి ఉంటే.. మేడిగడ్డ వద్ద కుంగిపోయిన రెండు పిల్లర్లకు రిపేరు చేయించేవారన్నారు. దేశంలోని 5వేల టిప్పర్లను, 4వేల ప్రొక్లెయిన్లను తెప్పించి, కాంట్రాక్టర్‌తో మాట్లాడి రెండు నెలల్లో రిపేరు చేయించి నీళ్లు ఎత్తిపోసేవాడని కేటీఆర్ చెప్పుకొచ్చారు. రైతుల రుణమాఫీ ఏది ? డిసెంబర్ 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయగానే రైతుల రూ.2లక్షల రుణాలను మాఫీ చేస్తానని చెప్పిన రేవంత్‌రెడ్డి ఇప్పటి వరకు ఎందుకు రుణమాఫీ చేయలేదని కేటీఆర్ ప్రశ్నించారు. రైతుబంధు ఎందుకు వేయలేదని నిలదీశారు. పంటకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తానని చెప్పిన రేవంత్‌రెడ్డి ఎందుకు ఇవ్వలేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే రైతులకు బోనస్ ఇచ్చే జీవోను తేవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌ను నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నారు ఉద్యమ నాయకుడిని, తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ను పట్టుకుని నోటికి ఎంత వస్తే అంత మాట్లా డుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేగులు మెడలో వేసుకుంటా.. గొంతు కోస్తా.. లాగులో తొండలు వదులుతా అంటూ.. సీఎం రేవంత్‌రెడ్డి దారుణంగా మాట్లాడుతు న్నారని ఆరోపించారు. రాజకీయాలు ఎన్నికల్లో చూసుకుందాం.. రైతులు చావకముందే కాళేశ్వరం ప్రాజెక్టును రిపేరు చేసి ఎండిపోతున్న పొలాలకు నీళ్లు ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికారులు కూడా కాంగ్రెస్ తొత్తుల్లాగా పని చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ముందే చెప్పారని మోసపోతే.. గోసపడతామని, గొర్రె కసాయి వాడిని నమ్మినట్లు కాంగ్రెస్‌ను నమ్మి గోసపడుతున్నారన్నారు. పోయిన చోటే వెతుక్కో వాలనే చందంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘పాలమూరు’ పునర్నిర్మాణానికి రూ.10 వేల కోట్లతో ప్రణాళికలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘కాంగ్రెస్ ఎప్పు డైనా విధానాలకు కట్టుబడి, లక్ష్యసాధన కోసం పనిచేసే పార్టీ. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలి మూడు నెలల్లోనే పాలమూరు పునర్నిర్మాణం కోసం రూ.10 వేల కోట్లకుపైగా వెచ్చించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. నారాయణపేట–కొడంగల్, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల, ప్రతిష్టా త్మక విద్య, వైద్య సంస్థల ఏర్పాటు, రోడ్లు, మౌలిక సదుపాయాల నిర్మాణం ఇలా ప్రతి రంగంలోనూ అభివృద్ధి పనులతో పాటు పథకాల అమలులో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు’ అని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు, మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ హస్తం అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ అధి ష్టానం వివిధ రాష్ట్రాలకు సంబంధించి శుక్రవారం తొలివిడతగా 39 మంది ఎంపీ అభ్యర్థుల జాబితా ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిగా తన పేరును ప్రకటించినందుకు శనివారం కాంగ్రెస్ నాయకత్వానికి వంశీచంద్‌రెడ్డి కృతజ్ఞతలు తెలుపుతూ.. మహబూబ్‌నగ ర్కు కాంగ్రెస్ గ్యారంటీ పేరిట లేఖ విడుదల చేశారు. రాష్ట్రంలో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న పార్టీ నక్కజిత్తులతో పాలమూ రు మోసపోయింది.. ఇదే కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తెలంగాణనే కాదు, మహ బూబ్నగర్నూ పట్టించుకున్న సందర్భం లేదు. ఆ పదేళ్ల నష్టాన్ని పూడుస్తూ, భవిష్యత్ వైపు నడిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థమైన విధానంతో అడుగులు వేస్తోందని తెలిపారు. అందుకే అడుగడు గునా ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలుస్తున్నా రని చల్లా పేర్కొన్నారు. పాలమూరు న్యాయయా త్రలో జనం గుండె చప్పుడు విన్నానని.. కరువు లేని మహబూబ్‌నగర్ ఆకాంక్షకు అనుగుణంగా జనం కోసం.. జలం కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రాజెక్టులు నిర్మించి, జలకళ తెచ్చి, విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతానని, అందరూ తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు. -
బీఆర్ఎస్ టెంపరరీ పార్టీ
సాక్షి, హైదరాబాద్: ‘‘బీఆర్ఎస్ టెంపరరీ పార్టీ. కొంతకాలం ఉంది. మళ్లీ వస్తుందో లేదో తెలియదు. ఆ పార్టీ అధికారంలో ఉండగా ఎన్నికల కోసమే కరెంట్ ఇచ్చేది. కాంగ్రెస్ అలా కాదు. కొన్ని దశాబ్దాల పాటు అధికారంలో ఉంది. మరికొంతకాలం పాలిస్తుంది. ఎప్పటికీ ఉంటుంది. మాకు బాధ్యతలున్నాయి. ఎన్నికల కోసమే కరెంట్ ఇవ్వం. నిర్ణయాలన్నీ శాశ్వత ప్రాతిపదికతో ఉంటాయి..’’ అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కరెంట్ కోతలు ఉంటాయన్న బీఆర్ఎస్ నేతల ఆరోపణలను ఖండించారు. శనివారం భట్టి సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. జీరో బిల్లు రాకుంటే మళ్లీ దరఖాస్తు.. నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వాడుతూ, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండి, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారు కరెంట్ బిల్లు వచ్చినా కట్టాల్సిన అవసరం లేదని భట్టి చెప్పారు. అలాంటి వారిని బిల్లు కట్టాల్సిందిగా సిబ్బంది ఏమీ వేధించబోరన్నారు. వారు మళ్లీ ఎంపీడీవో, మున్సిపల్, జీహెచ్ఎంసీ కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తులు సమర్పించాలని, తర్వాత ఈఆర్వో (ఎలక్ట్రిసిటీ రెవెన్యూ కార్యాలయాల)లో ఆ వివరాలు అందించాలని సూచించారు. ఈ వివరాలను పరిశీలించి, జీరో బిల్లులు జారీ చేస్తామని తెలిపారు. గృహజ్యోతి పథకం కింద 40,33,702 కుటుంబాలకు జీరో బిల్లులు జారీ చేశామన్నారు. గృహజ్యోతి లబ్ధిదారుల ఎంపిక నిరంతరంగా జరుగుతుందని, కొత్త రేషన్‌కార్డుల జారీ తర్వాత అర్హులకు ఈ పథకం వర్తింపజేస్తామని తెలిపారు. కచ్చితంగా ఒకటో తేదీన జీతాలు ఇస్తాం భవిష్యత్తులో కూడా కచ్చితంగా ఒకటో తేదీన ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు ఇస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. పదేళ్లలో బీఆర్ఎస్ సర్కారు రూ.7 లక్షల కోట్లు అప్పులు చేసి, రాష్ట్రాన్ని నిర్వీ ర్యం చేసిందని మండిపడ్డారు. ఆర్థిక వ్యవస్థను చక్క దిద్దుకునే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అంగన్వాడీ లు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఏఎన్ఎంలను ప్రాధాన్య జాబితాలో చేర్చి వేతనా లిస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.40 వేల కోట్ల పెండింగ్ బిల్లులను వదిలేసి పోయిందని.. అందులో తొలుత రూ.10 లక్షలలోపు ఉన్న బిల్లులను క్లియర్ చేస్తున్నామని తెలిపారు. యాదాద్రి, భద్రాద్రి.. కాళేశ్వరం లాంటివే.. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలు కాళే శ్వరం పథకం వంటివేనని.. వాటిలో ఉత్పత్తయ్యే విద్యుత్ తెలంగాణకు భారంగా మారుతుందని భట్టి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే వేల కోట్లు ఖర్చుచేసినందున వాటిని వాడుకోవాలా, వదిలేయాలా అన్న దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. రిజర్వాయర్లు, కాల్వలపై సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామని, దీనిపై అధ్యయనం చేయిస్తున్నామని చెప్పారు. త్వరలో సంప్రదాయేతర ఇంధన వనరుల పాలసీ తెస్తామన్నారు. వచ్చే ఏప్రిల్, మే నెలల్లో విద్యుత్ డిమాండ్ ఏకంగా 16,500 మెగావాట్లకు చేరే అవకాశం ఉందని.. ఆమేర సరఫరాకు సిద్ధంగా ఉన్నామని భట్టి తెలిపారు. గత రెండేళ్లతో పోల్చితే ఈసారి రాష్ట్ర విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందన్నారు. అక్రమ నియామకాలపై సమగ్ర నివేదిక కోరాం జెన్కో, ట్రాన్స్‌కోలలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ నియామకాలపై సమగ్ర నివేదిక కోరామని భట్టి వెల్లడించారు. బాధ్యులైన అధికా రులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇక సిరిసిల్ల విద్యుత్ సహకార సొసైటీ(సెస్)ని ఉత్తర డిస్కంలో విలీనం చేసే అంశంపై నివేదిక ఇవ్వాలని ఎన్పీడీసీ ఎల్ సీఎండీని కోరామని చెప్పారు. కొండలు, గుట్టలకు రైతుబంధు ఇవ్వలేం సాగు చేయకపోయినా కొండలు, గుట్టలున్న భూములకు గత ప్రభుత్వం రైతుబంధు ఇచ్చిందని, ఇకపై అలా ఇచ్చేది లేదని భట్టి విక్రమా ర్క స్పష్టం చేశారు. సాగు చేసే రైతులకే ఈ పథకం కింద సహాయం అందుతుందని, సాగు ను ప్రోత్సహించడమే రైతు భరోసా లక్ష్యమని వివరించారు. ఇందిరాక్రాంతి పథం కింద వచ్చే ఐదేళ్లలో పొదుపు సంఘాలకు రూ.లక్ష కోట్ల రుణాలు ఇవ్వాలనేది టార్గెట్‌గా పెట్టుకున్నా మని చెప్పారు. ఈనెల 12న వడ్డీలేని రుణాల చెక్కులు పంపిణీ చేస్తామన్నారు. -
ఫాంహౌస్ ఇటుకలు కూడా మిగలవు!
సాక్షి, మేడ్చల్ జిల్లా/ సాక్షి హైదరాబాద్: సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తమ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని కొందరు ప్రగల్భాలు పలుకుతున్నారని.. తమ కార్యకర్తలు తలచుకుంటే కేసీఆర్ ఫాంహౌజ్ గోడలే కాదు ఇటుకలు కూడా మిగలవని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వాన్ని కూల్చే మొనగాడు రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, రాష్ట్రం అభివృద్ధి వేగవంతం అవుతుందని చెప్పారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి, మెట్రో విస్తరణకు అడ్డుపడేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని.. అలాంటి వారిని నగరం నుంచి బహిష్కరించాల్సి వస్తుందని హెచ్చరించారు. శనివారం హైదరాబాద్‌లోని బైరామల్‌గూడ వద్ద రూ.194 కోట్లతో నిర్మించిన రెండో లెవెల్ ఫ్లైఓవర్‌ను.. ఉప్పల్ నల్ల చెరువు, నాచారం పెద్ద చెరువుల వద్ద నిర్మించిన మురుగు నీటిశుద్ధి కేంద్రాల (ఎస్టీపీల)ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి డెయిరీఫాం రోడ్ వరకు రూ.1,580 కోట్లతో నిర్మించనున్న ఎలివేటెడ్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు కండ్లకోయలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో రేవంత్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కొందరు మాట్లాడుతున్నారు. మేం అల్లాటప్పాగా అడుక్కుని, అయ్య పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన వాళ్లం కాదు. రైతుబిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే మీ కళ్లు మండుతున్నాయా? అసలు మా ప్రభుత్వాన్ని కూల్చే మొనగాడు రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా?ప్రభుత్వాన్ని, నన్ను టచ్ చేస్తే మా కార్యకర్తలు మీ కళ్లలో కారం కొడతారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అసెంబ్లీలో ప్రతిపక్షాలు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. మేం మంచివాళ్లం. రాజ్యాంగ విలువలను కాపాడేవాళ్లం. కాబట్టే మీరు మాట్లాడగలుగుతున్నారు. అసెంబ్లీకి రమ్మను.. అన్నీ చెప్తాం.. ప్రతిపక్షాలు ప్రజాసమస్యలపై మాట్లాడకుండా, ధర్నాలు చేయకుండా కేసీఆర్ ధర్నాచౌక్‌ను ఎత్తేశారు. అలాంటిది నేడు ఆయన బిడ్డ కవిత ధర్నాచౌక్‌లో ధర్నా చేస్తూ మహిళల మీద ప్రేమ ఒలకబోస్తున్నారు. మా 90 రోజుల పాలనలో 28వేల ఉద్యోగాలు భర్తీ చేస్తే.. అందులో 43శాతం మహిళలకు ఇచ్చాం. మీ అయ్యను అసెంబ్లీకి పంపిస్తే.. ఎవరెవరికి ఉద్యోగాలు ఇచ్చామో పేర్లతో సహా చెప్తాం. బీఆర్ఎస్ మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వనినాడు తండ్రిని అడగని కవిత ఇప్పుడు మహిళల గూర్చి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. మేడిగడ్డ పాపం మాకు అంటగడతారా? లక్షన్నర కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు మూడేళ్లకే కూలిపోయే పరిస్థితికి చేరాయి. దీనిపై నిపుణుల సలహాలు తీసుకుని ముందుకెళ్తాం. కానీ బీఆర్ఎస్ నేతలు వెంటనే మరమ్మతులు చేయాలంటూ ఆ పాపాన్నంతా మాకు అంటగట్టాలని చూస్తున్నారు. హరీశ్‌రావు మేడిగడ్డకు రమ్మంటే రారు. అసెంబ్లీలో మైక్ ఇచ్చినప్పుడు మాట్లాడరు. కానీ బయట ప్రభుత్వాన్ని బదనాం చేసే మాటలు మాట్లాడుతారు. బీజేపీకి పొత్తులు ఎందుకు? లోక్‌సభ ఎన్నికల్లో 400సీట్లు గెలుస్తామని పదే పదే చెప్తున్న ప్రధాని మోదీ.. ఎన్డీయే కూటమిలోకి కొత్త భాగస్వాములను ఎందుకు చేర్చుకుంటున్నారు? పక్క రాష్ట్రంలో చంద్రబాబు, పవన్‌తో, బిహార్‌లో నితిశ్‌తో, ఒడిశాలో నవీన్ పట్నాయక్‌తో, ఇతర రాష్ట్రాలతో మరికొందరితో పొత్తులు పెట్టుకోవడానికి ఎందుకు తాపత్రయ పడుతున్నారు? బీజేపీ కాలం చెల్లింది. దేశంలో కాంగ్రెస్ హవా కొనసాగుతుందని వారికి అర్థమైంది. ఎంపీలు ఉంటే అభివృద్ధి సాధ్యం అసెంబ్లీ ఎన్నికల్లో చాలాచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీలు గెలవాలి. అప్పుడే అభివృద్ధి పూర్తిగా సాధ్యమవుతుంది. ఈసారి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. కేంద్ర, రాష్ట్ర నిధులతో మరింతగా అభివృద్ధి జరుగుతుంది..’’ అని రేవంత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, మైనంపల్లి రోహిత్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశానికే ఆదర్శంగా హైదరాబాద్ తెలంగాణ–2050 పేరిట రాష్ట్ర అభివృద్ధి కోసం త్వరలోనే మెగా మాస్టర్‌ప్లాన్‌ను రూపొందిస్తాం. దాన్ని ప్రజల ముందుంచి.. అభ్యంతరాలు స్వీకరిస్తాం. మొత్తం తెలంగాణ, హైదరాబాద్‌లను 360 డిగ్రీలలో అన్నివైపులా అభివృద్ధి చేస్తాం. హైదరాబాద్‌ను దేశానికే ఆదర్శంగా నిలిపేలా చర్యలు చేపడతాం. హైదరాబాద్ పరిసరాల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీలు అన్నింటినీ ఒకే గొడుకు కిందికి తెచ్చి అన్నివైపులా అభివృద్ధి జరిగేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మెట్రో రైల్‌ను మరింతగా విస్తరిస్తాం. మురికికూపంగా మారిన మూసీ ఇక్కడి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుండటమేగాక నల్లగొండ జిల్లాలో 50–60 వేల ఎకరాల్లో పంటలను కూడా బలి తీసుకుంటోంది. దీన్ని ప్రక్షాళన చేయడంతోపాటు 55 కిలోమీటర్ల పొడవునా మూసీ రివర్‌ఫ్రంట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తాం. ఇందుకు దాదాపు రూ.50వేల కోట్లు అవసరం. కేంద్రం నిధులు ఇచ్చి సహకరించాలి. కాంగ్రెస్ పనులతోనే నగరానికి గుర్తింపు కాంగ్రెస్ హయాంలో రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్ నగర అభివృద్ధి జరిగింది. కాంగ్రెస్ నిర్మించిన ఔటర్‌రింగ్‌రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయాల వల్లే ప్రపంచ చిత్రపటంలో హైదరాబాద్‌కు గుర్తింపు, ఐటీ–ఫార్మా రంగాల్లో లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. తెలంగాణకు వస్తున్న ఆదాయంలో 70శాతం వాటివల్లే సమకూరుతోంది. కబ్జాలపై ఉక్కుపాదమే రాష్ట్రంలో కబ్జాదారులపై ఉక్కు పాదం మోపుతాం. ఎంతటి వారైనా సరే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. కబ్జాలపై ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే స్వీకరించి చర్యలు చేపట్టాలని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను ఆదేశించాం. పాతబస్తీ మెట్రోను ఆపాలట! నిన్న మెట్రో విస్తరణకు అసదుద్దీన్ ఒవైసీ తో కలిసి పునాది రాయి వేయగానే దాన్ని ఆపాల్సిందిగా ఒకాయన ఢిల్లీకి చెప్పిండట. వాళ్లు ఇప్పుడు దాన్ని ఆపాలని అంటున్నారు. మీకు చేయడం చేతకాకపోతే.. మేం చేసేటప్పుడు అ యినా కాళ్లలో కట్టెలు పెట్టొద్దని కోరుతున్నా. కేంద్రాన్ని ఉసిగొల్పుతూ అడ్డుకుంటున్న వారిని హెచ్చరిస్తున్నా.. అలాంటి వారిని నగరం నుంచి బహిష్కరించాల్సి వస్తుంది. -
మళ్లీ కారు..కొడవలి!
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో భారత్ రాష్ట్ర సమితితో కలిసి పనిచేసే దిశగా వామ పక్షాలు అడుగులు వేస్తున్నాయి. బీజేపీ ఓటమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్న కమ్యూని స్టు పార్టీలు.. అందుకు కలిసి వచ్చే అవకాశం ఉన్న, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఇటీవల బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ భే టీ అయిన సంగతి తెలిసిందే. కాగా వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేయాలని ఈ రెండు పార్టీలూ నిర్ణయించాయి. త్వరలోనే పొత్తుకు సంబంధించిన విధివిధానాలు, సీట్ల పంపకాలపై చర్చలు జరగనున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఓటమి పాలైన బీఆర్ఎస్, సార్వత్రిక ఎన్నికల్లో పైచేయి సాధించడం ద్వారా రాష్ట్రంలో తమ పట్టును నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉంది. వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించి అధికార పార్టీకి సవాల్ విసరాలనే ఆలోచనతో ఉంది. ఈ నేపథ్యంలో కొందరు బీఆర్ఎస్ నేతల నుంచి కమ్యూనిస్టు పార్టీలకు కూడా పిలుపు వచ్ఛి నట్లు తెలిసింది. తాము వచ్చి చర్చలు జరుపుతామని, అందుకు సుముఖమేనా అని బీఆర్ఎస్ వర్గాలు అడిగినట్లు కామ్రేడ్లు చెబుతున్నారు. ఇప్పటికే అనధికారికంగా లెఫ్ట్, బీఆర్ఎస్ మధ్య మంతనాలు జరుగుతున్నట్లు కమ్యూనిస్టు వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్‌తో కలిసి వెళ్లాలనుకున్నా.. వాస్తవానికి బీజేపీని ఓడించేందుకు ‘ఇండియా’కూటమిలో భాగమైన కాంగ్రెస్‌తో, రాష్ట్రంలోనూ కలిసి వెళ్లాలని కమ్యూనిస్టు పార్టీలు భావించాయి. చెరో సీటు ఇస్తే చాలన్నట్టుగా సంకేతాలు పంపాయి. కానీ దేశవ్యాప్తంగా పొత్తులు కుదుర్చుకుంటూ, రాష్ట్రంలో సైతం ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన ప్రారంభించిన హస్తం పార్టీ నుంచి ఇప్పటివరకు ఈ దిశగా ఎలాంటి చొరవా, కదలిక లేకపోవడం వామపక్షాలను ఆగ్రహానికి గురి చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్తో పొత్తు ఆలోచనలో లెఫ్ట్ పార్టీలు ఉన్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ పొత్తు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్తో కలిసి వెళ్లాలని సీపీఐ, సీపీఎం భావించాయి. అయితే ‘ఇండియా’కూటమికి కాంగ్రెస్ నేతృత్వం వహిస్తున్నందున వామపక్షాలతో జట్టు కట్టకూడదని బీఆర్ఎస్ నిర్ణయించింది. దీంతో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని లెఫ్ట్ పార్టీలు నిర్ణయించాయి. అయితే సీట్ల విషయంలో తలెత్తిన వివాదం కారణంగా సీపీఎం ఒంటరిగానే 19 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. సీపీఐ మాత్రం కాంగ్రెస్‌తో జతకట్టింది. ఒకే ఒక్క స్థానం కొత్తగూడెంలో పోటీ చేసి గెలిచింది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌తో కలిసి వెళ్లాలని సీపీఐ నిర్ణయించుకోగా, ఇండియా కూటమి దృష్ట్యా సీపీఎం కూడా సుముఖంగానే ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటామని, చెరో స్థానం ఇస్తే చాలని కూడా రెండు పార్టీలు ఎప్పుడో ప్రకటించాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ఇప్పటివరకు ఈ విషయం పట్టించుకోలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చివరివరకు పొత్తుపై తేల్చకుండా నాన్చారని, దానివల్ల తాము నష్టపోయామని సీపీఎం వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే రావడంతో సీపీఎంతో పాటు సీపీఐ కూడా గుర్రుగా ఉన్నట్టు సమాచారం. అధికారంలోకి వచ్చాక తమ అవసరం లేదన్నట్లుగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని కమ్యూనిస్టు వర్గాలు ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. విజయన్‌పై రేవంత్‌రెడ్డి విమర్శలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల కేరళ వెళ్లారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. విజయన్ హైదరాబాద్ వచ్ఛి న సందర్భంగా ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవడాన్ని, కేంద్రంలోని బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించిన సభలో కేసీఆర్ ఆహ్వానం మేరకు పాల్గొనడాన్ని రేవంత్ తప్పుపట్టారు. ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిపరుడని, ఆయనను కలిసిన విజయన్ కూడా అవినీతిపరుడని, అందుకే కేసీఆర్‌ను కలిశారంటూ నోరు పారేసుకున్నారు. ఈ వ్యాఖ్యలపై సీపీఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రేవంత్ వ్యాఖ్యలు బాధ్యతారహితమని పేర్కొంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఏకంగా ఒక ప్రకటనే విడుదల చేశారు. ‘ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరొక రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడం సంప్రదాయమన్న విషయం రేవంత్‌రెడ్డికి తెలియదా? కేంద్ర ప్రభుత్వ విధానాల మీద పోరాడే క్రమంలో కేసీఆర్ ఆహ్వానం మేరకు సభలో పాల్గొని విజయన్ ఏమి మాట్లాడారో సీఎం మరచిపోవడం ఆశ్చర్యకరం. దేశ రాజకీయాల్లో ప్రస్తుతం సీపీఎం పాత్ర ఏమిటో కూడా మరచిపోయి, బాధ్యత మరచి, తప్పుడు ఆరోపణలు చేశారు..’అంటూ ఘాటుగా ధ్వజమెత్తారు. కాగా అప్పట్నుంచే వామపక్షాలు కాంగ్రెస్‌పై వామపక్షాలు ఒకింత అసహనంతో ఉన్నాయి. ప్రధాని మోదీని ప్రశంసించిన సీఎం ఇది చాలదన్నట్టు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రానికి వచ్ఛినప్పుడు సీఎం రేవంత్ ఆయనతో కలిసి సభలో పాల్గొనడం, అంతేకాకుండా ప్రధానిని ప్రశంసిస్తూ మాట్లాడటం, పెద్దన్న మోదీ అంటూ సంబోధించడాన్ని కామ్రేడ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి మధ్య మంచి సంబంధాలు ఉండొచ్చు కానీ రాజకీయ విభేదాలు మరిచి పొగడడం ఎంతవరకు సమంజసం అని అంటున్నారు. తమతో పాటు బీజేపీతో ప్రధానంగా పోరాడేది కాంగ్రెస్ పార్టీయేనన్న విషయాన్ని మరిచి రేవంత్‌రెడ్డి వ్యవహరించారని కమ్యూనిస్టులు అంటున్నారు. రేవంత్‌రెడ్డి సైతం బీజేపీపై గట్టిగా పోరాడాల్సింది పోయి మెతక వైఖరితో ఉన్నారని భావిస్తున్నారు. ఈ పరిస్థితులన్నీ పరిగణనలోకి తీసుకుని బీఆర్ఎస్తో కలిసి వెళ్లే ఆలోచనలో లెఫ్ట్ పార్టీలు ఉన్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మునుగోడు ఉప ఎన్నికలో కూడా ఈ మూడు పార్టీల శ్రేణులు కలిసి పనిచేసిన విషయాన్ని కొందరు నేతలు గుర్తు చేస్తున్నారు. -
రేవంత్, బాబుల మధ్య అదే చర్చ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తన గురువు చంద్రబాబుతో రెండు గంటల పాటు బేగంపేట ఎయిర్ పోర్టులో చర్చలు జరిపారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. రేవంత్‌ను కలిసిన తర్వాతే చంద్రబాబు అమిత్ షాను కలిశారని వివరించారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్‌ను బీజేపీ వైపు తీసుకొస్తానని చంద్రబాబు అమిత్ షాకు హామీ ఇచ్చారని ఆరోపించారు. రేవంత్‌కు చంద్రబాబు ఎంత చెబితే అంతే అని వారు విశ్లేషించారు. తెలంగాణ భవన్లో శనివారం మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్ ,క్రాంతి కిరణ్, నన్నపనేని నరేందర్, బీఆర్ఎస్ నేతలు దేవీప్రసాద్, రాకేష్ కుమార్, గట్టు రాంచందర్ రావు మీడియాతో మాట్లాడారు. మోదీ వద్ద బీజేపీ సీఎంలకు దొరకని ప్రాధాన్యత కాంగ్రెస్ సీఎం రేవంత్‌కు దొరుకుతోందని, పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ బీజేపీతో జత కట్టడం ఖాయంగా కనిపిస్తోందని బీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడ్డారు. మోదీని రేవంత్ పెద్దన్నగా సంభోధించిన తర్వాత వారిద్దరి బంధం బలపడిందని, పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ మరో ఏక్ నాథ్ షిండే, హిమంత్ బిశ్వశర్మగా మారుతారని ఆరోపించారు. బాబు మాదిరిగానే రాష్ట్రంలో ఇప్పుడు మళ్లీ కరువు చంద్రబాబు సీఎంగా ఉండగా తెలంగాణలో కరువు ఉండేదని, ఇప్పుడు చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తెలంగాణలో మళ్ళీ కరువు వచ్చిందని వారు విమర్శించారు. రేవంత్ పత్రికల్లో ఇచ్చే అధికారిక ప్రకటనల్లో ఇప్పటికే మార్పు వచ్చిందనీ, ఉపముఖ్యమంత్రి భట్టి ఫొటో ప్రకటనల్లో అదశ్యమయ్యిందన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ ప్రకటనల్లో అమిత్ షా, చంద్రబాబు ఉంటారని ఆరోపించారు. గతంలో చంద్రబాబు ఆదేశాల మేరకే తెలంగాణ ఉద్యమంపై రేవంత్ రైఫిల్ ఎక్కు పెట్టారని గుర్తు చేశారు. రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నరేంద్రమోడీ చేతిలో పెడుతున్న తీరును కాంగ్రెస్ శ్రేణులు గమనించాలన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణలో ప్రభుత్వం మారుతుందని బీజేపీ నేతలు ఇస్తున్న ప్రకటనలు రేవంత్‌ను దష్టిలో పెట్టుకుని ఇస్తున్నవేనని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, నేతలు ఆరోపించారు. -
ఆరు గ్యారంటీలకు కాంగ్రెస్ తూట్లు
రామడుగు/గంగాధర: గత ఎన్నికల్లో అర్హులందరికీ ఆరు గ్యారంటీ పథకాలు వర్తింపజేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రె స్.. అధికారంలోకి వచ్చాక ఆ పథకాలకు తూట్లు పొడుస్తోందని కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ జాతీయ ప్రధా న కార్యదర్శి బండి సంజయ్‌కుమార్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్రావుపేట, రామ డుగు, శ్రీరాములపల్లి, తిర్మలాపూర్, షానగర్‌లో బండి సంజయ్‌కుమార్ శనివారం పర్యటించి, వివిధ అభివృద్ధి పను లకు శంకుస్థాపన చేశారు. ప్రజాహిత యాత్రలో భాగంగా ప్రజలతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.106.04 కోట్లు వెచ్చించి రామగుండంలో పలు అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. కాంగ్రెస్ గెలిస్తే బంగ్లాదేశ్, పాకి స్తాన్ నుంచి నిధులు తీసుకొస్తుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీ అభ్యర్థులను ఎంపీలుగా గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు విడుదల చేయిస్తామని అన్నా రు. మాజీ ఎమ్మెల్యే బోడిగె శోభ, బీజేపీ రామడుగు మండల అధ్యక్షుడు ఒంటెల కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, అనారోగ్యంతో బాధపడుతు న్న బీజేపీ నాయకుడు డబుల్కార్ రాజును బండి సంజయ్ పరామర్శించారు. జీతాలివ్వడానికి డబ్బుల్లేవ్.. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని బండి సంజయ్ దుయ్యబట్టారు. గంగాధరలో చేపట్టిన ప్రజాహితయాత్రలో ఆయన మాట్లాడారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అంది స్తామని గతంలో మాజీ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, పైసా ఇవ్వకుండా వారిని మోసం చేశారని ధ్వజమెత్తారు. సాగునీరు విడుదల చేయకపోవడంతో గంగాధర మండలంలో పంటలు ఎండిపోతున్నాయని, తక్షణం నీటిని విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
నేడు బీజేపీ రెండో జాబితా?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల మలి జాబితా ఖరారు కసరత్తు ఊపందుకుంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకుగాను ఇప్పటికే 9 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. మిగిలిన 8 సీట్లకు సంబంధించి ఆదివారం రెండో జాబితాను ప్రకటించే అవకాశాలున్నాయి. ఢిల్లీలో జరిగే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పెండింగ్‌లో ఉన్న 8 సీట్లలో కొన్నింటికి అభ్యర్థులను ప్రకటించ వచ్చునని పార్టీ వర్గాల సమాచారం. జలగం భేటీలు కొలిక్కి వచ్చేనా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు శుక్రవారం ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్‌కుమార్‌రెడ్డితో కలవగా, శనివారం బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ పొంగులేటి సుధాకర్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ భేటీల్లో పార్టీలో చేరికతో పాటు ఖమ్మం నుంచి పోటీ విషయంలో త్వరలోనే తన నిర్ణయం ప్రకటిస్తామని వెంకటరావు తెలియజేసినట్లు సమాచారం. ఖమ్మం లోక్‌సభ సీట్లో వెంకటరావును నిలిపే దిశగా కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సైతం చర్చలు జరిపినట్టు పార్టీ నాయకులు చెప్తున్నారు. మాజీ సీఎం జలగం వెంగళరావు కుమారుడిగా వెంకటరావుకు గుర్తింపు ఉందని.. దీనికితోడు వెలమ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిగా, గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో ఎంపీగా పోటీ చేయిస్తే లాభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక మహబూబూబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీకి బీఆర్ఎస్ మాజీ ఎంపీ సీతారాంనాయక్ పేరు బీజేపీ పెద్దల పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. పాలమూరు సీటు డీకే అరుణకే? మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేరు దాదాపు ఖరారైందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మెదక్ సీటుకు మాజీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు, అంజిరెడ్డి పోటీపడుతున్నారు. వరంగల్ నుంచి మాజీ డీజీపీ కృష్ణప్రసాద్, చింతాసాంబమూర్తి, కొండేటి శ్రీధర్.. నల్లగొండ నుంచి జి.మనోహర్‌రెడ్డి, గోలి మధుసూదన్‌రెడ్డి, జితేందర్ గుప్తా, రంజిత్యాదవ్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్డ్ స్థానం విషయానికొస్తే.. గత ఎన్నికల్లో పోటీచేసిన ఎస్.కుమార్‌తోపాటు గాయకుడు మిట్టపల్లి సురేందర్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలోని మూడు ఎస్సీ రిజర్వ్డ్ సీట్లను మాదిగ సామాజికవర్గానికే కేటాయించడం ద్వారా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పట్ల కేంద్ర ప్రభుత్వం, బీజేపీ చిత్తశుద్ధిగా ఉన్నాయని చూపుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది. -
సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: ఎల్ఆర్ఎస్ను ఎలాంటి చార్జీలు లేకుండా అమలు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. గతంలో మీతో సహా, మీ సహచర మంత్రులు చెప్పిన మాటలు, హామీలను దృష్టిలో ఉంచుకొని ఉచితంగా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన మాటను తప్పినందుకు, ప్రజలకు అబద్ధాలు చెప్పినందుకు ప్రజలను క్షమాపణ కోరాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ అంటే దోపిడీ అన్న మీరు.. ఈరోజు ప్రజలనెందుకు దోపిడీ చేస్తున్నారో వివరించాలనీ డిమాండ్ చేస్తున్నాం. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల డిమాండ్‌ను మా నిరసన కార్యక్రమం, వినతి పత్రాల రూపంలో మీ ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ప్రజల ఆకాంక్షల మేరకు డిమాండ్ మేరకు ఉచితంగా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేయాలి’’ అని లేఖలో కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: TS: ‘బాబు పాలనను గుర్తు చేస్తున్న శిష్యుడు’ -
TS: ‘బాబు పాలనను గుర్తు చేస్తున్న శిష్యుడు’
సాక్షి, హైదరాబాద్: బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న చంద్రబాబు శిష్యుడు.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ పిలుపు ఇచ్చారు. తాజా రాజకీయ పరిణామాలపై శనివారం సుమన్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు-రేవంత్ రెడ్డి గురు శిష్యుల బంధం మరోసారి బయటపడిందని సుమన్ విమర్శలు గుప్పించారు. ‘‘చంద్రబాబు-రేవంత్ ఇద్దరూ భేటీ అయ్యి మాట్లాడుకున్నారు. ఆ తర్వాతే కాంగ్రెస్ మంత్రులు టీడీపీ ఆఫీస్‌కు పోయి చంద్రబాబుకి కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇక్కడే వాళ్ల గురుశిష్యుల బంధం బయటపడింది’’ అని సుమన్ అన్నారు. చంద్రబాబు పాలనలో తెలంగాణకు ఎంతో అన్యాయం జరిగిందని.. ఇప్పుడు ఆయన శిష్యుడు రేవంత్‌రెడ్డి మళ్లీ ఆనాటి పాలనను గుర్తు చేస్తున్నారని సుమన్ మండిపడ్డారు. ఇక.. బీజేపీతో రేవంత్ రెడ్డి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండడం పలు అనుమానాలకు తావిస్తోందని సుమన్ అన్నారు. దేశంలో.. ఆఖరికి సొంత పార్టీ(బీజేపీ) సీఎంలకు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ దొరకడం కష్టంగా ఉంది. అలాంటిది రేవంత్‌రెడ్డికి చాలా తేలికగా దొరుకుతోంది. రేవంత్ బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. వీళ్ల షేక్‌హ్యాండ్, పలకరింపులు చూస్తే ఎవరికైనా తెలిసిపోతుందా విషయం. పార్లమెంట్ ఎన్నికల తరవాత రేవంత్ రెడ్డి బీజేపీలో చేరడం కన్ఫర్మ్ అయింది. గంపగుత్తగా, హోల్ సేల్ గా ప్రభుత్వాన్ని నరేంద్రమోదీ చేతులో పెట్టబోతున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలారా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండి రాష్ట్రాన్ని కాపాడుకుందాం అని బాల్క సుమన్ పేర్కొన్నారు. -
Delhi: హైకమాండ్ నుంచి కిషన్‌రెడ్డికి పిలుపు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డికి అధిష్ఠానం నుంచి పిలుపు రావడంతో ఈ రోజు మధ్యాహ్నం ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో మెజారిటీ సీట్లు సాధించాలని లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. మిగిలిన 8 మంది అభ్యర్థులను కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తర్వాత ప్రకటిస్తామని వెల్లడించారు. జాయినింగ్ అనేది నిరంతర ప్రక్రియ.. చాలా మంది చేరుతున్నారన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఢిల్లీ వెళ్తున్నానని.. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి, రాజకీయ అంశాలు, అభ్యర్థులపై చర్చిస్తామని తెలిపారు. -
కబ్జా భూములను సరెండర్ చెయ్
సాక్షి, మేడ్చల్ జిల్లా: మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కబ్జా చేసిన ప్రభుత్వ, అసైన్డ్, చెరువు శిఖం భూములను ప్రభుత్వానికి అప్పగిస్తే ఆయన ను కాంగ్రెస్‌లో చేర్చుకుంటామని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు వ్యాఖ్యానించారు. శుక్రవారం హైదరాబాద్ శివార్లలోని కండ్ల కోయలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మామ మల్లారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి సహా మేడ్చల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రూ.25 వేలకోట్ల విలువ చేసే ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్, చెరువు శిఖం భూములను ఆక్రమించారు. అలాంటి భూకబ్జాదారులకు కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదు. అలాంటి వారు చేరేందుకు వస్తే.. జిల్లా కాంగ్రెస్ నాయకత్వం సమష్టిగా ఎదుర్కొంటుంది..’’అని మైనంపల్లి పేర్కొన్నారు. చెరువులోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదన్నారు. ప్రభుత్వ, అసైన్డ్ భూముల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని.. ఇకమీద తాము దగ్గరుండి కూల్చివేతలకు సహకరిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతల భూకబ్జాలను బయటపెడతామన్నారు. శనివారం సీఎం రేవంత్ ఆధ్వర్యంలో కండ్లకోయలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ శంఖారావం సభ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
‘మల్కాజిగిరి’కి మల్లారెడ్డి ఫ్యామిలీ దూరం!
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. లోక్‌సభ అభ్యర్థులుగా పోటీలో ఉంటారనుకున్న నేతలు బరి నుంచి తప్పుకొంటుంటే.. మరోవైపు కొత్తవారి పేర్లు తెరపైకి వస్తున్నాయి. కొందరు నేతలు, ఎంపీలు.. మరో పార్టీలో చేరి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత కాంగ్రెస్‌లో, నాగర్‌కర్నూల్, జహీరాబాద్ ఎంపీలు పి.రాములు, బీబీ పాటిల్ బీజేపీలో చేరారు. చేవెళ్ల నుంచి పోటీచేయబోనని సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి బీఆర్ఎస్ అధిష్టానానికి సంకేతాలు ఇచ్చారు. తాజాగా మల్కాజిగిరి లోక్‌సభ ఎన్నికల బరి నుంచి మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కుటుంబం తప్పుకున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ కూల్చివేతతో.. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కళాశాల భవనాలను అక్రమ నిర్మాణాలంటూ ప్రభు త్వం గురువారం కూల్చివేతలు చేపట్టిన విషయం తెలిసిందే. దీనితో మల్కాజిగిరిలో రాజకీయాలపై ప్రభావం పడింది. వాస్తవానికి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మల్కాజిగిరి అభ్యర్థిగా మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి బరిలోకి దిగడం ఖాయమనే ప్రచారం జరిగింది. పార్లమెంటు పరిధి లో భద్రారెడ్డి పేరిట ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు కూడా వెలిశాయి. కానీ గత రెండు రోజుల్లో పరిణామాలు మారి పోయాయి. మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి తదితరులు సీఎం రేవంత్ సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని కలిసి చర్చించారు. కానీ అధికారులు మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలతో కళాశాల భవనాన్ని పాక్షికంగా కూల్చివేశారు. దీనిపై మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మె ల్యేలు నిరసన వ్యక్తం చేశారు. మల్లారెడ్డిపై కక్ష సాధింపు ధోరణితో సీఎం రేవంత్ వ్యవహరిస్తున్నారని.. మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆ రోపించారు. మరోవైపు మల్లారెడ్డి కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ ప్రచారం జరిగింది. ఈ క్రమంలో మల్లారెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లోని కేసీఆర్ నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. గురు వారం రేవంత్ సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని కలవడంపై, పార్టీ మారుతున్నట్టు జరిగిన ప్రచారంపై కేటీఆర్‌కు వివరణ ఇచ్చారు. తాను పార్టీ మార డం లేదని తెలిపారు. తన అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి చెందిన కాలేజీ భవనాల కూల్చివేత అంశంలో కలిశామని వివరించారు. ఇదే సమయంలో తమ కు టుంబం లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధంగా లేదని కేటీఆర్‌కు స్పష్టం చేసినట్టు తెలిసింది. ఆస్తులపై దాడులకు భయపడేనా? సీఎం రేవంత్‌రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహి ంచిన మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీకోసం 3 ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు సిద్ధమయ్యారు. బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పేరును ప్రకటించారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి పోటీచేయడం దాదాపు ఖరారైంది. కానీ మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి ఆస్తుల పై దాడుల నేపథ్యంలో ఈ సీటు నుంచి తమ కుటుంబసభ్యులెవరూ పోటీ చేయబోరని మల్లారెడ్డి పేర్కొనడం చర్చనీయాంశమైంది. -
మిగతా స్థానాలు 20 తర్వాతేనా?
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికి నాలుగు లోక్‌సభ స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించిన ఏఐసీసీ, తెలంగాణలోని మిగిలిన స్థానాలకు ఈ నెల 20వ తేదీ తర్వాతే లైన్‌క్లియర్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈనెల 11 లేదా 14, 15 తేదీల్లో మరోమారు కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) భేటీ జరిగే అవకాశమున్నా ఆ భేటీలో తెలంగాణ అభ్యర్థులపై చర్చ ఉండకపోవచ్చని సమాచారం. తదుపరి భేటీలో తెలంగాణలోని మిగిలిన అభ్యర్థిత్వాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని, ఈ భేటీ ఈ నెల 20 తర్వాత జరిగే అవకాశముందని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. ఇటీవల జరిగిన సీఈసీ భేటీ ఎజెండాలో రాష్ట్రం నుంచి 9 పార్లమెంటు స్థానాలపై నిర్ణయం తీసుకునే అంశం ఉన్నప్పటికీ, కేవలం ఐదింటిపైనే చర్చించారని తెలిసింది. కానీ అనూహ్యంగా నాలుగింటిని మాత్రమే ఏఐసీసీ ప్రకటించింది. చేవెళ్ల నుంచి సునీతా మహేందర్‌రెడ్డి అభ్యర్థిత్వం కూడా ఖరారైందని, మలి జాబితాలో ఆమె పేరు ప్రకటిస్తారని తెలుస్తోంది. ఒకటి రిజర్వుడ్, మూడు జనరల్ తాజాగా ప్రకటించిన నాలుగు స్థానాల్లో ఒకటి రిజర్వుడ్ కాగా, మూడు జనరల్ స్థానాలు. ఇందులో మహబూబాబాద్ (ఎస్టీ) నుంచి పాతకాపు పోరిక బలరాం నాయక్‌కే మరోమారు అవకాశమిచ్చారు. ఇక్కడ టికెట్ కోసం విజయాబాయి, బెల్లయ్య నాయక్‌లు శతవిధాలా ప్రయత్నించినా హైకమాండ్ బలరాం నాయక్‌వైపే మొగ్గుచూపింది. ఇక మహబూబ్‌నగర్‌లో అందరూ ఊహించినట్టుగానే వంశీచంద్‌రెడ్డి పేరు ఖరారయింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుదిరిన ఒప్పందం మేరకు జహీరాబాద్ స్థానాన్ని బీసీ నేత సురేశ్ షెట్కార్‌కు కేటాయించారు. మరోవైపు నల్లగొండలో సీనియర్ నేత జానారెడ్డి మరోమారు తన పట్టు నిలుపుకున్నారు. ఈ స్థానం విషయంలో చాలా ఊహాగానాలు వచి్చనప్పటికీ తన కుమారుడు రఘువీర్‌కు టికెట్ ఇప్పించుకోవడంలో జానా సఫలీకృతులు కావడం గమనార్హం. ఇక, నాలుగు ప్రకటిత స్థానాల్లో రెండు రెడ్డి సామాజిక వర్గానికి, ఒకటి బీసీకి, మరొకటి ఎస్టీకి కేటాయించారు. -
నలుగురికే లైన్‌క్లియర్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న 39 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ హైకమాండ్ విడుదల చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ నుంచి పోటీ చేసే నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. జహీరాబాద్, నల్లగొండ, మహబూబాబాద్, మహబూబ్‌నగర్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం వెల్లడించారు. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉన్న సంగతి తెలిసిందే. కాగా మహబూబ్‌నగర్ నుంచి వంశీచంద్‌రెడ్డి, జహీరాబాద్ నుంచి సురేశ్ షెట్కార్, నల్లగొండ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు కుందూరు రఘువీర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ పోటీ చేయనున్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో లోక్‌సభ స్థానాలు కేటాయిస్తామంటూ ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ అధిష్టానం.. ప్రస్తుతం ప్రకటించిన నలుగురు అభ్యర్థులకు తొలి జాబితాలోనే చోటు కల్పించింది. -
Congress List: కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్, తెలంగాణ అభ్యర్థులు వీళ్లే..
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల కోసం కాంగగ్రెస్ తొలి జాబితాకు ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో శుక్రవారం సాయంత్రం 36 మందితో కూడిన తొలి జాబితాను అధికారికంగా రిలీజ్ చేయనుంది. ఇందులో తెలంగాణలో నాలుగు స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లిస్ట్‌లో .. జహీరాబాద్ సురేష్ కుమార్ షెట్కార్, నల్లగొండ కందూరు రఘువీర్‌రెడ్డి, చేవెళ్ల సునీతా మహేందర్‌రెడ్డి, మహాబూబాద్ నుంచి బలరాం నాయక్ పేర్లు ఉన్నాయి. ఇక కాంగ్రెస్ తొలి జాబితాలో హోల్డ్‌లో ఉంచిన స్థానాల్లో మహబూబ్ నగర్ పార్లమెంటరీ స్థానం కూడా ఉంది. మహబూబ్ నగర్ నుంచి అభ్యర్థిగా వంశీ చంద్ రెడ్డి పేరును టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. అయినప్పటికీ వంశీ పేరును ఏఐసీసీ హోల్డ్‌లో ఉంచడం గమనార్హం. మరోవైపు ఆ పార్టీ కీలక నేత, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వయనాడ్ నుంచే పోటీ చేయబోతున్నారు. అలాగే కన్నడ హీరో శివరాజ్ కుమార్ భార్య గీతకు శివమొగ్గ టికెట్‌ను కేటాయించింది ఏఐసీసీ. కిందటి ఏడాదే ఆమె కాంగ్రెస్‌లో చేరారు. ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బాఘేల్‌ను.. రాజ్‌నంద్‌గావ్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించబోతోంది కాంగ్రెస్. కేసీ వేణుగోపాల్ మరికాసేపట్లో ప్రెస్ మీట్ నిర్వహించి తొలి జాబితాను అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. -
తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల కోసం.. తెలంగాణలో తొమ్మిది స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ మిగతా చోట్ల బలమైన అభ్యర్థుల కోసం వేట కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టి.. ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలకు గాలం వేస్తోంది. ఆ పార్టీలోని కీలక నేతలను.. టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్లను.. టికెట్ దక్కే ఆస్కారం లేనివాళ్లను తమ వైపు తిప్పుకునే యత్నం చేస్తోంది. తాజాగా.. శుక్రవారంనాడు మహబూబాబాద్ మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సీనియర్ నేత సీతారాం నాయక్ ఇంటికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వెళ్లారు. ఇటీవల బీఆర్ఎస్ మహబూబాబాద్ పార్లమెంటరీ సన్నాహాక సమావేశంలో.. సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవితకే టికెట్ ఉంటుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. దీంతో అప్పటిదాకా క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా కనిపించిన సీతారాం నాయక్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఇదీ చదవండి: తొమ్మిదిలో ముగ్గురు సిట్టింగ్‌లే! కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయిన సీతారాం నాయక్.. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అప్పటి కేంద్రమంత్రి బలరాం నాయక్‌ను ఓడించారు. అయితే గత ఎన్నికల్లో కేసీఆర్ చెప్పడంతో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. ఆ స్థానంలో రెడ్యా నాయక్ తనయ, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే కవిత మాలోత్‌కు బీఆర్ఎస్కు టికెట్ ఇవ్వగా.. ఆమెనెగ్గారు. ఈసారి ఎలాగైనా టికెట్ దక్కుతుందనే ఆశతో ఉన్న సీతారాం నాయక్‌కు అధిష్టానం ప్రకటన తీవ్ర అసంతృప్తి కలిగించింది. దీంతో తమ పార్టీలో చేర్చుకుని సీతారాం నాయక్‌కు ఎంపీ టికెట్ ఆఫర్ చేసే యోచనలో బీజేపీ ఉన్నట్లు స్పష్టమవుతోంది. ‘‘సీతారాం నాయక్ లాంటి వాళ్లు బీజేపీలోకి వస్తే కాదంటామా?.. బీజేపీలో చేరాలన్నది ఇక ఆయనే నిర్ణయించుకోవాలి’.. సీతారాం నాయక్‌ను కలిసిన అనంతరం కిషన్‌రెడ్డి చెప్పిన మాటలివి. ‘‘బీఆర్ఎస్ కోసం అహర్నిశలు శ్రమించా. కానీ, అధిష్టానం పట్టించుకోలేదు. బీజేపీ నుంచి చేరాలనే ప్రతిపాదన వచ్చింది. కార్యకర్తలతో చర్చించి త్వరలో నిర్ణయం ప్రకటిస్తా’’ అని మీడియాకు సీతారాం నాయక్ తెలిపారు. ఇక.. గులాబీ జెండా పట్టుకునే నాధుడే లేని రోజుల్లో ఆయన ఖమ్మంలో ఆ పార్టీ తరఫున గెలిచిన ఏకైక వ్యక్తి జలగం వెంకటరావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఐదవ ముఖ్యమంత్రి అయిన జలగం వెంగళరావు తనయుడే ఈయన. అయితే కాలక్రమేణ రాజకీయాలు ఆయన్ని బీఆర్ఎస్కు దూరం చేశాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మరో పార్టీ తరఫున పోటీ చేసినా.. రెండో స్థానానికే పరిమితం అయ్యారాయన. దీంతో ఆయన్ని బీజేపీలోకి తీసుకుని ఖమ్మం ఎంపీ టికెట్ ఆఫర్ చేయాలని బీజేపీ భావిస్తోంది. బీజేపీ నేత, మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి జలగంను కలిసి బీజేపీలోకి ఆహ్వానించగా.. ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వీళ్లతోపాటు.. మరికొందరు బీఆర్ఎస్ నేతలతోనూ బీజేపీ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. -
మహిళా వ్యతిరేక ప్రభుత్వంగా రేవంత్ సర్కార్: ఎమ్మెల్సీ కవిత ఫైర్
సాక్షి, హైదరాబాద్: మహిళా వ్యతిరేక ప్రభుత్వంగా కాంగ్రెస్ రేవంత్ ప్రభుత్వం మారుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ, జీవో-3 తీసుకువచ్చి ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కాగా, ఎమ్మెల్సీ కవిత ఈరోజు ఇందిరా పార్క్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు జరుగుతున్న అన్యాయం, జీవో-3 రద్దు డిమాండ్ చేయాలని ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమంలో భారత్ జాగృతి శ్రేణులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. రాజ్యాంగం వచ్చిన తర్వాత మహిళల కోసం అనేక చట్టాలు చేసుకుంటూపోతున్నాం. మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు ఉన్నాయి. తెలంగాణ వచ్చాక మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు పోలీస్ శాఖలో కల్పిస్తున్నాం. ప్రతీ యూనివర్సిటీలో మహిళల సంఖ్య పెరిగింది. పోటీ పరీక్షల్లో మహిళలే టాప్ వస్తున్నారు. 33 శాతం మహిళా రిజర్వేషన్లు కావాలనే కేసీఆర్ కోరారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ, జీవో-3 తీసుకొచ్చి ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం జరిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ప్రభుత్వం తెచ్చిన జీవో-3 వల్ల మహిళలకు కేవలం 12 శాతం మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. మహిళా వ్యతిరేక ప్రభుత్వంగా రేవంత్ ప్రభుత్వం మారుతోంది. ప్రజలను కలవడంలేదని కేసీఆర్‌ను విమర్శించిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఆయనెందుకు ప్రజలకు కనపడటం లేదు. ఆయన ఢిల్లీ నేతలనే మాత్రమే కలుస్తారు. తెలంగాణ ప్రజలను రేవంత్ కలవడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
ఎమ్మెల్సీలపై మళ్లీ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్ర సత్యనారాయణలను నియమించాలంటూ రాష్ట్ర కేబినెట్ చేసిన సిఫార్సు లపై గవర్నర్ వ్యవహరించిన తీరు సరికాదని రాష్ట్ర హైకోర్టు పేర్కొంది. సదరు సిఫార్సులను తిరస్క రిస్తూ 2023 సెప్టెంబర్ 19న గవర్నర్ ఇచ్చిన ఆదేశా లను రద్దు చేసింది. దీంతోపాటు గవర్నర్ ఆదేశాల మేరకు కోదండరామ్, ఆమెర్ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ఈ ఏడాది జనవరి 27న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను కూడా రద్దు చేసింది. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని.. మరోసారి ఎమ్మెల్సీల పేర్లను కేబినెట్ లో ప్రతిపాదించి గవర్నర్‌కు పంపాలని స్పష్టం చేసింది. ఈ మేరకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక వివాదంపై దాఖలైన పిటిషన్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటిల ధర్మాసనం గురువారం కీలక తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171 (5) ప్రకారం.. కేబినెట్ సాయం, సలహా మేర కు గవర్నర్ వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొంది. కేబినెట్ సిఫార్సు చేసిన వ్యక్తుల అర్హత, అనర్హత అంశాలను పరిశీలించడానికి గవర్నర్‌కు అధికారం ఉంటుందని.. కావాలంటే అవసరమైన పత్రాలు, సమాచారం కోరవచ్చని తెలిపింది. కేబినెట్ సిఫార్సులను పునఃపరిశీలనకు పంపే అధికారం కూడా ఉంటుందని స్పష్టం చేసింది. వాస్తవానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ప్రకారం కోర్టుకు గవర్నర్ జవాబుదారీ కాదని.. గవర్నర్‌కు కోర్టులు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేవని పేర్కొంది. కానీ హైకోర్టుకు న్యాయసమీక్ష చేసే అధికారం ఉంటుందని వివరించింది. ‘గవర్నర్ కోటా’ పిటిషన్లపై వాదనలను పరిశీలించాక.. రాజ్యాంగంలోని నిబంధనలకు అనుగుణంగా తగిన చర్య తీసుకోవాలని భావించి తీర్పునిస్తున్నట్టు తెలిపింది. ఇక అప్పటి కేబినెట్ సిఫార్సులను అమలు చేయాలన్న పిటిషనర్ల డిమాండ్‌పై చర్చ అనవసరమని.. వారు గవర్నర్ తిరస్కరించడాన్ని మాత్రమే సవాలు చేశారని పేర్కొంది. ‘గవర్నర్ కోటా’వివాదం ఇదీ.. 2023 జూలై 31న భేటీ అయిన గత ప్రభుత్వ కేబినెట్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్ర సత్యనారాయణల పేర్లను గవర్నర్‌కు సిఫార్సు చేసింది. గవర్నర్ ఈ సిఫార్సులను తిరస్కరిస్తూ సెప్టెంబర్ 19న ఆదేశాలు జారీ చేశారు. దీంతో గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లు విచారణలో ఉండగానే.. కొత్త ప్రభుత్వ కేబినెట్ సిఫార్సు మేరకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, జర్నలిస్టు ఆమెర్ అలీఖాన్‌ల నియామకానికి గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ ఏడాది జనవరి 27న ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ నియామకాలను కూడా శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. రెండు అంశాలపైనా హైకోర్టు సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. కోదండరామ్, ఆమెర్ అలీఖాన్‌ను ప్రధాన పిటిషన్లో ఇంప్లీడ్ చేసింది. వారి ప్రమాణస్వీకారంపైనా స్టే ఇచ్చింది. తాజాగా తీర్పు వెలువరించింది. గవర్నర్ నిర్ణయం అభ్యంతరకరం! ‘‘దాసోజు శ్రవణ్ రాజకీయ నాయకుడన్న కారణంగా గవర్నర్ తిరస్కరించారు. తర్వాత నియామకమయ్యే వారు కూడా రాజకీయాలకు సంబంధం లేకుండా ఉండాలి. కానీ నియామకమైన వారు కూడా రాజకీయ నాయకులే. అందులో ఒకరు రాజకీయ పార్టీనే నడిపిస్తున్నారు’’ అని హైకోర్టులో దాసోజు శ్రవణ్ తరఫున సీనియర్ న్యాయవాది ఆదిత్యా సోంధీ వాదనలు వినిపించారు. ‘‘గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వ అర్హతలకు.. పిటిషనర్ల నామినేషన్ తిరస్కరణ కారణాలకు పొంతన లేదు. మంత్రివర్గ సిఫార్సులను తిరస్కరించే అధికారం గవర్నర్‌కు లేదు. దీనిపై సుప్రీంకోర్టు తీర్పులున్నాయి. గవర్నర్‌కు అభ్యంతరం ఉంటే పునః పరిశీలన కోసం వెనక్కి పంపవచ్చు. గవర్నర్ తిరస్కరణ కారణంగా హక్కును కోల్పోయిన పిటిషనర్‌కు కోర్టును ఆశ్రయించే అర్హత ఉంటుంది. శ్రవణ్, సత్యనారాయణల పేర్లను నెలల తరబడి పరిశీలించిన గవర్నర్.. కోదండరామ్, ఆమెర్ అలీఖాన్‌ల పేర్లను మాత్రం కొత్త కేబినెట్ సిఫార్సు చేసిన వెంటనే ఆమోదించింది’’ అని వివరించారు. కుర్ర సత్యనారాయణ తరఫున సీనియర్ న్యాయవాది మయూర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘‘మంత్రి మండలి సిఫార్సులను గవర్నర్ వెనక్కి పంపడానికి, తిరస్కరించడానికి తేడా లేదని పేర్కొనడం సరికాదు. ప్రభుత్వం సిఫార్సు చేసిన అభ్యర్థులపై గవర్నర్‌గా సంతృప్తి చెందడం వేరు.. ఓ వ్యక్తిగా సంతృప్తి చెందడం వేరు. పిటిషనర్ల పేర్లను గవర్నర్ వ్యక్తిగతంగా తిరస్కరించినట్టు కనిపిస్తోంది’’ అని పేర్కొన్నారు. గవర్నర్.. రబ్బర్ స్టాంప్ కాదు.. ‘‘ఎవరికైనా రాజ్యాంగం అనేది సుప్రీం. దాన్ని ఎవరైనా అనుసరించాలి. భాషాపరమైన, సైన్స్ వంటి రంగాల్లో సేవలందించిన వారిని మంత్రి మండలి సిఫార్సు చేయాలి. అలా కాకుండా రాజకీయ విభాగాలకు చెందిన వారిని సిఫార్సు చేస్తే.. కారణాలను పేర్కొంటూ తిస్కరించే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. గవర్నర్ రబ్బర్ స్టాంప్ కాదు. గవర్నర్ తిరస్కరించిన తర్వాత వేరేవారి పేర్లు పంపడానికి ప్రభుత్వానికి అవకాశం ఉన్నా పంపలేదు. మంత్రి మండలి సిఫార్సులను వెనక్కి పంపిన గవర్నర్ చర్యలను అలహాబాద్, బాంబే హైకోర్టులు గతంలో సమర్థించాయి. కోదండరామ్, ఆమెర్ అలీఖాన్‌లను గవర్నర్ నేరుగా ఏమీ నియమించలేదు. మంత్రి మండలి సిఫార్సు చేసిన తర్వాత.. ఆయా రంగాల్లో వారు చేసిన సేవను పరిశీలించి ఆమోదముద్ర వేశారు’’ అని కోదండరామ్, అలీఖాన్‌ల తరఫు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ కోర్టుకు విన్నవించారు. ప్రభుత్వ సిఫార్సు మేరకే నియామకం.. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) వాదనలు వినిపిస్తూ.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఇద్దరి పేర్లను ఎమ్మెల్సీలుగా సూచిస్తూ జనవరి 24న ప్రభుత్వం సిఫార్సు చేసిందని, దాన్ని పరిశీలించాకే గవర్నర్ ఆమోదించారని వివరించారు. ఇదంతా చట్టప్రకారమే జరిగిందన్నారు. గతంలో ప్రభుత్వం చేసిన సిఫార్సులను పక్కకుపెట్టే అధికారం ఇప్పుడున్న సర్కార్‌కు ఉంటుందని స్పష్టం చేశారు. – గవర్నర్ కార్యదర్శి తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.అశోక్ ఆనంద్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. ‘‘గవర్నర్ నిర్ణయాలను కోర్టులు విచారించలేవు. రాజ్యాంగం గవర్నర్ విచక్షణాధికారాలకు పూర్తి రక్షణ కల్పించింది. గవర్నర్ విచక్షణ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మంత్రి మండలి సలహాపై.. మరొకటి సొంత విచక్షణాధికారం. ప్రజాప్రతినిధుల కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నుకునే అవకాశం ఎమ్మెల్యేలకు ఎలా ఉంటుందో.. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలను నియమించే విచక్షణాధికారాలు గవర్నర్‌కు ఉన్నాయి’’ అని వివరించారు. -
అభివృద్ధి కోసమే కేంద్రంతో సఖ్యత
కంటోన్మెంట్: రాష్ట్రంలో అభివృద్ధి పనులకు నిధుల కోసం కేంద్రంతో సఖ్యతగానే ఉంటామని, అదే రాజకీయాల విషయానికి వస్తే మాత్రం పోరాటం చేస్తూ ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించకపోతే కొట్లాడుతామని చెప్పారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలనీ, ఎన్నికలు ముగిశాక అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.2,232 కోట్లతో రాజీవ్ రహదారిపై చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ పనులకు అల్వాల్ టిమ్స్ ఆవరణలో భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణతోనే ఈ ప్రాజెక్టు ఆలస్యమైందన్నారు. ప్రజల అవసరాన్ని మర్చిపోయి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంతో గిల్లికజ్జాలు పెట్టుకుని ప్రాజెక్టును పక్కన బెట్టిందన్నారు. తాము అధికారంలోకి రాగానే కేంద్రంతో మాట్లాడి సమస్యను పరిష్కరించామని తెలిపారు. ప్రధాని మోదీని, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ను కలిసి ప్రాజెక్టు అవసరాన్ని వివరించామని చెప్పారు. రక్షణ శాఖకు భూములు అప్పగించామనీ, అదే సమయంలో ఎలివేటెడ్ కారిడార్ కోసం రక్షణ శాఖ భూములు కావాలని కోరామని సీఎం వివరించారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంతో కేంద్రం రాష్ట్రానికీ సహకరించిందని తెలిపారు. బీఆర్ఎస్ దిక్కుమాలిన విధానాలతో ప్రజలకు శిక్ష.. ప్రజల అవసరాల కోసమే ఒక మెట్టు దిగాం తప్ప రాజకీయాల కోసం కాదని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్‌లో ఏదైనా ఒక శాశ్వత అభివృద్ధి చేశారా అని ప్రశ్నించారు. గత పదేళ్లలో గంజాయి, డ్రగ్స్, పబ్‌లు తప్ప ఏమీ రాలేదని ఎద్దేవా చేశారు. ’’ఎలివేటెడ్ కారిడార్ విషయంలో మా పోరాటం ఫలించిందని కేటీఆర్ అంటున్నాడు.. ఇంతకీ ఆయన ఏం పోరాటం చేసిండు. ట్విటర్ లో పోస్టులు పెట్టుడే ఆయన పోరాటమా?’’ అని ప్రశ్నించారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఇందిరా పార్కు వద్ద కేటీఆర్ ఆమరణ దీక్ష చేయాలని సూచించారు. కేటీఆర్ చచ్చుడో అభివృద్ధికి నిధులు వచ్చుడో అని దీక్ష చేయాలన్నారు. కేటీఆర్ దీక్షకు దిగితే కాంగ్రెస్ కార్యకర్తలే ఆయన్ను కంచె వేసి కాపాడుతారన్నారు. కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సెక్రెటరీ బి.అజిత్ రెడ్డి, హెచ్ఎండీఏ అదనపు కమిషనర్ ఆమ్రపాలి, కంటోన్మెంట్ బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ సోమశంకర్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పాల్గొన్నారు.