తెగిన చేతులు తిరిగొచ్చాయ్‌.. 

Tamil Nadu: New hands, new job for this double amputee - Sakshi

చెన్నై స్టాన్లీ ఆస్పత్రి   వైద్య బృందం ఘనత  

విద్యుదాఘాతంలో రెండు చేతులూ కోల్పోయిన బాధితుడు 

దాత చేతులను విజయవంతంగా అమర్చిన వైద్యులు  

సాక్షి ప్రతినిధి, చెన్నై: విద్యుదాఘాతంతో రెండు చేతులూ కోల్పోయి వికలాంగుడిగా మారిన యువకుడికి తిరిగి రెండు చేతులూ వచ్చాయి. చెన్నై స్టాన్లీ ప్రభుత్వాస్పత్రి వైద్యుల బృందం శస్త్రచికిత్స చేసి దాత ఇచ్చిన రెండు చేతులను విజయవంతంగా అమర్చింది. తమిళనాడు ప్రభుత్వాస్పత్రుల చరిత్రలోనే ఇది తొలి శస్త్రచికిత్సగా రికార్డులకెక్కింది. తమిళనాడు ప్రభుత్వం అతడికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చింది.  

తమిళనాడు ప్రభుత్వాస్పత్రుల చరిత్రలోనే ప్రథమం 
దిండుగల్లు జిల్లా ఆత్తూరు సమీపం పోడికామన్‌వాడిలోని పేద కుటుంబానికి చెందిన 30 ఏళ్ల నారాయణస్వామి భవన నిర్మాణ కార్మికుడు. పనుల్లో భాగంగా ఇంటిపై స్లాబ్‌ వేస్తూ పొడవాటి ఇనుప కమ్మీని పైకెత్తగా పైనున్న హైటెన్షన్‌ వైరు తగిలి.. మోచేతి వరకు అతడి రెండు చేతులు పూర్తిగా కరిగి తెగిపోయాయి. 2015 ఆగస్టు 2న ఈ ఘటన జరిగింది. కోయంబత్తూరులోని ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందినా ఫలితం లేకుండా పోయింది. దిండుగల్లు జిల్లా కలెక్టర్‌ డీజీ వీణ సిఫార్సు మేరకు గతేడాది చెన్నైలోని ప్రభుత్వ స్టాన్లీ ఆస్పత్రి వైద్యులను సంప్రదించాడు. దాతలు ఎవరైనా ముందుకొస్తే వారి నుంచి సేకరించి రెండు చేతులను అమర్చవచ్చని వైద్యులు ఆశాభావం వ్యక్తంచేశారు. బాధితుడి సమీప బంధువు బ్రెయిన్‌ డెడ్‌కు గురికాగా రెండు చేతులూ దానం చేసేందుకు అతడి కుటుంబీకులు అంగీకరించారు. గతేడాది ఫిబ్రవరి 7న నారాయణస్వామిని హుటాహుటిన విమానంలో చెన్నైకి రప్పించారు. ఆస్పత్రిలోని అవయవదానం విభాగాధిపతి డాక్టర్‌ వి.రమాదేవి నేతృత్వంలో 75 మందితో కూడిన వైద్యుల బృందం 13 గంటల పాటు శ్రమించి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. ఏడాదిపాటు వైద్యుల పర్యవేక్షణలో పూర్తిగా కోలుకున్న నారాయణస్వామి ఈ నెల 4న స్వగ్రామానికి చేరుకున్నాడు. దాత నుంచి చేతులు సేకరించి మరొకరికి అమర్చడం తమిళనాడు ప్రభుత్వ ఆస్పత్రుల చరిత్రలో ఇదే ప్రథమం అని డాక్టర్‌ రమాదేవి మంగళవారం మీడియాతో చెప్పారు. ఇదిలా ఉండగా బాధితుడికి దిండుగల్లు జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రి వార్డు మేనేజర్‌గా ఉద్యోగమిస్తూ సీఎం పళనిస్వామి ఉత్తర్వులిచ్చారు.    

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top