మృత్యు తటాకం..!

saddala pond turned into mini tank bund - Sakshi

ప్రాణాలు బలితీసుకుంటున్న సద్దల చెరువు

గస్తీలోపమా.. రక్షణలేమి కారణమా..?

మినీట్యాంక్‌ బండ్‌గా మారుతున్నా.. ప్రత్యేక చర్యలు శూన్యం

మూడునెలల కాలంలో చెరువులో పడి ఇద్దరు యువకుల మృతి

ప్రమాదాల నివారణలో పోలీస్, మున్సిపల్‌ యంత్రాంగం విఫలం

దురాజ్‌పల్లి : జిల్లా కేంద్రంలో మినీట్యాంకుబండ్‌గా మారుతున్న సద్దల చెరువు (తటాకం) మృత్యుతీరంగా మారుతుందా..? ఇందుకు ఇటీవల కాలంలో జరిగిన రెండు సంఘటనలు నిజమేననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గస్తీలోపమో...రక్షణ లేకపోవడమో కానీ.. నిండు ప్రాణాలు చెరువులో కలిసిపోతున్నాయి. ఇటీవల పట్టణంలోని ఒకే కాలనీకి చెందిన ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు పోవడమే ఇందుకు నిదర్శనం. 2018 జనవరి 26 అర్ధరాత్రిర పట్టణంలోని అన్నాదురైనగర్‌కు చెందిన నంద్యాల శ్రీనివాస్‌ చెరువులో దూకి సూసైడ్‌ చేసుకోగా.. 2017 నవంబర్‌ 11 అన్నాదురై నగర్‌కు చెందిన అలువాల సాయి అనే యువకుడు ప్రమాదవశాత్తు సద్దల చెరువులో జారిపడి మరణించాడు.

మూడు నెలల కాలంలోనే ఇద్దరు వ్యక్తులు.. అదీ ఒకే కాలనీకి చెందిన వారు చెరువులో ప్రాణాలొదలడంతో పట్టణంలో చర్చనీయాంశమైంది. ఇలాంటి సంఘటనలు గత కొన్ని సంవత్సరాల్లో చాలానే జరిగాయి. గతంలో కంపచెట్లతో చెరువు నిండి ఉండడంతో ప్రమాదాలను గుర్తించలేకపోయారు. కానీ.. ఇప్పుడు మినీ ట్యాంక్‌బండ్‌గా మారిన తర్వాత కూడా ప్రమాదాలను నివారించలేకపోతున్నారంటే అది గస్తీలోపమా..? లేక చెరువుకట్టపై రక్షణగోడలు లేకపోవడమా అనేది అర్థం కావడం లేదు.
  
తూతూమంత్రంగా చర్యలు..!
గత సంత్సరం పట్టణంలో ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్న విద్యార్థి చెరువులో శవమై తేలాడు. పట్టణంలో ఒక వ్యాపారి చెరువులో శవంగా కనపడ్డాడు. అభం శుభం తెలియని పసికందులు చెరువుల్లో శవల్లా కనిపిస్తున్న సంఘటనలు కొకోల్లాలుగా చెప్పుకోవచ్చు. ఇంత జరుగుతున్నా.. ఇటు ప్రమాదాలను కానీ.. అటు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న హత్య, ఆత్మహత్య చర్యలను పోలీస్‌ యంత్రాంగా నివారించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో పోలీసు గస్తీ పెంచాలని కట్టపైకి వాహనాలు రాకుండా చూడాలని పట్టణ ప్రజలు పలుమార్లు విజ్ఞప్తి చేస్తున్నా.. చర్యలు మాత్రం తూతూమంత్రంగానే చేపడుతున్నారు. ముఖ్యం గా చెరువుకట్టపై మందుబాబుల ఆగడాలకు హద్దులు దాటుతున్నాయి. యువతీయువకులు పట్టపగలే చెరువుకట్టలపై కూర్చొని మాట్లాడుకుంటున్నారు. దీంతో ఇతరులు కూడా పెడదారి పట్టే అవకాశం ఉందని స్థానికులు వాపోతున్నారు.  

చెరువు కట్టపై రక్షణ గోడలు ఏవీ?
మినీట్యాంక్‌బండ్‌ను సుందరంగా తీర్చిదిద్దడంతో ఆహ్లాదకర వాతావరణాన్ని వీక్షించడానికి పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో వస్తున్నారు. పట్టణంలో ఉన్న పలు హాస్టళ్లకు చెందిన విద్యార్థులు సెలవు దినాలలో తమ వెంట సహాయకులు ఎవరూ లేకుండా కట్టపై తిరుగుతున్నారు. దీనికి తోడు పట్టణంలో ఇరుకురోడ్ల కారణంగా కట్టపై నుంచి స్కూల్, కళాశాలలకు చెందిన బస్సులు, ప్రయాణికులను చేరవేసే ఆటోలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. అయితే కట్ట పొడవునా రక్షణ లేకపోవడంతో ఇటీవలో ఓ బస్సు చెరువులోకి దూసుకెళ్లింది. కట్టపై రక్షణ గోడలు లేని కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికైనా పోలీసుశాఖ, మున్సిపాలిటీ అధికారులు స్పందించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టడంతోపాటు గస్తీ ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.   

రక్షణ గోడలు ఏర్పాటు చేయాలి 
మినీ ట్యాంక్‌బండ్‌గా సద్దుల చెరువును మార్చడం సంతోషమే కానీ.. అక్కడ ప్రజలకు రక్షణ ఉన్నట్టుగా కనబడటం లేదు. పట్టణానికి ఆనుకుని చెరువు ఉండడంతో క్షణికావేశంలో కొందరు, ప్రమాదాలతో మరికొందరు చెరువులో దూకి ప్రాణాలు తీసుకుంటున్నారు. కట్టపై రక్షణ గోడలు ఏర్పాటు చేసి.. పోలీసులు గస్తీ తిరగాలి.
– కోట గోపి, సూర్యాపేట
 

Read latest Suryapet News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top