
తహశీల్దార్ సుప్రియకు జైలు శిక్ష
లంచం తీసుకున్నారన్న ఆరోపణలు రుజువుకావడంతో తహశీల్దార్ సుప్రీయా సుభాష్ భగ్వడేకు జిల్లా కోర్టు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
ముంబై: లంచం తీసుకున్నారన్న ఆరోపణలు రుజువుకావడంతో తహశీల్దార్ సుప్రీయా సుభాష్ భగ్వడేకు జిల్లా కోర్టు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. మహారాష్ట్రలోని సతార్ జిల్లా కేంద్రంలో సుప్రీయ.. తహశీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఒక రైతు నుంచి రూ.21వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు.
2011, సెప్టెంబర్ 2న జరిగిన ఈ సంఘటనలో తహశీల్దార్ సుప్రియాపై మహారాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సెక్షన్ 7, సెక్షన్ 13 (అవినీతి నిరోధక చట్టం) కింద కేసు నమోదు చేశారు. నాలుగేళ్ల విచారణలో సుప్రియ లంచం తీసుకున్నట్లు తేలింది. ఏసీబీ వాదనలను సమర్థించిన కోర్టు గతవారం ఇచ్చిన తీర్పులో.. మహిళా తహశీల్దార్ కు మూడేళ్ల జైలు శిక్షతోపాటు రూ. 5వేల జరిమానా విధించింది. ఈ తీర్పు మహారష్ట్ర ప్రభుత్వాధికారులు, ఉద్యోగుల్లో చర్చనీయాంశమైంది.