మరో వెయ్యి మూత | Tasmac shops closed | Sakshi
Sakshi News home page

మరో వెయ్యి మూత

Jul 13 2016 2:46 AM | Updated on Nov 9 2018 5:56 PM

మరో వెయ్యి మూత - Sakshi

మరో వెయ్యి మూత

మరో వెయ్యి టాస్మాక్ మద్యం దుకాణాల మూతకు తగ్గ కసరత్తుల్లో రాష్ర్ట ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రజలకు ఇబ్బంది కరంగా

టాస్మాక్ దుకాణాల మూతకు సిద్ధం
 పరిశీలనకు శ్రీకారం
 పట్టినంబాక్కంపై కరుణ ఆగ్రహం

 
 మరో వెయ్యి టాస్మాక్ మద్యం దుకాణాల మూతకు తగ్గ కసరత్తుల్లో రాష్ర్ట ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రజలకు ఇబ్బంది కరంగా ఉన్న ప్రాంతాల్లోని టాస్మాక్‌ల గుర్తింపు పరిశీలనకు జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. పట్టినంబాక్కం టాస్మాక్ మూతకు పట్టుబడుతూ సాగుతున్న నిరసనలపై ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ డీఎంకే అధినేత ఎం.కరుణానిధి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 సాక్షి, చెన్నై: రాష్ట్రంలో అధికారంలోకి వస్తే దశల వారీగా మద్య నిషేదం అన్న వాగ్దానాన్ని అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జె.జయలలిత ఇచ్చిన విషయం తెలిసిందే. అధికార పగ్గాలు చేపట్టగానే, మద్య నిషేధంపై దృష్టి పెడుతూ, తొలుత పని వేళల్ని రెండు గంటల పాటుగా తగ్గించారు. తదుపరి ఐదు వందల టాస్మాక్ దుకాణాల మూతకు చర్యలు చేపట్టి, గత నెలాఖరులో ఆ దుకాణాలకు శాశ్వతంగా తాళం వేశారు. ఐదు వందల దుకాణాలకు తాళం పడ్డా, మద్యం విక్రయాల్లో మాత్రం ఏ మాత్రం తగ్గుదల లేదు. పని వేళలు తగ్గినా, దుకాణాలు మూత బడ్డా, విక్రయాల రూపంలో  రాబడి ఏ మాత్రం తగ్గలేదు. ఈ పరిస్థితుల్లో మరో వెయ్యి దుకాణాల మూతకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఉన్నది. ఇందుకు తగ్గ ఆదేశాలు రాష్ట్ర మార్కెటింగ్‌కు శాఖకు జారీ చేసి ఉన్నారు.
 
 మరో వెయ్యి: ప్రస్తుతం ఐదు వందల దుకాణాలు మూత పడ్డ దృష్ట్యా, మరో వెయ్యి దుకాణాల్ని మూయడానికి తగ్గ పరిశీలనకు శ్రీకారం చుట్టారు. దుకాణాల మూత కసరత్తులో భాగంగా, ఎక్కడెక్కడ ప్రజలకు ఇబ్బందికరంగా దుకాణాలు ఉన్నాయో పరిశీలించి, నివేదిక సిద్ధం చేయడానికి జిల్లాకు ముగ్గురితో కూడిన కమిటీలు మంగళవారం రంగంలోకి దిగాయి. ఆలయాలు, పాఠశాలలు, జన సంచారం అత్యధికంగా ఉండే ప్రాంతాల్లోని టాస్మాక్ మద్యం దుకాణాలతో పాటుగా, శాంతి భద్రతలకు విఘాతం కల్గించే విధంగా ఉన్న దుకాణాల్ని మూసి వేయడం లక్ష్యంగా తాజా పరిశీలించనున్నారు.
 
 ఈ నెలాఖరులోపు పరిశీలన ముగించి ఈ కమిటీలు ఆయా జిల్లాల కలెక్టర్లకు నివేదికలు సమర్పించనున్నాయి. ఆ నివేదికల్ని కలెక్టర్లు పరిశీలించి, తదుపరి మార్కెటింగ్‌శాఖకు పంపిస్తారు. తదుపరి ఎక్కడెక్కడ వెయ్యి దుకాణాల్ని మూసి వేయాలో అన్న నిర్ణయాన్ని మార్కెటింగ్ శాఖ తీసుకుంటుంది. ఈ ప్రక్రియ ఆగస్టు నెలాఖరు లేదా, సెప్టెంబరు వరకు సాగే అవకాశాలు ఉన్నాయి.
 
  మరో వెయ్యి దుకాణాల మూతకు తగ్గ కసరత్తుల్లో మార్కెటింగ్ శాఖ నిమగ్నం అయితే, పట్టినంబాక్కం టాస్మాక్ దుకాణం మూతకు రోజుల తరబడి సాగుతున్న నిరసనలపై ఎందుకు స్పందించరంటూ ప్రభుత్వాన్ని డీఎంకే అధినేత ఎం.కరుణానిధి ప్రశ్నించారు. ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దుకాణాన్ని మూసి వేయకుండా, పోలీసు భద్రత నడుమ విక్రయాలు సాగించడం సిగ్గు చేటు అని మండిపడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement