అరటి ఆకులు.. ఆపండి

Stop Banana Leafs In Hotels And Function Halls - Sakshi

కళ్యాణ మండపాలు,హోటళ్లకు సూచన  

బెంగళూరు పాలికె నిషేధం యోచన

స్టీలు ప్లేట్లను వాడాలని హితవు  

చెత్త సమస్య తలెత్తుతోందనే..

 కర్ణాటక, బనశంకరి: బెంగళూరులో చెత్త సమస్య పరిష్కారానికి చరమగీతం పాడటానికి  కొత్త, కొత్త ఆలోచనలు చేస్తున్న బీబీఎంపీ దృష్టి అరటి ఆకులపై పడింది. కళ్యాణ మంటపాలు, సభలు– సమావేశాలు, వేడుకల్లో టిఫిన్లు, భోజనాలకు అరటి ఆకులను వాడరాదని సూచిస్తోంది. వాటికి బదులు స్టీల్‌ప్లేట్లను ఉపయోగించాలని నిర్వాహకులను కోరుతోంది. అరటి ఆకులతో చెత్త సమస్య ఏర్పడుతోందని పాలికె భావిస్తుండడమే దీనికి కారణం. 

సమస్యలు వస్తున్నాయని..  
ఇటీవలి కాలంలో కాగితం లేదా ప్లాస్టిక్‌ ప్లేట్లు, గ్లాసులను వేడుకల్లో అధికంగా వినియోగిస్తున్నారు. ఆ తరువాత గుట్టలుగా పేరుకుపోతున్న ఈ చెత్తను తరలించడం, ప్రాసెస్‌ చేయడం ఎంతో కష్టంగా ఉందని పాలికె చెబుతోంది. ప్లాస్టిక్‌ ప్లేట్లు, గ్లాసులు కుళ్లిపోకపోగా, వర్షం నీటిలో కొట్టుకుపోయి డ్రైనేజీ  కాలువల్లో చేరి నీటి ప్రవాహానికి అడ్డుపడుతున్నాయి. వర్షం వచ్చినప్పుడు కాలువలు పొంగి నీరు రోడ్లు, ఇళ్లలోకి చొరబడటానికి ఇదొక కారణమని తెలుస్తోంది. ఇక బీబీఎంపీ గ్యాస్‌ ఉత్పాదన కేంద్రాల్లో వాడేసిన అరటి ఆకుల ప్రాసెసింగ్‌ సవాల్‌గా మారుతుంది. అరటి ఆకులను సేకరించడం, తరలించడం కూడా కష్టంగానే ఉండడంతో బీబీఎంపీ వాటిపై నిషేధానికి మొగ్గుచూపుతోందని సమాచారం. రాష్ట్రంలో ఇప్పటికే ప్లాస్టిక్‌ గ్లాసులు, ప్లేట్స్‌ వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. కానీకొన్ని ప్రాంతాల్లో కాగితం ప్లేట్లు, గ్లాసులు వినియోగిస్తుండగా అనేక ప్రాంతాల్లో అరటి ఆకులను వాడుతున్నారు. 

పాలికెతీరుపై తీవ్ర అభ్యంతరాలు  
అందరూ ఇష్టపడే అరటి ఆకులపై పాలికె ఆంక్షల మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తమౌతోంది. స్టీల్‌ప్లేట్లను కడగడానికి అధికనీటి వాడకం, ప్రత్యేక సిబ్బందిని నియమించాలి. అంత పెద్ద సంఖ్యలో ప్లేట్లు లభించవని కూడా అంటున్నారు. మొత్తం మీద పాలికె సూచన విచిత్రంగా ఉందని హోటల్‌ యజమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

పాలికె అధికారులు ఏమంటున్నారు  
దీనిపై పాలికె అధికారి మాట్లాడుతూ.. చెత్త సంస్కరణ కేంద్రాలకు, గ్యాస్‌ ఉత్పాదన కేంద్రాల్లో అరటి ఆకుల సంస్కరణ కష్టతరమైన నేపథ్యంలో వాటిని తక్కువగా వినియోగించాలని తెలిపామన్నారు. కానీ కచ్చితంగా నిషేధించాలని చెప్పలేదని, కొన్ని సంస్థలు స్టీల్‌ప్లేట్లను రాయితీ ధరలో అద్దెకు ఇస్తున్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కళ్యాణ మంటపాల్లో పెద్ద ఎత్తున అరటి ఆకులు వినియోగిస్తుండటంతో చెత్త అధికంగా పోగవుతుంది. దీంతో హోటల్స్, కళ్యాణ మంటపాలకు స్టీల్‌పాత్రలు వినియోగించాలని కోరినట్లు బీబీఎంపీ పొడిచెత్త విభాగం జాయింట్‌ కమిషనర్‌ సర్ఫరాజ్‌ఖాన్‌ తెలిపారు. 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top