కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలన్న రీతిలో గజ దొంగలు చెలరేగిపోయారు. ఓ జ్యువెలరీ దుకాణానికి కన్నం వేసి కోటి విలువైన నగలు దోచుకెళ్లారు.
- మండ్యలో గజ దొంగల హల్‌చల్
- జ్యువెలరీ దుకాణానికి కన్నం
- కోటి విలువైన నగలు చోరీ
మండ్య, న్యూస్‌లైన్ : కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలన్న రీతిలో గజ దొంగలు చెలరేగిపోయారు. ఓ జ్యువెలరీ దుకాణానికి కన్నం వేసి కోటి విలువైన నగలు దోచుకెళ్లారు. ఈ ఘటన గురువారం రాత్రి మండ్య పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు..మంగళూరుకు చెందిన జగన్నాథ్ శెటి మండ్య నగరసభ సమీపంలో పత్తి సిటీ కో ఆపరేటివ్ బ్యాంకు వెనుక శ్రీనిధి జ్యువెలరీ దుకాణం నిర్వహిస్తున్నాడు.
గురువారం రాత్రి దుండగులు కో ఆపరేటివ్ దుకాణంపైకి ఎక్కి తాడు సహాయంతో శ్రీ నిధి దుకాణం వెనుక ఉన్న సందులోకి దిగి గోడకు కన్నం వేసి లోపలకు చొరబడి సీసీ కెమారాలు తొలగించారు. షోకేస్‌లో ఉన్న నగలతోపాటు గ్యాస్ సిలిండర్ సహయంతో లాకర్ తెరచి అందులో ఉన్న సుమారు రూ. కోటి విలువైన బంగారు నగలు చోరీ చేసి ఉడాయించారు.
శుక్రవారం ఉదయం యజమాని వచ్చి తాళం తీసి చూడగా చోరీ ఘటన వెలుగు చూసింది. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ భూషణ్ జీబోరసే, అదనపు ఎస్పీ పుట్టమాదయ్య, డివైఎస్పీ శోభరాణి, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. రూ. కోటి విలువైన ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు.
సెక్యూరిటీ గార్డును విచారించగా రాత్రి సమయంలో తాను దుకానం ముందు కాపలా ఉన్నానని, ఎలాంటి శబ్ధం రాలేదని పేర్కొన్నాడు. సీసీ కెమెరాలను ధ్వంసం చేయడంతో అందులో ఎలాంటి వివరాలు నమోదు కాలేదని నిర్ధారించారు.దుండగులు వదలి వెళ్లిన గ్యాస్ కట్టర్, సిలిండర్, బ్యాగు, బెడ్‌షీట్‌ను స్వాధీనం చేసుకున్నారు. యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టి దుండగుల కోసం గాలింపు చేపట్టారు.