50 ఇళ్లకు ఒక సైనికుడు.. | shiv sena demands for one soldier to every 50 houses | Sakshi
Sakshi News home page

50 ఇళ్లకు ఒక సైనికుడు..

Apr 4 2014 11:05 PM | Updated on Sep 2 2017 5:35 AM

మూడో విడతలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ముంబై నుంచి పోటీచేస్తున్న తమ పార్టీ అభ్యర్థులను ఎలాగైనా గెలిపించుకోవాలని శివసేన కొత్త వ్యూహానికి శ్రీకారం చుట్టింది.

సాక్షి, ముంబై: మూడో విడతలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ముంబై నుంచి పోటీచేస్తున్న తమ పార్టీ అభ్యర్థులను ఎలాగైనా గెలిపించుకోవాలని శివసేన కొత్త వ్యూహానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల రోజున ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఆ పార్టీ కార్యకర్తలు ప్రయత్నించనున్నారు. అందుకు 50 ఇళ్లకు ఒక పార్టీ కార్యకర్తను నియమిస్తారు. దీంతో పోలింగ్ శాతం పెరగడమేగాక తమ పార్టీ అభ్యర్థికి తప్పకుండా ఓటు వేస్తారని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.

 ముంబైలోని మూడు లోక్‌సభ నియోజక వర్గాల్లో శివసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్న చోట తప్ప మిగతా అన్ని స్థానాల్లో పోటీచేస్తామని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ప్రకారం శివసేన పోటీచేస్తున్న మూడు నియోజకవర్గాల్లో ఎమ్మెన్నెస్ కూడా తమ అభ్యర్థులను బరిలో దింపింది. దీంతో శివసేన ఓట్లు చీలిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది.

 శివసేన, ఎమ్మెన్నెస్‌తోపాటు కాంగ్రెస్-ఎన్సీపీ, ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్), బీఎస్పీ, ఇండిపెండెంట్లు ఇలా వివిధ పార్టీల అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. ఈ పార్టీల వల్ల శివసేనకు ఎలాంటి ప్రమాదం లేదు. శివసేనకు ముంబైలో కచ్చితమైన ఓటు బ్యాంక్ ఉందని, అయితే ఎమ్మెన్నెస్ కారణంగా శివసేన అభ్యర్థులు ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందని ఆ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. 1,500 ఓటర్లకు ఒక పోలింగ్ బూత్ ఉంటుంది. ఎన్నికలు జరుగుతున్న సమయంలో నమోదవుతున్న శాతాన్ని బట్టి శివసైనికులు అప్రమత్తమవుతారు.
 ఏ పోలింగ్ బూత్‌లో తక్కువ శాతం నమోదైందీ తెలుసుకుని ఆ పరిధిలోని ఇళ్లకు వెళతారు. ఓటెయ్యాలని బుజ్జగించి ఇంటి నుంచి పోలింగ్ కేంద్రాలకు తీసుకొస్తారు. ఇలా వచ్చిన వారంతా శివసేనకే ఓటేస్తారనే నమ్మకం ఉండదు. కాని 50 ఇళ్లకు ఒకరు చొప్పున నియమించిన కార్యకర్తలు వారిని శివసేనకు ఓటేసేలా ప్రయత్నాలు చేస్తారు. దీంతో సునాయాసంగా విజయఢంకా మోగించవచ్చని శివసేన నాయకులు భావిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement