తిరుమలలో రెండు రోజులు సిఫార్సు లేఖలు రద్దు
వైకుంఠ ఏకాదశి కోసం తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆది, సోమ వారాలలో రెండు రోజుల పాటు దివ్యదర్శనం, ప్రత్యేక దర్శనాలు, సిఫార్సు లేఖలు, ఆర్జిత సేవలను టీటీడీ రద్దుచేసింది.
వైకుంఠ ఏకాదశి కోసం తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆది, సోమ వారాలలో రెండు రోజుల పాటు దివ్యదర్శనం, ప్రత్యేక దర్శనాలు, సిఫార్సు లేఖలు, ఆర్జిత సేవలను టీటీడీ రద్దుచేసింది. ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి ఉద్యానవనంలో భక్తులు నిండారు. మిగిలిన భక్తులను టీటీడీ సిబ్బంది మాడ వీధుల్లోకి పంపుతున్నారు. ఇప్పటికే దాదాపు లక్షమంది వరకు భక్తులు తిరుమలకు చేరుకున్నారు. వేకువ జామున 12.05 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి.
ప్రత్యేక అలంకరణ, కైంకర్యాలు జరిగిన తర్వాత దర్శనాలకు అనుమతిస్తారు. ఉదయం 2 గంటలకు వీఐపీ దర్శనం, 4 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి దివ్య దర్శనం కోసం వీఐపీలు కూడా భారీ సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకు స్వామివారిని స్వర్ణరథంపై ఊరేగిస్తారు. ద్వాదశినాడు స్వామి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. నారాయణగిరి ఉద్యానవనంలో భక్తుల సౌకర్యాలను ఈవో ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.