పరవశించిన పుణే నగరం | Pune city extasied | Sakshi
Sakshi News home page

పరవశించిన పుణే నగరం

Jul 12 2015 3:33 AM | Updated on Sep 3 2017 5:19 AM

పరవశించిన పుణే నగరం

పరవశించిన పుణే నగరం

సంత్ జ్ఞానేశ్వర్, సంత్ తుకారాం మహరాజ్ పల్లకీల రాకతో పుణే భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.

♦ సంత్ జ్ఞానేశ్వర్, సంత్ తుకారాం పల్లకీలకు ఘన స్వాగతం
♦ {పభుత్వ తీరుపై వార్కారీల అందోళన
♦ దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగిన గవర్నర్
 
 పింప్రి : సంత్ జ్ఞానేశ్వర్, సంత్ తుకారాం మహరాజ్ పల్లకీల రాకతో పుణే భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. శుక్రవారం రెండు పల్లకీలు పుణేలోకి ప్రవేశించడంతో భక్తులు జయజయ ధ్వానాలతో పూలవర్షం కురిపించారు. సంత్ తుకారాం పల్లకి సాయంత్రం 5.30 గంటలకు వాకడేవాడి నుంచి పాటిల్ ఎస్టేట్‌కు చేరుకోవడంతో పుణే కార్పోరేషన్ తరఫున నగర మేయరు దత్తాత్రేయ ధనకవడే, కమిషనరు కుణాల్ కుమార్, ఎం.పి. అనిల్ శిరోలే తదితరులు స్వాగతం పలికారు. జ్ఞానేశ్వర్ పల్లకి రాత్రి 7 గంటలకు పుణే చేరుకుంది. ఈ సందర్భంగా కులమతాలకు అతీతంగా వేలాది మంది నగర ప్రజలు ఘన స్వాగతం పలికారు.

 వార్కారీల ఆగ్రహం
 పండరీపూర్ చంద్రబాగా నది ఒడ్డున ఉండేందుకు వార్కారీ (భక్తులు) లకు అనుమతి లేదని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ర్ట ప్రభుత్వం వార్కారీలు ఉండేందుకు ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టలేదు. దీనిపై వార్కారీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్కారీ సేవాసంఘ్ అధ్యక్షుడు రాజాభావు చోపదార్, జల వనరుల మంత్రి విజయ్ శివతారే వార్కారీలకు నచ్చజెప్పడంతో పల్లకీ యాత్ర ముందుకు కదిలింది. దీనిపై జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రులతో శనివారం సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు.

 వెనుతిరిగిన గవర్నర్...
 శుక్రవారం సాయంత్రం రాష్ర్ట గవర్నర్ సి.హెచ్. విద్యాసాగరరావు సంత్ జ్ఞానేశ్వర్, సంత్ తుకారాం పల్లకీల దర్శనం కోసం పుణేకు వచ్చారు. అయితే పలు కారణాల వల్ల పల్లకీలను దర్శించుకోకుండానే వెనుదిరిగారు. వార్కారీల ఆందోళన కారణంగానే గవర్నర్ ముంబైకి తిరిగి వెళ్లిపోయినట్లు గవర్నర్ పీఆర్వో ఉమేశ్ కాశీకర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ సౌరభ్‌రావు గవర్నర్‌కు వార్కారీల ఆందోళన గురించి వివరించారని, తన రాకతో ఆందోళన మరింత ఉధృతం అయ్యే వీలుందని గ్రహించిన గవర్నర్ తన పర్యటన రద్దు చేసుకున్నారని చెప్పారు.

Advertisement

పోల్

Advertisement