
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఆయుష్
దేశ వ్యాప్తంగా త్వరలో అమల్లోకి రానున్న నూతన ఆరోగ్య పాలసీలో ఆయుష్ వైద్య విధానాలకు అధిక ప్రాథాన్యాత ....
కేంద్ర మంత్రి శ్రీపాదనాయక్
బెంగళూరు : దేశ వ్యాప్తంగా త్వరలో అమల్లోకి రానున్న నూతన ఆరోగ్య పాలసీలో ఆయుష్ వైద్య విధానాలకు అధిక ప్రాథాన్యాత ఇవ్వనున్నట్లు ఆయుష్ శాఖ కేంద్ర మంత్రి శ్రీ పాదనాయక్ తెలిపారు. ఇందులో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా ఆయుష్ వైద్య విధానాలు అందించే విధంగా విధానాలు రూపొందించనున్నట్లు చెప్పారు. బెంగళూరులోని హలసూరు వద్ద ఉన్న ఆర్‌బీఏఎన్‌ఎంఎస్ మైదానంలో బుధవారం నుంచి నాలుగురోజుల పాటు జరగనున్న జాతీయ స్థాయి ఆరోగ్యమేళాను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ... దేశ వ్యాప్తంగా ఉన్న 515 ఆయుష్ కళాశాలల నుంచి ఏడాదికి దాదాపు 27వేల మంది పట్టభద్ర వైద్యులు బయటికి వస్తున్నారన్నారు. వీరందరి సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవడం వల్ల ప్రజలకు తక్కువ ఖర్చుతోనే ఉత్తమమైన భారతీయ వైద్య సేవలను అందించవచ్చునని తెలిపారు.
ఆయుర్వేద వైద్య విధానాల పరిశోధన, ఆచరణతో పాటు వ్యాప్తి కోసం మలేషియా, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాల ప్రభుత్వాలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. మరిన్ని పొరుగు దేశాల్లో కూడా ఇదే విధమైన ఒప్పందాలను కుదుర్చుకోబోతున్నట్లు చెప్పారు. కర్ణాటకలో ఆయుష్ వైద్య విధానాల ప్రాచుర్యం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అందుకు తగినట్లు ఆర్థిక చేయూత కూడా ఇవ్వాలని కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి యు.టి.ఖాదర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఉత్తమమైన భారతీయ వైద్య విధానాల సమహారమైన ఆయుష్ పై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కృషి చేయాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వ్యవస్థాపకుడు రవిశంకర్ గురూజీ సూచించారు.