పూర్వ వైభవమే ధ్యేయం

Odisha Congress Party PCC Chief Niranjan Patnaik About Future - Sakshi

భువనేశ్వర్‌ : రాష్ట్ర కాంగ్రెస్‌లో అంతఃకలహాల బలహీనతను బిజూ జనతా దళ్, భారతీయ జనతా పార్టీలు సొమ్ము చేసుకున్నాయని రాష్ట్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీఅధ్యక్షుడు నిరంజన్‌ పట్నాయక్‌ తెలిపారు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షునిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సారిగా ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీ అంతఃకలహాల్ని తొలగించి కార్యకర్తలంతా ఉమ్మడిగా ఉద్యమించి పూర్వ వైభవాన్ని సాధించడం తన ప్రధాన కార్యాచరణగా పేర్కొన్నారు. బూత్‌ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని పునర్వ్యవస్థీకరిస్తామని తెలిపారు. ఇక నుంచి పార్టీ విజయ పంథాలో పుంజుకుంటుందని ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పుంజుకుని రాష్ట్రానికి కొత్త కళని సంతరింప చేస్తుందన్నారు.

పార్టీ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది, రాష్ట్ర రాజకీయాల్లో మూడో స్థానంలో కొనసాగుతోంది, ఇటువంటి దయనీయ పరిస్థితుల్లో తాను కీలకమైన బాధ్యతల్ని చేపట్టడం పెను సవాలుగా పేర్కొన్నారు. 4 జోన్లుగా విభజించి రాష్ట్రవ్యాప్తంగా పార్టీ పటిష్టత కోసం ప్రత్యేక కార్యాచరణ ఖరారు చేశామన్నారు. అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ ప్రముఖుల్ని కూడా ఈ జోన్లలో సభ్యులుగా నియమిస్తామని తెలిపారు. బూత్‌ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని పునర్వ్యవస్థీకరించేందుకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి జితేంద్ర సింఘ్‌ కంకణం కట్టుకున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో దీర్ఘకాలంగా ప్రాంతీయ పార్టీ రాజ్యం ఏలుతోంది. ఆశించిన మేరకు ప్రజలకు ఆ పార్టీ సేవల్ని కల్పించలేని దయనీయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది. ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీకి పట్టం గట్టిన ప్రజలు నిరుత్సాహానికి గురవుతున్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలహీనత బిజూ జనతా దళ్, భారతీయ జనతా పార్టీలకు కలిసి వచ్చింది. గత ఏడాది పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ బలహీనతతో భారతీయ జనతా పార్టీ పుంజుకోవడం ఉదహరించారు. ఈ అనుభవాల దృష్ట్యా సమైక్య ఉద్యమానికి కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం ప్రేరేపిస్తామన్నారు. బలమైన పార్టీలుగా చెలరేగుతున్న పార్టీల ఊహల్ని తలకిందులు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలతో రాష్ట్రంలో రైతు సమస్యలు, మహిళల పట్ల లైంగికదాడులు, నిరుద్యోగం వంటి సమస్యలు తాండవిస్తున్నాయన్నారు. పార్టీ శ్రేణుల్లో తప్పిదాల దృష్ట్యా ఇటీవల ఎన్నికల్లో ప్రజలు తమకు నిరాకరించిన విషయాన్ని ఆయన అంగీకరించారు. ఈ పరిస్థితుల్ని త్వరలో నివారించి పార్టీ పూర్వ వైభవం కూడగడతామని తెలిపారు. 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top