గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ అబద్ధాలకోరు అంటూ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణే విమర్శించారు.
ముంబై: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ అబద్ధాలకోరు అంటూ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణే విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి అంతా ఉత్తిత్తిదేనన్నారు. గుజరాత్ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందంటూ మోడీ చెబుతున్నారని, అయితే మహారాష్ట్రతో పోలిస్తే అది ఏ రంగంలోనూ ముందులేదన్నారు. మహారాష్ర్ట జీడీపీ రూ. 12 లక్షల కోట్లని, గుజరాత్‌లో అది రూ. 6 లక్షల కోట్లు మాత్రమేనన్నారు. ఇక వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి విషయంలో బీజేపీ గుంభనంగా వ్యవహరిస్తోందని, అయితే ప్రతి ఎన్నికల సమయంలోనూ వారు ప్రధాని అభ్యర్థి విషయంలోనే తీవ్రంగా పోటీపడతారన్నారు.
అరుణ్‌జైట్లీ, సుస్మాస్వరాజ్‌లు కూడా ప్రధాని అభ్యర్థి రేసులో ఉన్నారన్నారు. గోపీనాథ్ ముండేని అడిగినా తాను బరిలో లేననే చెబుతారన్నారు. బీజేపీ అంతర్గత పోరు తమ పార్టీకి లాభి స్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతఃకలహాలను విడనాడి సమష్టిగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. 2014 లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో అత్యధికస్థానాలను కైవసం చేసుకునేందుకు పాటుపడాలన్నారు. బీఎంసీలో శివసేన పనితీరు ఎంతమాత్రం బాగాలేదన్నారు. ముంబైని షాంఘై న గరంగా మార్చడం వారి తరం కాదన్నారు.