తమిళనాడు చట్టసభ ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్నాయి.
అన్నాడీఎంకేలో నమిత
జయలలితకు లేఖ
చెన్నై : తమిళనాడు చట్టసభ ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్నాయి.పోలింగ్‌కు మరో మూడు వారాలు మాత్రమే ఉంది. ప్రధానంగా ఈ ఎన్నికల్లో పంచమేఖ పోటీ జరగనుంది. ఈ సారి ఎన్నికల ఉత్కంఠ భరితంగా సాగనుందని చెప్పవచ్చు. గెలుపెవరిదన్నది ప్రస్తుతానికి పక్కన పెడితే అందుకు అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలతో పోరుకు సిద్ధమయ్యాయి.
ఏ ఒక్క అవకాశాన్ని జారవిడుచుకోవడానికి సిద్ధంగా లేరన్నది స్పష్టంగా అర్థం అవుతోంది. ఈ అవకాశాన్ని సినీ తారలు సద్వినియోగం చేసుకోవడానికి శ్రాయశక్తుల ప్రయత్నిస్తున్నారన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకు వారు తమ సినీగ్లామర్‌ను ఉపయోగించుకుంటున్నారు. అవకాశం ఉన్న పార్టీల్లో చేరి తమ రాజకీయ భవిష్యత్‌కు పునాదులు వేసుకునే ప్రయత్నాల్లో నిమగ్నమవుతున్నారని చెప్పవచ్చు.
సరిగ్గా నటి నమిత ఇప్పుడు అలాంటి ప్రయత్నానికే శ్రీకారం చుట్టారు. ఎంగళ్ అన్న చిత్రం ద్వారా కోలీవుడ్‌లో అడుగు పెట్టిన ఈ సూరజ్ బ్యూటీ ఆ తరువాత మహానడిగర్, ఏయ్, చాణక్య చిత్రాల్లో నటించారు. తమిళంతో పాటు తెలుగు,కన్నడం వంటి ఇతర భాషల్లోనూ నటించిన నమిత అభిమానుల కలల రాణిగా పేరు తెచ్చుకున్నారు.
అభిమానుల్ని మచ్చా(బావ) అంటూ ముద్దు ముద్దుగా పలకరిస్తూ వారి గుండెల్ని గుల్ల చేసే నమితకు కొంత కాలంగా రాజకీయాలపై ఆసక్తి పెరిగింది. త్వరలో రాజకీయ రంగప్రవేశం చేస్తానని ప్రకటించిన ఈ బొద్దుగుమ్మ ఇప్పుడు అన్నంత పని చేయడానికి సిద్ధమయ్యారు. తన రాజకీయ తెరంగేట్రానికి ఇదే సరైన సమయం అని భావించిన నమిత అన్నాడీఎంకే పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
అమ్మకు లేఖ
ఈ మేరకు నమిత అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు ఒక లేఖ రాశారు.అందులో ఆమె పేర్కొంటూ నమితనైన నేను తమిళ చిత్రపరిశ్రమలో నటిగా కొనసాగుతున్నాను.మీ రాజకీయ దక్షత, నిర్వాహణ, పార్టీ విధివిధానాలు తమిళనాడును భారతదేశ చిత్రపటంలో ఉన్నత స్థాయిలో నిలబెట్టింది.
గొప్ప రాజకీయనాయకురాలిగా రాణిస్తున్న మీ సారథ్యంలో చేరి నా వంతు సేవ చేయాలని ఆశపడుతున్నాను. మీ నేతృత్వంలో నన్ను సభ్యురాలిగా చేర్చుకోవాలని కోరుకుంటున్నాను అని నమిత తన మనోభావాన్ని వ్యక్తం చేశారు.మరి అమ్మ స్పందన ఏమిటన్నది తెలియాల్సి ఉంది.