ఊహలకు ‘ఊపిరి’! | MMRDA receives five bids for Sewri-Worli elevated corridor | Sakshi
Sakshi News home page

ఊహలకు ‘ఊపిరి’!

Oct 20 2013 12:57 AM | Updated on Sep 1 2017 11:47 PM

ప్రతిపాదిత 4.25 కి.మీ. వర్లీ-శివ్డీ ఎలివేటెడ్ మార్గం నిర్మించేందుకు ఐదు కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయి.

సాక్షి, ముంబై: ప్రతిపాదిత 4.25 కి.మీ. వర్లీ-శివ్డీ ఎలివేటెడ్ మార్గం నిర్మించేందుకు ఐదు కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయి.  శివ్డీ-నవశేవా సీ లింక్ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు ఏ ఒక్క కంపెనీ కూడా ముందుకు రాకపోవడంతో ఎమ్మెమ్మార్డీయే ఇబ్బందుల్లో పడిన విషయం తెలిసిందే.  కాని వర్లీ-శివ్డీ ప్రాజెక్టు చేపట్టేందుకు పలు కంపెనీలు అసక్తి కనబర్చడంతో శివ్డీ-నవశేవ సీ లింక్ ప్రాజెక్టుకు కూడా త్వరలో మంచిరోజుల వస్తాయని అథారిటీ భావిస్తోంది. వర్లీ సీ ఫేస్‌వద్ద ఎక్కడైతే బాంద్రా-వర్లీ సీ లింక్ వంతెన ముగుస్తుందో.. అక్కడి నుంచి ఈ ఎలివేటెడ్ మార్గం మొదలై ఎల్ఫిన్‌స్టన్ రోడ్ రైల్వే స్టేషన్, పరేల్, వడాల మీదుగా శివ్డీకి చేరుకుంటుంది.
 
 దీంతో బాంద్రా నుంచి వచ్చిన వాహనాలు నేరుగా ఈ ఎలివేటెడ్ మార్గం మీదుగా శివ్డీకి చేరుకుంటాయి. అక్కడి నుంచి నేరుగా సీ లింక్ మీదుగా నవశేవా చేరుకుంటాయి. వాహనదారులు ఇలా సులభంగా నగరం నుంచి బయటపడితే విలువైన సమయం, ఇంధనం ఆదా అవుతాయని ఎమ్మెమ్మార్డీయే భావించింది. కాని అనుకున్నదొక్కటి జరిగింది మరొకటి అన్నట్లు శివ్డీ-నవశేవా సీ లింక్ ప్రాజెక్టు పనులకు ఏ కంపెనీ కూడా టెండర్ వేసేందుకు ముందుకు రాలేదు. దీంతో ఈ ప్రాజెక్టుతోపాటు వర్లీ-శివ్డీ ఎలివేటెడ్ ప్రాజెక్టు కూడా నీరుగారిపోవడం ఖాయమని అథారిటీ భావిస్తున్న తరుణంలో ఐదు కంపెనీలు ముందుకు రావడంతో ఎమ్మెమ్మార్డీయేలో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.450 కోట్లు ఖర్చవుతాయని అంచనా. గెమన్ ఇండియా లి. హిందుస్థాన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ, లర్సన్ అండ్ టూబ్రో లి. ఎన్.సీ.సీ. లి., సింప్లెక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్  కంపెనీలు ఎలివేటెడ్ ప్రాజెక్టు చేపట్టేందుకు ఆసక్తి కనబర్చాయి. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే ప్రతీ రోజు దాదాపు 20వేలకుపైగా వాహనాలు ఈ వంతెనను వినియోగిస్తాయని ఎమ్మెమ్మార్డీయే అదనపు కమిషనర్ అశ్వినీ భిడే పేర్కొన్నారు. సదరు ఐదు కంపెనీల ప్రతిపాదనలను పరిశీలించి, అర్హత ను బట్టి ఎంపికచేసిన కంపెనీకి ప్రాజెక్టు బాధ్యతలు అప్పగించనున్నారు. ప్రత్యక్షంగా పనులు ప్రారంభమైన తర్వాత నాలుగేళ్ల కాలవ్యవధిలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు.
 
 ఇదిలా ఉండగా, నవీ ముంబైలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతిపాదనలో ఉంది. ఇక్కడ స్థల సేకరణ పనులు ఇబ్బందికరంగా మారడంతో ఈ ప్రాజెక్టు అటకెక్కింది. వర్లీ-శివ్డీ ఎలివేటెడ్, శివ్డీ-నవశేవా సీ లింక్ ఈ రెండు ప్రాజెక్టులు ప్రతిపాదిత అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంపై ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం ఒక ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు ఐదు కంపెనీలు ముందుకు రావడంతో, మిగిలిన పనులకు కూడా స్పందన వచ్చే అవకాశం ఉంటుందని అశ్వినీ భిడే ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement