Mumbai Monorail: ఆర్థిక నష్టాల్లో మోనో రైలు.. గట్టేక్కేదెలా?

Mumbai Monorail: Continues to be Plagued with Financial Problems - Sakshi

ఒక్కో ప్రయాణికుడికి సగటున రూ.200 ఖర్చు

గరిష్టంగా వసూలవుతున్న మొత్తం రూ. 50–60

ఎనిమిదేళ్ల కిందట రూ. 343 కోట్లు ఖర్చుచేసిన ఎమ్మెమ్మార్డీయే

ఇప్పటివరకు వచ్చిన లాభం రూ. 29.73 కోట్లు మాత్రమే

ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటున్న రవాణారంగ నిపుణులు  

దాదర్‌: భారతదేశంలో మొదటిసారి ముంబైలో ప్రవేశ పెట్టిన మోనో రైలు ప్రారంభించిన నాటి నుంచి తీవ్ర ఆర్థిక నష్టాల్లో నడుస్తోంది. అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయాణికులను అనుకున్నంత మేర ఆకట్టుకోలేకపోయింది. దీంతో పీకల లోతు నష్టాల్లో కూరుకుపోయిన మోనోను గట్టెక్కించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ట్రాన్స్‌పోర్టు రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా మోనో రైలులో ప్రతీ ప్రయాణికుడికి సగటున రూ.200 ఖర్చవుతోంది. కానీ టికెట్టు రూపంలో కనీస చార్జీలు రూ. 20 వసూలు చేయగా గరిష్ట చార్జీలు రూ.50–60 వరకు వసూలు చేస్తున్నారు. దీన్ని బట్టి మోనోకు ఏ స్ధాయిలో నష్టాలు వస్తున్నాయో ఇట్టే తెలుస్తోంది.  

దేశంలోనే ప్రథమంగా... 
ఆర్థిక రాజధాని ముంబైలో ప్రారంభించిన మోనో రైలు దేశ చరిత్రలో ఇదే ప్రథమం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఎనిమిదేళ్ల కిందట ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) రూ.343 కోట్లు ఖర్చు చేసింది. కానీ గడచిన ఎనిమిదేళ్లలో ఈ రైళ్ల ద్వారా ఎమ్మెమ్మార్డీయేకు కేవలం రూ.29.73 కోట్ల ఆదాయం వచ్చింది. నష్టం మాత్రం రెట్టింపు కంటే ఎక్కువే ఉంది. 

ప్రారంభంలో చెంబూర్‌– వడాల మధ్య (9.8 కి.మీ.) తిరిగిన ఈ రైళ్లు విస్తరించడంతో ఇప్పుడు సాత్‌రాస్తా వరకు (20 కి .మీ.దూరం) వెళుతున్నాయి. ఈ మార్గంలో మొత్తం 18 స్టేషన్లు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రైళ్లు జనవాసాల మధ్యలోంచి  వెళుతున్నాయి. అయినప్పటికీ ప్రయాణికుల నుంచి స్పందన అనుకున్నంత రావడం లేదు. ప్రతీరోజూ 123 మోనో రైలు ట్రిప్పులు తిరగ్గా అందులో సరాసరి 10 వేల మంది ప్రయాణిస్తున్నారు. అంటే నెలకు సరాసరి మూడు లక్షల చొప్పున ఎనిమిదేళ్లలో 24 లక్షల వరకు రాకపోకలు సాగించినట్లు అమ్ముడుపోయిన టికెట్లను బట్టి తెలుస్తోంది. అదే ఎనిమిదేళ్ల కిందట ప్రారంభించిన వర్సోవా–అంధేరీ–ఘాట్కోపర్‌ మెట్రో–1 ప్రాజెక్టుకు ప్రయాణికుల నుంచి ఊహించని విధంగా స్పందన వస్తోంది. గడచిన ఎనిమిదేళ్లలో అందులో ఏకంగా 72 కోట్లకు పైనే మంది ప్రయాణించారు. దీన్ని బట్టి మోనో, మెట్రో మధ్య ఆదాయపరంగా చాలా వ్యత్యాసముందని స్పష్టమవుతోంది. 

మెట్రో మార్గంలో రెండు రైళ్ల మధ్య 4–5 నిమిషాల వ్యత్యాసముండగా, అదే మోనోలో 18–20 నిమిషాల వ్యత్యాసముంది. అంటే ఒక రైలు వెళ్లిపోయిందంటే ప్రయాణికులు మరో రైలు కోసం సుమారు 20 నిమిషాలు ప్లాట్‌ఫారంపై పడిగాపులు కాయాల్సిందే. అదేవిధంగా మోనో రైలు దిగిన ప్రయాణికులకు అనేక స్టేషన్ల బయట ట్యాక్సీ, ఆటోలు, బెస్ట్‌ బస్సులు తదితర రవాణా సౌకర్యాలు అందుబాటులో లేవు. దీంతో ఉద్యోగులు, వ్యాపారస్తులు, విద్యార్ధులు, సామాన్య ప్రజలు మోనోలో ప్రయాణించడానికి ముఖం చాటేస్తున్నారు. మోనో నష్టాల్లో నడవడానికి ఇవి కూడా కారణాలవుతున్నాయి. ట్రిప్పుల సంఖ్య పెంచడం, రైలు దిగిన ప్రయాణికులకు స్టేషన్‌ నుంచి బయటకురాగానే మెరుగైన రవాణా సౌకర్యాలుంటే తప్ప మోనో రైలు ఆర్ధిక పరిస్ధితి గాడిన పడదని రవాణారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. (క్లిక్ చేయండి: జేఈఈ టాపర్స్‌ దృష్టి... ఐఐటీ బాంబే వైపే)    

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top