
30 ఏళ్లు దాటినా వివాహం కాని యువత
ఏళ్ల తరబడి ప్రయత్నాలు..కుదరని సంబంధాలు
ఉద్యోగం, సంపాదన ఉన్నా అమ్మాయి దొరకని పరిస్థితి
వయసు దాటిపోతుండడంతోతల్లిదండ్రుల్లో ఆందోళన
అమ్మాయి, అబ్బాయిల కుటుంబ సభ్యులఆలోచనల్లో మార్పే కారణం
షరతులతో ముందుకుసాగని పేరంటం
ఒకప్పుడు వయసుకు వచ్చిన అమ్మాయి ఇంట్లో ఉంటే ఎంత వేగంగా పెళ్లి చేసి అత్తవారింటికి పంపిద్దామా? అని తల్లిదండ్రులు ఎదురుచూసేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అబ్బాయిలకు సంబంధాలు దొరకడం కష్టమైపోతోంది. ఒకప్పుడు అబ్బాయి గుణగణాలు, కుటుంబం గురించి తెలుసుకుని పిల్లనిచ్చేవారు. ఇప్పుడు అబ్బాయి ఏం చదువుకున్నాడు?, ఏ కంపెనీలో పనిచేస్తున్నాడు?, ఎంత సంపాదిస్తున్నాడు? అప్పులు, ఆస్తులు, రోగాలు.. సిబిల్‌స్కోర్ అంశాలను సైతం చూస్తున్నారు. దీంతో పెళ్లి ముచ్చట ముందుకు సాగడం కష్టంగా మారుతోంది.–హుజూరాబాద్
హుజూరాబాద్: గతంలో 25, 26 ఏళ్లు వచ్చేసరికి అబ్బాయిల్లో దాదాపు 80 శాతం మందికి పెళ్లిళ్లు అయిపోయేవి. కొన్నాళ్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రెండుమూడేళ్ల నుంచి సంబంధాలు చూస్తున్నా పెళ్లిళ్లు కావడం లేదు. 30ఏళ్లు దాటినా పెళ్లికాని ప్రసాద్‌ల సంఖ్య పెరిగిపోతోంది. అబ్బాయికి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ఒక పెద్ద యజ్ఞమే చేయాల్సి వస్తోంది. గతంలో తల్లిదండ్రులు ఏదైనా సంబంధం చూస్తే అమ్మాయిలు మాట్లాడకుండా చేసుకునేవాళ్లు. కానీ, ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. అమ్మాయిల ఇష్టాయిష్టాలను కాదనలేని పరిస్థితి. అమ్మాయి ఓకే అంటే తప్ప పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించడం లేదు. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో అమ్మాయిలు పూర్తి స్వేచ్ఛగా ఉంటున్నారు. మంచి వేతనం, సొంత ఇల్లు.. వంటివి ఉన్నవారి వైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి సంబంధాలను వెతకమని కుటుంబ సభ్యులకు చెబుతున్నారు. విదేశీ సంబంధాలు అయితే ఒక్క క్షణం కూడా ఆలోచించడం లేదు. వెంటనే ఓకే చెప్పేస్తున్నారు.
‘కరీంనగర్‌కు చెందిన రాజేశ్ (పేరుమార్చాం) ఎనిమిదేళ్ల క్రితం బీఎస్సీ పూర్తిచేశాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నెలకు రూ.50 వేలకుపైగానే వేతనం. మూడేళ్లుగా తల్లిదండ్రులు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ కుదరలేదు’.
‘పెద్దపల్లి ప్రాంతానికి చెందిన నితిన్ (పేరుమార్చాం) హైదరాబాద్‌లోని ఓ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. నెలకు రూ.30 వేల వేతనం. గ్రామంలో ఆస్తులు బాగానే ఉన్నా యి. మూడేళ్లుగా కుటుంబ సభ్యులు సంబంధాలు చూస్తున్నారు. పెళ్లి ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో యువకుడు గ్రామానికి రావడానికి కూడా సిగ్గుపడుతున్నాడు. ఏం చేయాలో తల్లిదండ్రులకు కూడా పాలుపోవడం లేదు’.
‘సిరిసిల్ల ప్రాంతానికి చెందిన యువకుడు బీటెక్ పూర్తిచేసి కరీంనగర్‌లో ఐటీ కంపెనీలో కొలువు సాధించాడు. ఇక్కడే పరిచయమైన ఓ యువతితో కలిసి నడవాలనే నిర్ణయానికి వచ్చాడు. ఒకే కులం కావడంతో కుటుంబ సభ్యులూ సరేనన్నారు. పెళ్లిపీటలు ఎక్కేముందే పెరిగిన పొట్టను తగ్గించుకోవాలని కాబోయే భార్య నిబంధన విధించింది. ప్రస్తుతం ఆ కుర్రాడు జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు’.
‘జగిత్యాలకు చెందిన ఐటీ నిపుణుడు మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకున్నాడు. అతని బయోడేటా నచ్చిన యువతి కుటుంబసభ్యులు హోటల్లో పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు. ఇద్దరి ఉద్యోగాలు, వేతనాలు సరిపోవడంతో పెళ్లికి పచ్చజెండా ఊపారు. ఇక్కడే అనుకోని షాక్.. తన చదువుకైన ఖర్చును ఐదేళ్లపాటు తల్లిదండ్రులకు తన జీతంలోంచి ఇచ్చేందుకు అంగీకరించాలని అమ్మాయి షరతు పెట్టింది’.
పట్టింపులతో సమస్య..: అబ్బాయిల తల్లిదండ్రుల వ్యవహారశైలి కూడా కొంతవరకూ ఈ సమస్యకు కారణమని చెప్పవచ్చు. మంచి కట్నకానుకలు ఆశించడం, అమ్మాయి అందంగా ఉండాలని, అణకువగా ఉండాలని కోరుకుంటూ మొదట్లో వచ్చిన సంబంధాలను కాదనుకుంటున్నారు. తర్వాత వయసు దాటిపోతున్నా అబ్బాయిలకు పెళ్లిళ్లు చేయలేని పరిస్థితి నెలకొంటోందని చెబుతున్నారు.
ఇదీ చదవండి: తల్లిని పోగొట్టుకున్న రెండేళ్ల చిన్నారితో..ఎంత కష్టం : డెలివరీ ఏజెంట్ స్టోరీ
భిన్నమైన పరిస్థితి : గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసే అబ్బాయిలను కోరుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగం ఉన్న అబ్బాయితో పెళ్లి చేస్తే అమ్మాయికి జీవితాంతం ఇబ్బంది ఉండదన్న భావన తల్లిదండ్రుల్లో ఉంటోంది. అదే పట్టణ ప్రాంతాల్లోని అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు లేదా సాఫ్ట్‌వేర్ సంబంధాలపై మొగ్గుచూపిస్తున్నారు. విదేశాల్లో ఉన్నారంటే కట్నం ఎంతయినా ఇచ్చేందుకు వెనుకాడడం లేదు. దీంతో చిరుద్యోగాలు చేసుకునే అబ్బాయిలు, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకునేవారికి 35 ఏళ్లు దాటినా సంబంధాలు దొరకడం లేదు.
మానసిక సమస్యలు : పెళ్లికాకపోవడం వల్ల యువకులతోపాటు వారి తల్లిదండ్రులు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. 30 ఏళ్లు దాటినా పెళ్లి కాకపోవడం వల్ల అబ్బాయిల్లో అసహనం, నిరుత్సాహం వంటివి పెరిగిపోతున్నట్టు మానసిక వైద్యులు చెబుతున్నారు.
ఒకరికొకరు అర్థం చేసుకోవాలి : తమ కూతురుకు పెళ్లి చేస్తే పరిస్థితి ఎలా ఉండాలో అమ్మాయి తల్లిదండ్రులు ముందే ఒక ఆలోచనకు వస్తున్నారు. పెళ్లి అనేది ఇద్దరి జీవితాలను నిర్ణయించేది. అమ్మాయికి అర్థం చేసుకునే గుణం, అబ్బాయికి ఓపిక అనేది ఉన్నాయో లేవో గమనించి వివాహం చేస్తే ఆ బంధం నిలబడుతుంది. తల్లిదండ్రులు ఆ దిశగా ఆలోచన చేస్తే బాగుంటుంది-డాక్టర్ ప్రవీణ్‌కుమార్, హుజూరాబాద్
ఆలోచనల్లో మార్పు రావాలి: అమ్మాయిల తల్లిదండ్రుల ధోరణి ప్రస్తుతం పూర్తిగా మారింది. గత 20 ఏళ్లలో అమ్మాయిల ఆలోచన సైతం మారింది. పెళ్లి చేసుకునే అబ్బాయి ఉద్యోగం, ఆస్తిపాస్తులు, ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే అడుగులు ముందుకు పడుతున్నాయి. అర్థం చేసుకునే గుణం, కష్టపడేతత్వం, తెలివితేటలతో ఎదిగే యువకుడికి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే సుఖపడుతుంది.– ఆడెపు రవీందర్, మ్యారేజ్ బ్యూరో, హుజూరాబాద్
మానసిక ఒత్తిడిలో తల్లిదండ్రులు
అబ్బాయికి 30 ఏళ్లు దాటినా పెళ్లి కాకపోవడాన్ని తల్లిదండ్రులు సమాజంలో నామోషీగా భావిస్తున్నారు. అబ్బాయిల్లో నిరుత్సాహం, పెళ్లి పట్ల విరక్తి భావం పెరుగుతోంది. కొందరిలో ఆత్మహత్య ఆలోచనలు కూడా పెరుగుతున్నాయి. ఇలాంటివారికి కౌన్సెలింగ్ ఇప్పించడం చాలా అవసరం. పెళ్లి అన్న దాన్ని పరువుగా భావించడం వల్లే అబ్బాయిలు, వారి తల్లిదండ్రుల్లో మానసిక సమస్యలు పెరుగుతున్నాయి.– డాక్టర్ ఎల్.వర్షి, మానసిక నిపుణుడు, హుజూరాబాద్