అరవకురిచ్చి, తంజావూరుల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మళ్లీ వేడెక్కింది. డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ ప్రచార పర్యటనకు సిద్ధం అయ్యారు.
సాక్షి, చెన్నై : అరవకురిచ్చి, తంజావూరుల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మళ్లీ వేడెక్కింది. డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ ప్రచార పర్యటనకు సిద్ధం అయ్యారు. ఈ రెండు స్థానాల్లో సమరం ఉత్కంఠ భరితంగా సాగనున్నడంతో సర్వత్రా ఎదురు చూపుల్లో పడ్డారు. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్నికల నిర్వహణకు ఈసీ చర్యలు తీసుకుంది. ఎన్నికలకు ముందుగా ఒక్కో రోజు వ్యవధిలో రెండు స్థానాల్లో వాయిదా పర్వం సాగాయి. తొలుత కరూర్ జిల్లా అరవకురిచ్చిలో ఎన్నికల్ని నిలుపుదల చేశారు. తదుపరి తంజావూరు ఎన్నికల్ని వాయిదా వేశారు. ఇందుకు కారణం ఆ రెండు నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయల మేరకు నగదు బట్వాడా జరిగినట్టుగా ఆధారాలతో సహా ఎన్నికల పర్యవేక్షకులు తేల్చారు.
అరవకురిచ్చిలో మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ అన్నాడిఎంకే అభ్యర్థిగా, డిఎంకేలో ఆర్థిక బలం కల్గిన కీలక నాయకుడు కేసి పళని స్వామి ప్రత్యర్థిగా రేసులో దిగడంతో ఇక్కడ నోట్ల క ట్టలు పెద్ద ఎత్తున చేతులు మారి ఉంటాయన్నది స్పష్టం కాక తప్పదు. ఈ ఇద్దరూ గెలుపు కోసం ఓటుకు రూ. ఐదు వేల వరకు పంపిణీ చేసినట్టుగా సంకేతాలు బయలు దేరాయి. అదే సమయంలో తంజావూరు రేసులో డీఎంకే అభ్యర్థిగా అంజుగం భూపతి, అన్నాడీఎంకే అభ్యర్థిగా రంగస్వామిలు రేసులో ఢీ కొట్టారు. సమరం హోరా హోరీ అన్న సమాచారంతో ఇక్కడ కూడా నోట్ల కట్టల్ని బాగానే చల్లడంతో చివరకు ఎన్నికలు వాయిదా పడ్డాయి.
అన్ని స్థానాలతో పాటుగా సోమవారం ఇక్కడ కూడా ఎన్నికలు జరగాల్సి ఉన్నా, నోట్ల కట్టల రూపంలో వాయిదా పడ్డాయి. ప్రస్తుతం 232 స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. ఇక, మిగిలిన ఈ రెండు స్థానాల ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ దృష్టి పెట్టింది. అదే సమయంలో ఈ నెల 21 వరకు ప్రచారం చేసుకోవచ్చని ఈసీ సూచించడంలో ఓట్ల వేటలో అభ్యర్థులు పడ్డారు. అరవకురిచ్చిలో డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థులు ఇంటింటా తిరుగుతూ ఓట్ల సేకరణలో మంగళవారం నిమగ్నం అయ్యారు. ఇక, తమ అభ్యర్థి కేసి పళని స్వామికి మద్దతుగా ప్రచార పయనానికి డిఎంకే దళపతి ఎంకే స్టాలిన్ సిద్ధం అయ్యారు.
బుధవారం ఆయన అరవకురిచ్చి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. వేలాయుధ పాలయం, పరమత్తి, చిన్నతారాపురం, అరవకురిచ్చి, పల్లం పట్టిల మీదుగా రోడ్ షో సాగించి, ఆయా ప్రాంతాల్లో స్టాలిన్ ప్రసంగించనున్నారు. గురువారం కౌంటింగ్ డే కావడంతో ఫలితాల మేరకు తదుపరి తంజావూరులో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. 21వ తేది సాయంత్రంతో ఈ రెండు స్థానాల్లో ప్రచారంకు తెర పడుతుంది. 23వ తేది ఓటింగ్, 25న ఫలితాల వెల్లడికి అధికార వర్గాలు చర్యలు చేపట్టాయి.