డీఎంకేలో అధినేత కరుణానిధి రాజకీ య వారసత్వ సమరం సాగుతున్న విష యం తెలిసిందే. అన్నదమ్ముళ్ల మధ్య ముది రిన ఈ వివాదంలో చివరకు పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్ పైచేయి సాధించారు.
సాక్షి, చెన్నై : డీఎంకేలో అధినేత కరుణానిధి రాజకీ య వారసత్వ సమరం సాగుతున్న విష యం తెలిసిందే. అన్నదమ్ముళ్ల మధ్య ముది రిన ఈ వివాదంలో చివరకు పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్ పైచేయి సాధించారు. అన్నయ్య అళగిరిని పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ వారసత్వ సమరం ప్రభావం లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే డిపాజిట్లను గల్లంతు చేశాయని చెప్పవచ్చు. ఆ ఎన్నికల్లో ఎదురైన పరాభావంతో పార్టీ ప్రక్షాళనకు కరుణానిధి శ్రీకారం చుట్టక తప్పలేదు. అళగిరి మద్దతుదారుల్ని హెచ్చరించే విధంగా తాత్కాలిక బహిష్కరణ నినాదాన్ని కరుణానిధి అందుకున్నారు. అయినా, అళగిరి కాసింత కూడా వెనక్కి తగ్గలేదు. చివరకు అళగిరి రూపంలో పార్టీకి ఎదురవుతున్న సంక్లిష్ట పరిస్థితులను కరుణానిధి పరిగణనలోకి తీసుకున్నారు. ఇటీవల తన సతీమణి దయాళు అమ్మాల్ ద్వారా పెద్ద కుమారుడిని బుజ్జగించే యత్నం చేశారు.
ఈ సమయంలో స్టాలిన్ సీఎం అభ్యర్థి ప్రచారం ఊపందుకోవడం డీఎంకేలో అంతర్యుద్ధాలకు వేది కగా మారింది. ఎట్టకేలకు స్టాలిన్ ద్వారానే ఆ ప్రచారానికి ముగింపు పలికిన కరుణానిధి, అళగిరి ఎపిసోడ్‌ను సుఖాంతం చేయడానికి సిద్ధమయ్యూరు. వెలుగులోకి కేపీ భేటీ: అళగిరి మద్దతుదారుడైన పార్టీ ఎంపీ, వ్యవసాయ సంఘం నేత కేపీ రామలింగం గురువారం డీఎంకే అధినేత కరుణానిధిని కలుసుకోవడం వెలుగులోకి వచ్చింది. అళగిరి దూతగా కేపీ సీఐటీ కాలనీ మెట్లు ఎక్కారని చెప్పవచ్చు. ఈ భేటీ అంతా అళగిరి వ్యవహారం గురించి సాగినట్టు డీఎంకే వర్గాలు స్పష్టం చేశాయి. తనకు మళ్లీ దక్షిణాది జిల్లా పార్టీ కార్యదర్శి పదవి అప్పగించాలని, సోదరి కనిమొళిని దక్షిణ, ఉత్తర జిల్లాల్లో ప్రచార బరిలోకి వాడుకోవాలన్న అళగిరి సూచనను కరుణానిధి ముందు కేపీ ఉంచినట్టు సమాచారం.
కేపీతో గంటన్నరగా సాగిన చర్చ అనంతరం కరుణానిధి తగ్గినట్టు డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. పెద్దకుమారుడిని మళ్లీ పార్టీలోకి ఆహ్వానించే రీతిలో సానుకూలతను కరుణానిధి వ్యక్తం చేసినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో అళగిరి రీ ఎంట్రీ అన్న ప్రచారం బయలు దేరింది. ఇదే విషయంగా కేపీని మీడియా కదిలించగా, తమ అధినేత ఇంటికి వెళ్లిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. అళగిరి వ్యవహారం గురించి చర్చించుకున్నామని, తండ్రి, తనయులు ఏకాభిప్రాయానికి వచ్చినట్టేనని పేర్కొంటూ, త్వరలో అళగిరికి అనుకూలంగా మంచి నిర్ణయం డీఎంకేలో వెలువడుతుందని ఆశిస్తున్నట్టు, ఆహ్వానం వస్తుందని భావిస్తున్నట్టు పేర్కొనడం గమనార్హం.
చెన్నైకు పరుగు : కరుణతో భేటీ అనంతరం కేపీ మదురైకు వెళ్లారు. అక్కడ ఏ చర్చలు జరిగాయో ఏమోగానీ, హుటాహుటిన శనివారం ఉదయం చెన్నైకు అళగిరి విమానం ఎక్కేశారు. ఏక్షణానైన కరుణ నుంచి ఆహ్వానం వస్తుందన్న ఆశతో ఆయన ఇక్కడికి వచ్చారని సర్వత్రా భావిస్తున్నారు. ఇక, అళగిరి తనయుడు దురై దయానిధి శుక్రవారం తాతయ్య కరుణానిధిని కలుసుకోవడం ఆలోచించాల్సిందే. విమానాశ్రయం నుంచి వెలుపలకు వస్తున్న అళగిరి మీడియాను ఉద్దేశించి కొత్త సమాచారం ఏమీ ఈ రోజుకు తన వద్ద లేదని పేర్కొన్నారు. ఏదేని ఆహ్వానాలు ఉంటే, మీడియూకు తెలియకుండా ఉంటాయా? అంటూ ఓ ప్రశ్నకు బదులిచ్చారు. దీన్ని బట్టి చూస్తే, మరి కొద్ది రోజుల్లో అళగిరి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయం అన్నమాట! ఇక అళగిరి, కరుణ ఎపిసోడ్ సుఖాంతమైన పక్షంలో, స్టాలిన్ ఎపిసోడ్ ఏదైనా ఆరంభం అవుతుందా? అళగిరి రీ ఎంట్రీని స్టాలిన్ ఆహ్వానిస్తారా? అన్నది వేచి చూడాల్సిందే. జిల్లాల పర్యటనల్లో బిజీబిజీగా స్టాలిన్ ఉన్న సమయంలో కరుణానిధి చకచకా పావులు కదుపుతూ, తన రాజతంత్రాల్ని ప్రయోగిస్తుండటం విశేషం.