
ములాఖత్
జయలలిత మరణం అనంతరం అన్నాడీఎంకే ముక్కలైన విషయం తెలిసిందే. తదుపరి పరిణామాలతో తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ ఆస్తుల కేసులో పరప్పన అగ్రహార జైలుకు పరిమితం అయ్యారు.
► చిన్నమ్మతో టీటీవీ మంతనాలు
► వెన్నంటి పది మంది ఎమ్మెల్యేలు
► ముగ్గురు ఎంపీలు
► మంత్రుల అత్యవసర భేటీ
► సీఎంతో సంప్రదింపులు
► టీటీవీని ఎప్పుడో బహిష్కరించామని ప్రకటన
అన్నాడీఎంకే అమ్మ శిబిరంలో సోమవారం రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. పది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలతో కలసి బెంగళూరుకు దినకరన్ పయనం కావడం ఉత్కంఠను రేపింది. అదే సమయంలో మంత్రులు సచివాలయంలో ఏకం కావడం చర్చకు దారి తీసింది. చివరకు విలీనం నినాదాన్ని చిన్నమ్మ శశికళ అందుకోవడం, 60 రోజుల గడువు నిర్ణయించడంతో.. ఇది సాధ్యమేనా అన్న ప్రశ్న బయల్దేరింది.
సాక్షి, చెన్నై: జయలలిత మరణం అనంతరం అన్నాడీఎంకే ముక్కలైన విషయం తెలిసిందే. తదుపరి పరిణామాలతో తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ ఆస్తుల కేసులో పరప్పన అగ్రహార జైలుకు పరిమితం అయ్యారు. రెండాకుల గుర్తు కోసం లంచం కేసులో ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ చిన్నమ్మ బాటలో కారాగారం అనుభవించక తప్పలేదు.
ఈ సమయంలో పార్టీకి, ప్రభుత్వానికి అన్నీ తానై సీఎం పళని స్వామి ముందుకు సాగారు. మాజీ సీఎం పన్నీరు నేతృత్వంలోని పురట్చి తలైవి శిబిరాన్ని అమ్మ శిబిరంలోకి విలీనం చేయడం లక్ష్యంగా ప్రయత్నాలు చేసి, చివరకు కేంద్రం మన్ననలతో తన మార్కు పాలన మీద దృష్టి పెట్టారు. తాజాగా జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన దినకరన్ మళ్లీ పార్టీలో తన బలాన్ని చాటుకునేందుకు సిద్ధం కావడం పళని నేతృత్వంలోని అమ్మ శిబిరం మంత్రులు జీర్ణించుకోలేకున్నారు. అన్ని సజావుగా సాగుతున్న వేళ దినకరన్ అవసరమా అన్న నిర్ణయానికి వచ్చారు. తనకు వ్యతిరేకంగా మంత్రులు గళం విప్పడంతో దినకరన్ స్వరం పెంచే పనిలో పడ్డారు. చిన్నమ్మ శశికళతో ములాఖత్ అయ్యేందుకు సిద్ధం అయ్యారు.
చిన్నమ్మతో ములాఖత్: చిన్నమ్మతో ములాఖత్‌కు దినకరన్ సిద్ధం కావడంతో ఆయన వెన్నంటి ఏకంగా పది మంది ఎమ్మెల్యేలు బెంగళూరుకు కదలడం ఉత్కంఠకు దారి తీసింది. ఇందులో వెట్రివేల్(పెరంబూరు), ఇన్భదురై(రాధాపురం), తంగతమిళ్ సెల్వన్(ఆండిపట్టి), ఎస్‌టీకే జగ్గయ్యన్, కదిర్ గామం, సుబ్రమణ్యన్, జయంతి షణ్ముగనాథన్, పార్తీబన్, సెల్వ మోహన్ దాసు, పళనియప్పన్ ఉన్నారు. మరో ముగ్గురు ఎంపీలు సైతం వెన్నంటి సాగారు. అక్కడక్కడ దినకరన్‌ను ఆహ్వానించే రీతిలో మద్దతుదారులు హోరెత్తడంతో అమ్మ శిబిరంలో ఉత్కంఠను మరింతగా రేపింది. అక్కడక్కడా మీడియాతో మాట్లాడిన దినకరన్ తనను తొలగించే అధికారం ఎవ్వరికీ లేదని, మంత్రులు కొందరు తనను చూసి భయపడుతున్నారని వ్యాఖ్యానించడం చర్చకు దారి తీసింది. ఓ మంత్రి(జయకుమార్) అయితే ఆయనే ప్రధాన కార్యదర్శి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని పరోక్షంగా విమర్శిస్తూ ముందుకు సాగారు.
మంత్రుల మంతనాలు: తమను గురి పెట్టి దినకరన్ మాటల తూటాలను పేల్చడంతో 20 మంది మంత్రులు ఏకం అయ్యారు. ఆర్థిక మంత్రి జయకుమార్ ఛాంబర్‌లో గంటకు పైగా మంతనాల్లో మునిగారు. సచివాలయం మంత్రి ఛాంబర్ పార్టీ కార్యాలయంగా మారిందా అన్నట్టుగా చర్చ సాగింది. తదుపరి సీఎం వద్దకు మంత్రులు ఉరకలు తీశారు. సిఎంతో భేటీ అనంతరం జయకుమార్ నేతృత్వంలో మంత్రులందరూ మీడియా ముందుకు వచ్చారు. జయకుమార్ ఒక్కరే మాట్లాడగా, మిగిలినవారు మౌనంగా తల ఊపుతూ కనిపించడం గమనార్హం.
ఏప్రిల్ 17వ తేదీ టీటీవీ దినకరన్‌ను, ఆయనకు సంబంధించిన వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నామని, ఆ నిర్ణయానికి కట్టుబడే ఉన్నామని స్పష్టం చేశారు ఆ రోజు తాను వైదొలగుతున్నట్టు ప్రకటించిన దినకరన్, ఇప్పుడు మళ్లీ పార్టీ పరంగా జోక్యం చేసుకోవడానికి సిద్ధం కావడాన్ని తాము వ్యతిరేకిస్తున్నాన్నారు. పళని స్వామి నేతృత్వంలో ప్రభుత్వం, పార్టీ వ్యవహారాలు చక్కగా సాగుతున్నాయని, అమ్మ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగడం లక్ష్యంగా ఆ రోజు తీసుకున్న నిర్ణయానికి తాము కట్టుబడే ఉన్నామని ప్రకటించారు. టీటీవీ దినకరన్‌తో పార్టీ పరంగా ఎలాంటి సంబంధాలు వద్దంటూ ఆయన వెన్నంటి ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులకు హితవు పలకడం గమనార్హం.
చిన్నమ్మ గడువు : మంత్రులు ఓ వైపు తనకు వ్యతిరేకంగా స్వరాన్ని పెంచిన నేపథ్యంలో బెంగళూరు పరప్పన అగ్రహార చెరలో చిన్నమ్మ శశికళతో దినకరన్ ములాఖత్ అయ్యారు. అక్కడ చిన్నమ్మ ఇచ్చిన సందేశం ఏమిటో గానీ, ములాఖత్ అనంతరం తన మద్దతు ఎమ్మెల్యేలు, ఎంపీలతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది. ఈ భేటీ అనంతరం అన్నాడీఎంకే అమ్మ, పురట్చి తలైవి శిబిరాల విలీనం లక్ష్యంగా చిన్నమ్మ 60 రోజుల పాటు గడువు నిర్ణయించారని దినకరన్ ప్రకటించారు.
అప్పటికీ వీలీనం అన్నది సాగని పక్షంలో చిన్నమ్మ కీలక నిర్ణయం తీసుకుంటారని వ్యాఖ్యానించడంతో విలీనం సాధ్యమేనా అన్న ప్రశ్న బయల్దేరింది. ఇది వరకు సాగిన విలీనం ప్రయత్నాలు వివాదాలు, చర్చలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆ ప్రయత్నాల్ని పక్కన పెట్టి, అన్నాడీఎంకేకు నేతృత్వం అన్నది ఎవరు వహించాలో అన్న నినాదంతో కేడర్ మద్దతు లక్ష్యంగా పన్నీరు సెల్వం రాష్ట్ర పర్యటనలో ఉండడం ఆలోచించ దగ్గ విషయం. గడువులోపు విలీనం సాగని పక్షంలో చిన్నమ్మ నిర్ణయం ఎలా ఉంటుందో, దినకరన్ తదుపరి కర్తవ్యం ఏమిటో అన్నది వేచి చూడాల్సిందే. దినకరన్ మద్దతు నాయకులు నాంజిల్ సంపత్ అయితే మంత్రుల తీరుపై తీవ్రంగా విరుచుకు పడడం గమనార్హం.