సయోధ్య కుదిరేనా? | groups in politics in Chennai Congress | Sakshi
Sakshi News home page

సయోధ్య కుదిరేనా?

Apr 17 2015 1:34 AM | Updated on Sep 3 2017 12:23 AM

టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం వర్గీయుల మధ్య సయోధ్య కుదిరేనా..?

 టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం వర్గీయుల మధ్య సయోధ్య కుదిరేనా..? అన్న ఎదురు చూపులు పెరిగాయి. శుక్రవారం సత్యమూర్తి భవన్ వేదికగా చిదంబరం వర్గీయులు ప్రత్యేక సమావేశానికి పిలుపు నిచ్చారు.
 
 సాక్షి, చెన్నై : రాష్ట్ర కాంగ్రెస్‌లో గ్రూపులకు కొదవ లేదు. ఎప్పుడు ఏ ఏ గ్రూపుల మధ్య వివాదాలు చెలరేగుతాయోనన్నది చెప్పలేం. ఈ గ్రూపుల పుణ్యమా ప్రసుత్తం రాష్ర్టంలో పతనం అంచున కాంగ్రెస్ చేరి ఉన్నది. పార్టీకి కొత్త గాలి నింపే విధంగా టీఎన్‌సీసీ బాధ్యతల్ని ఈవీకేఎస్ ఇళంగోవన్‌కు ఏఐసీసీ అప్పగించినా, గ్రూపుల తన్నులాట మాత్రం ఆగలేదు. ఇక, ఏకంగా ఈవీకేఎస్‌తో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వర్గీయులు ఢీ కొట్టే పనిలో పడ్డారు.
 
 మాటల యుద్ధం ఈ రెండు గ్రూపుల మధ్య తారాస్థాయికి చేరి ఏఐసీసీ పెద్దలు పంచాయితీ పెట్టక తప్పలేదు. ఈ పంచాయతీలు ఓ వైపు సాగుతున్నా, మరో వైపు మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. అదే సమయంలో వాసన్ టీఎంసీని ఏర్పాటు చేసుకున్నట్టుగా, చిదంబరం సైతం కొత్త కుంపటి పెట్టబోతున్నారన్న ప్రచారం బయలు దేరింది.  ఈ పరిస్థితుల్లో సామరస్య పూర్వకంగా అందరూ కలసి మెలసి వెళ్లాలని అధిష్టానం ఆదేశించి ఉండటంతో చిదంబరం వర్గం కాస్త తగ్గినట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి.
 
 సయోద్య కుదిరేనా: ఇన్నాళ్లు సత్యమూర్తి భవన్‌లో ఎలాంటి సభలు, సమావేశాలు పెట్టకుండా, హోటళ్లల్లో జరుపుకుంటూ వచ్చిన చిదంబరం మద్దతు దారులు, తాజాగా సత్యమూర్తి భవన్‌ను వేదికగా చేసుకునేందుకు రెడీ అయ్యారు. రాష్ర్టంలోని జిల్లా పార్టీల అధ్యక్షులుగా, ఇతర పదవుల్లో, రాష్ట్ర కమిటీల్లో ఉన్న తమ మద్దతు దారులందరూ తప్పకుండా ఈ సమావేశానికి రావాలన్న ఆదేశాలను ఏఐసీసీ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం ఆదేశాలు జారీ చేసి ఉండటం గమనార్హం.
 
  ఈ సమావేశంలో పార్టీ బలోపేతం లక్ష్యంగా, గ్రూపులకు అతీతం గా అందరూ కలసి కట్టుగా పనిచేయడం లక్ష్యంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని చిదంబరం మద్దతు దారుడు ఒకరు పేర్కొంటున్నారు. ఈ సమావేశంలో నేతలందరి అభిప్రాయాల అనంతరం పార్టీ బలోపేతం కోసం టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్‌తో కలసి మెలసి పనిచేసే విధంగా ముందు కు వెళ్లే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అందుకే ఈ సారి సత్యమూర్తి భవన్ వేదికగా సమావేశం నిర్వహించి, తామూ కాంగ్రెస్ శ్రేణులమేనని చాటుకునే పనిలో పడ్డట్టు పేర్కొనడం గమనార్హం.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement