'నయీంను పెంచి పోషించింది ప్రభుత్వాలే' | gangster nayeem nurtured by AP and TS governments, says K narayana | Sakshi
Sakshi News home page

'నయీంను పెంచి పోషించింది ప్రభుత్వాలే'

Sep 11 2016 7:21 PM | Updated on Aug 18 2018 5:57 PM

గ్యాంగ్‌స్టర్ నయీమ్‌ను పెంచి పోషించింది ప్రభుత్వాలేనని కె.నారాయణ విమర్శించారు.

నల్గొండ: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌ను పెంచి పోషించింది ప్రభుత్వాలేనని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ విమర్శించారు. ఆదివారం నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విధానాల్లో లోపాలు ఉన్నాయని, అవే నయీమ్ లాంటి వారిని పెంచి పోషించాయన్నారు.

పోలీసులు, మంత్రులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న నక్సలైట్లు, మాజీ నక్సలైట్లను చంపేందుకు నయీమ్‌కు ప్రభుత్వాలు డబ్బులిచ్చి ఉపయోగించుకున్నాయని ఆరోపించారు. డీజీపీ స్థాయి అధికారులు, మంత్రులు నయీమ్‌తో సన్నిహితంగా ఉంటూ అనేక ఆస్తులు సంపాదించుకుని, సాంబశివుడి లాంటి వారిని చంపించారని దుయ్యబట్టారు. నయీమ్ కేసులో ఉన్న పెద్దలు బయటకి రావాలంటే సిట్ ద్వారా కాకుండా.. సీబీఐ ద్వారా విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రత్యేక హోదాపై బీజేపీ మాట మార్చడం బాధకరమన్నారు. ఆనాడు ప్రత్యేక హోదాపై ఆశలు కల్పించి నేడు ఇలా మాట మార్చడంలో ఆంతర్యమేమిటో తెలపాలన్నారు. పదేళ్ల పాటు ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి నాలుకపై నరం లేదని విమర్శించారు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజల మధ్యలో ఉంటూ పోటీ చేస్తానని చెప్పిన పవన్‌కళ్యాణ్ మాటలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులతో చర్చిస్తానని చెప్పడం స్వాగతిస్తున్నామని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement