ఇక సమరమే | Election notification released in tamilnadu | Sakshi
Sakshi News home page

ఇక సమరమే

Mar 5 2016 8:42 AM | Updated on Sep 3 2017 7:04 PM

ఇక సమరమే

ఇక సమరమే

అసెంబ్లీ ఎన్నికల గంట మోగింది. రాజకీయపార్టీల గుండెల్లో గెలుపు ఓటముల గుబులు మొదలైంది.

ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
ఏప్రిల్ 22వ తేదీ నుంచి నామినేషన్లు
మే 16న పోలింగ్, 19న ఓట్ల లెక్కింపు
తమిళనాడు, పుదుచ్చేరీలకూ    ఒకే షెడ్యూల్

 
అసెంబ్లీ ఎన్నికల గంట మోగింది. రాజకీయపార్టీల గుండెల్లో గెలుపు ఓటముల గుబులు మొదలైంది. రాజకీయ పార్టీలు, ప్రజలు ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న ఎన్నికల నోటిఫికేషన్ శుక్రవారం విడుదలైంది. తమిళనాడు, పుదుచ్చేరీ రాష్ట్రాల్లో మే 16న పోలింగ్ జరుగుతుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ నజీమ్‌జైదీ ఢిల్లీలో ప్రకటన చేయడం ద్వారా సమరశంఖం పూరించారు. శుక్రవారం నుంచి కోడ్ అమల్లోకి వచ్చింది.
 
చెన్నై : రాష్ట్రంలోని రాజకీయపార్టీలను అధికార అందలం ఎక్కించేది అసెంబ్లీ ఎన్నికలే. ప్రతి ఐదేళ్లకు ఒకసారి నిర్వహించే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే లేదా డీఎంకే అధికారాన్ని చేజిక్కించుకోవడం అనాదిగా ఆనవాయితీగా వస్తోంది. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, వామపక్షాల వంటి జాతీయ పార్టీలైనా, డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకే, తమాకా తదితర ప్రాంతీయ పార్టీలైనా అన్నాడీఎంకే, డీఎంకేల వెనక నడవాల్సిందే.

అయితే 2011 నాటి ఎన్నికలకు ఈ ఎన్నికలకు ఎంతో తేడా ఉంది. గత ఎన్నికల్లో జయలలిత, కరుణానిధి మాత్రమే ముఖ్యమంత్రి అభ్యర్థులుగా రంగంలో ఉండగా, ఈసారి వారిద్దరితోపాటు డీఎండీకే అధినేత విజయకాంత్, పీఎంకే యువజన విభాగం అధ్యక్షులు అన్బుమణి రాందాస్ బరిలో ఉన్నారు.
 
డీఎండీకే, బీజేపీ, అన్నాడీఎంకే, తమాకాలు పొత్తుల విషయంలో ఇంకా ఊగిసలాట ధోరణినే కొనసాగిస్తున్నాయి. కింగ్‌ను (ముఖ్యమంత్రి) కావాలని పట్టుపడుతున్న విజయకాంత్ ఓ మెట్టుదిగి డీఎంతో పొత్తు కుదిరితే ఉపముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకునేందుకు సిద్ధమయ్యారు. అన్నాడీఎంకే, బీజేపీలు మిత్రపక్షాలు మారుతాయని కొందరు అంచనావేస్తున్నారు.

డీఎండీకేను ఒకవైపు బీజేపీ, మరోవైపు డీఎంకే, ప్రజాస్వామ్య కూటమిలు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. మిత్రపక్షాలు ఎవరో, ప్రతిపక్షాలు ఎవరో ఇంకా రాజకీయ పార్టీలు తేల్చుకోకముందే ఎన్నికల గంట మోగేసింది. దీంతో అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఉరుకులు పరుగులు మొదలైనాయి. రాష్ట్రంలోని  234 నియోజకవర్గాలు తిరిగి ప్రజలను ఆకట్టుకునే ప్రసంగాలు ప్రారంభించాల్సిన తరుణంలో రెండుమూడు రోజుల్లో పొత్తుల కసరత్తును ముగించవచ్చని తెలుస్తోంది.
 
ఎన్నికల కోడ్ జాగ్రత్త : రాజేష్ లఖానీ
 ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినందున కోడ్ అమలులోకి వచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాజేష్ లఖానీ ప్రకటించారు. ప్రభుత్వం కొత్త పథకాలు, ప్రకటనలు చేయకూడదని ఆదేశించారు.  ప్రభుత్వ కార్యదర్శులు, అధికారులు తమ ఉత్తర్వులలో ఎటువంటి మార్పులు చేర్పులు చేయరాదని సూచించారు. వాహనాల తనిఖీలు వెంటనే ప్రారంభించామని, అనధికార నగదు, ఇతర వస్తువులు ఉంటే సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ వాహనాలు, కార్యాలయాలు వినియోగించరాదని అన్నారు.

ఓటర్లను ప్రలోభపెట్టే ఎటువంటి చర్యలను సహించబోమని పేర్కొన్నారు. వరద బాధితులకు ప్రభుత్వం తరపున గత కొంతకాలంగా ఆర్థిక సహాయం పంపిణీ సాగుతోందని, ఇకపై పంపిణీ చేయాలంటే ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాలని అన్నారు. ఈవీఎంలో ఓటువేసి వేసిన తరువాత తమ ఓటు సరైన అభ్యర్థికి పడిందా అని తనిఖీ చేసుకునే వెసులుబాటును ఆ యంత్రాల్లో కల్పించామని తెలిపారు.        
         
తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికల షెడ్యూలు :
 ఏప్రిల్ 22వ తేదీన నామినేషన్లు ప్రారంభం
 ఏప్రిల్ 29వ తేదీన నామినేషన్ల స్వీకరణ ముగింపు
 ఏప్రిల్ 30 వ తేదీన నామినేషన్ల పరిశీలన
 మే 2వ తేదీలోగా నామినేషన్ల ఉపసంహరణ
 మే 16వ తేదీన పోలింగ్
 మే 19వ తేదీన ఓట్ల లెక్కింపు
 మే 21వ తేదీతో ఎన్నికల ప్రక్రియకు తెర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement