ప్రతి ఏటా ఆస్కా అవార్డు | Sakshi
Sakshi News home page

ప్రతి ఏటా ఆస్కా అవార్డు

Published Fri, Jan 15 2016 2:38 AM

Each year Oscars Award

 చెన్నై, సాక్షి ప్రతినిధి:   ఆంధ్రా సోషల్, కల్చరల్ అసోసియేషన్ (ఆస్కా) తరపున ఇకపై ప్రతిఏటా అవార్డులను ప్రదానం చేయనున్నట్లు అధ్యక్షులు డాక్టర్ కే సుబ్బారెడ్డి తెలిపారు. వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులకు ఉగాది సంబరాల సమయంలో ఈ ఆస్కా అవార్డులు ప్రదానం చే స్తామని ఆయన చెప్పారు.
 
 ఆస్కా కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంతో చారిత్రాత్మక నేపథ్యం కలిగిన ఆస్కా ఆవిర్భివించిన తరువాత అవార్డులను ప్రవేశపెట్టడం ఇదే ప్రథమమని అన్నారు. తెలుగు, తమిళ ఉగాది వేడుకలను ఆస్కా హాలులో సంయుక్తంగా నిర్వహిస్తామని తెలిపారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు అవార్డుల ప్రదానోత్సవాలను రెండురోజులపాటు జరుపుతామని తెలిపారు.
 
  ఆస్కా అవార్డుల కార్యక్రమాలకు తమిళనాడులోని ముఖ్యంగా చెన్నై నగరంలోని అన్ని తెలుగు సంఘాలను ఆహ్వానిస్తామని చెప్పారు. ఆస్కా వేరే సంస్థ కావచ్చు తెలుగువారంతా ఒక్కటేననే భావనతో అందరికీ ఆహ్వానాలు పలుకుతున్నామని తెలిపారు. ఆస్కా అవార్డును ఒక ప్రతిష్టాత్మక అవార్డుగా తీర్చిదిద్దడంతోపాటు కమిటీలో ఎవరున్నా అవార్డుల ప్రదానం కొనసాగాలని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు.
 
 రూము చార్జీలు భారీగా తగ్గింపు:
 ఆస్కా కొత్త పాలకవర్గం ఏర్పడి రెండున్నర మాసాలు పూర్తికాగా నెలరోజులు వర్షాలు, వరదలతోనే గడిచిపోయిందని తెలిపారు. అయితే ఆ లోటును భర్తీ చేసేలా కమిటీ సమావేశమై అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఆస్కాలోని రూము చార్జీల రేట్లను భారీగా తగ్గించాలని, రూములో దిగిన అతిథులకు మెరుగైన వసతులు కల్పించాలని కమిటీ నిర్ణయం తీసుకుందని సుబ్బారెడ్డి తెలిపారు. ఆస్కా సభ్యుల కోసం డీలక్స్ రూము రూ.3వేల నుంచి రూ.2వేలు, ప్రెసిడెంట్ సూటు రూ.6వేల నుంచి రూ.4వేలకు తగ్గించామని తెలిపారు. అలాగే స్టాండర్డ్ రూము రూ.1200గా నిర్ణయించామని తెలిపారు. ఈనెల 26వ తేదీ నుంచి తగ్గించిన చార్జీలు అమల్లోకి వస్తాయని అన్నారు. వినోద, విహార, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు రూపకల్పన చేశామని తెలిపారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 7వ తేదీన షిరిడీ పుణ్యక్షేత్రానికి ఆధ్యాత్మిక    యాత్రకు నిర్ణయించామని తెలిపారు. ఆస్కా పనితీరును మరింత మెరుగుపరిచేలా అనేక విభాగాల్లో టెస్ట్న్ ్రసాగుతోందని తెలిపారు.
 
 ‘వచ్చేసింది మకర సంక్రాంతి-పోయింది వరదల భయభ్రాంతి-తెచ్చింది ఆనందాల క్రాంతి-జీవితాల్లో విరిసెనిక ప్రశాంతి’అంటూ ఆస్కా సంయుక్త కార్యదర్శి జేకే రెడ్డి ఆసుకవిత్వాన్ని వినిపించారు. తెలుగు ప్రజలకు, ఆస్కా సభ్యులకు అధ్యక్షులు సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షులు రవీంద్రన్, సాంస్కృతిక కార్యదర్శి సాలూరు వాసూరావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
 

Advertisement
 
Advertisement