మాటలే కాదు చేతలు కూడా.. | Delhi's AAP Government Announces Cheaper Power, Free Water | Sakshi
Sakshi News home page

మాటలే కాదు చేతలు కూడా..

Feb 25 2015 10:42 PM | Updated on Apr 4 2018 7:42 PM

మాటలే కాదు తమది చేతల ప్రభుత్వం కూడా అని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మరోసారి రుజువు చేసింది.

సాక్షి, న్యూఢిల్లీ: మాటలే కాదు తమది చేతల ప్రభుత్వం కూడా అని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మరోసారి రుజువు చేసింది. విద్యుత్తు, నీటి చార్జీలపై ఇచ్చిన ఎన్నికల హామీలను ఆప్ నెరవేర్చనుంది. 400 యూనిట్ల వరకు విద్యుత్తు చార్జీలను సగానికి తగ్గించడంతో పాటు ప్రతి ఇంటికి నెలకు 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా సరఫరా చేయనున్నట్లు ఆప్ సర్కారు బుధవారం ప్రకటించింది. వీటిని మార్చి 1 నుంచి అమలు చేయనుంది. ఈ మేరకు బుధవారం జరిగిన మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సమవేశం తర్వాత డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఈ విషయాన్ని విలేఖరుల సమావేశంలో వెల్లడించారు.
 
 తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని చెబుతూ 400 యూనిట్ల వరకు విద్యుత్ చార్జీలను సగానికి తగ్గించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా, 401 యూనిట్ల పైగా విద్యుత్ వినియోగించే వారు పూర్తి చార్జీలను చెల్లించవలసి ఉంటుందని  చెప్పారు. తగ్గించిన విద్యుత్తు చార్జీలు మార్చి 1 నుంచి అమల్లోకి వస్తాయన్నారు. డిస్కంల ఆడిట్‌పై సీఏజీ నివేదిక వచ్చేంతవరకు విద్యుత్ చార్జీలపై ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని పేర్కొన్నారు. దాని వల్ల ప్రభుత్వంపై నెలకు రూ. 70 కోట్ల భారం పడుతుందని చెప్పారు. మార్చి నెలలో బడ్జెట్ అంచనాలను సవరించి విద్యుత్తు సబ్సిడీ కోసం రూ. 70 కోట్లు కేటాయిస్తామని వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి విద్యుత్ సబ్సిడీ కోసం రానున్న వార్షిక బడ్జెట్‌లో రూ. 1,470 కోట్లు కేటాయిస్తామని తెలిపారు.
 
 తగ్గించిన విద్యుత్ చార్జీల వల్ల నగరంలో 36,06,428 కుటుంబాలకు అంటే 90 శాతం వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందని సిసోడియా చెప్పారు. ప్రస్తుతం నగరంలో విద్యుత్ వినియోగదారులు 200 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ. 2.80 చొప్పున చెల్లిస్తున్నారు. మార్చి 1 నుంచి యూనిట్‌కు రూ. 2 చొప్పున చెల్లించవలసి ఉంటుంది. 201 నుంచి 400 యూనిట్ల వరకు ప్రస్తుతం యూనిట్‌కు రూ. 5.15 చెల్లిస్తుండగా మార్చి 1 నుంచి యూనిట్‌కు రూ. 2.98 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.  ఉచిత నీటితో 18 లక్షల కుటుంబాలకు లబ్ధి: నీటి మీటర్లు ఉన్న ప్రతి కుటుంబానికి మార్చి 1 నుంచి నెలకు 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా అందించనున్నట్లు సిసోడియా తెలిపారు.
 
 నీటి, సీవర్ చార్జీలను రద్దు చేస్తామన్న హామీని తమ ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పారు. 49 రోజుల పాలనా కాలంలో ఉచిత నీటి ప్రయోజనం 13,31,000 కుటుంబాలకు లభించిందని, ఈ సారి 18 లక్షల కుటుంబాలు ప్రయోజనం పొందుతాయని తాము అంచనా వేసినట్లు సిసోడియా తెలిపారు. గతంలో ఉచిత నీటి సరఫరా చేసినందుకు ప్రభుత్వ ఖజానాపై మూడు నెలలకు రూ. 31 కోట్ల భారం పడిందని చెప్పారు. ఈ సారి వినియోగదారుల సంఖ్య పెరిగిందని, దీంతో వ్యయం మరింతగా పెరిగి ఏడాదికి రూ. 250 కోట్లు ఖర్చు కావచ్చని చెప్పారు. రానున్న బడ్జెట్‌లో ఉచిత నీటి సరఫరాకి రూ. 250  కోట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. మార్చి నెలకి రూ. 20 కోట్లను కేటాయించనున్నట్లు తెలిపారు. గ్రూపు హౌజింగ్ సొసైటీలకు కూడా ఈ ప్రయోజనం లభిస్తుందని తెలిపారు. నీటి సమస్యలు, సీవర్ సమస్యలకు సంబంధించి ఢిల్లీ జల్ బోర్డు హెల్ప్‌లైన్ 1916కు ఫోన్ చేయాలని సిసోడియవా సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement