ఆ ముగ్గురు ఎవరు?

chennai: army chief Son In police custody - Sakshi

సైనికాధికారుల శిక్షణ కేంద్రంలోకి చొరబాటు

మూడురోజులైనా అంతుచిక్కని వైనం

పోలీసుల అదుపులో సైనికాధికారి కొడుకు

సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై మీనంబాక్కం సైనిక అధికారుల శిక్షణ కేంద్రంలోని రహస్య సమాచారాన్ని సేకరించిన ముగ్గురు అజ్ఞాత వ్యక్తులు ఎవరనేది మూడురోజులైనా అంతుబట్టలేదు. అదుపులోకి తీసుకున్న ఇంజినీరింగ్‌ విద్యార్థి ప్రశాంత్‌ను తమ కస్టడీలో ఉంచుకుని పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు. సైనికాధికారి కుమారుడు సైనిక దుస్తుల్లో ప్రవేశించడం, గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తుల కోసం రహస్య సమాచారాన్ని సేకరించడం సైనికవర్గాల్లో కలకలం రేపింది. వివరాలు..

చెన్నై మీనంబాక్కంలో సైనికాధికారుల శిక్షణ కేంద్రం ఉంది. సైనిక అధికారుల గృహవినియోగ వస్తువుల కోసం కేంద్రంలో ఏర్పాటుచేసి ఉన్న క్యాంటీన్‌లోకి ఓ యువకుడు సైనికయూనిఫాం దుస్తుల్లో వెళ్లి కొన్ని వస్తువులు కొనుగోలు చేశాడు. తిరిగి వెళుతుండగా అక్కడి సిబ్బంది అనుమానంతో అతడిని పట్టుకుని విచారణ జరపగా తికమక సమాధానాలు చెప్పాడు. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం అందజేసి ఆ తరువాత అతడిని మౌంట్‌ పోలీసులకు అప్పగించారు.

సైనిక దుస్తుల్లో చొరబడిన  వ్యక్తి పేరు ప్రశాంత్,  చెన్నైలోని ఒక ప్రయివేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సైనికాధికారైన అతని తండ్రి రాజశేఖర్‌ కుటుంబసభ్యులతో కలిసి బెంగళూరులో నివసిస్తున్న కారణంగా కుమారుడు ప్రశాంత్‌ను కాలేజీ హాస్టల్‌లో చేర్పించాడు. అయితే అతను బయటి హాస్టల్‌లో ఉంటున్నాడు. సైనికదుస్తుల్లో వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఇటీవల ప్రశాంత్‌ను కలిసి ‘ మీ నాన్న బెంగళూరులో సైనిక అధికారిగా పనిచేస్తున్నాడు, అందుకని నిన్నుకూడా సైనిక అధికారిగా ఎంపికచేశామని నమ్మబలికారు. నీ నుంచి డబ్బులు ఆశించడం లేదు, అయితే సైనిక దుస్తులు ఇస్తాం, వాటిని వేసుకుని మీ తండ్రి క్యాంటీన్‌లో వస్తువులు కొనుగోలు చేసేందుకు వినియోగించే గుర్తింపు కార్డును దగ్గరపెట్టుకోవాల్సిందిగా సూచించారు.

సైనిక శిక్షణలో భాగంగా తాము చెప్పిన రోజున సైనిక అధికారుల శిక్షణ కేంద్రానికి వెళ్లి అక్కడ ఏఏ ప్రదేశాల్లో ఏ కార్యాలయాలు ఉన్నాయి, శిక్షణ తరగతులు ఎక్కడ నిర్వహిస్తారు, క్యాంటిన్‌ ఎక్కడ ఉంది తదితర వివరాలు తమకు ఇవ్వాలని కోరారు.  ఈ వివరాలను సక్రమంగా ఇవ్వడమే నీకు శిక్షణ అని చెప్పారు. ఇదంతా నిజమని నమ్మిన ప్రశాంత్‌ తండ్రికి చెప్పగా, డబ్బు కోసం ఎవరో మోసం చేస్తున్నారని అయన అన్నాడు. తన వద్ద వారు డబ్బులు ఏమీ తీసుకోలేదని తండ్రికి బదులిచ్చాడు. సరే ఏమీ జరుగుతుందో చూద్దామని ఇరువురు మిన్నకుండిపోయారు.

ప్రశాంత్‌ సైనికదుస్తులు ధరించి సదరు ముగ్గురు వ్యక్తుల సూచన మేరకు సుమారు 12 సార్లు శిక్షణ కేంద్రంలోకి వెళ్లి అడిగిన సమాచారాన్ని అందజేశాడు. రెండురోజుల క్రితం క్యాంటిన్‌కు వెళ్లి తిరుగుముఖం పడుతుండగా అక్కడి సిబ్బంది అనుమానంతో నిలదీశారు. సైనిక శిక్షణలో భాగంగా ఇదంతా చేస్తున్నట్లు ప్రశాంత్‌ ఇచ్చిన సమాచారంతో బిత్తరపోయి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి ఆ తరువాత పోలీసులకు అప్పగించారు. పోలీస్‌ సహాయ కమిషనర్‌ ముత్తుస్వామి నేతృత్వంలో విచారణ చేపట్టారు. పోలీసులు జరిపిన విచారణలో సదరు ముగ్గురు వ్యక్తుల గురించి వివరాలు రాబట్టలేక పోయారు. అయితే పచ్చయప్పాస్‌ కాలేజీ వెనుకవైపున ఉన్న అరుణాచలం వీధిలోని నివసించేందుకు తనను తీసుకెళ్లినట్లు చెప్పాడు.

అయితే ఆ ఇంటిని ప్రశాంత్‌ సరిగా గుర్తించలేక పోయాడు. ప్రశాంత్‌ పట్టుబడగానే ఉన్నతాధికారులు, కేంద్ర, రాష్ట్ర హోంశాఖ, క్యూ బ్రాంచ్‌ పోలీసులు, ప్రత్యేక ఇన్వెస్టిగేషన్‌ అధికారులు వచ్చి చేరిపోయారు. వీరంతా ప్రశాంత్‌ను తీవ్రంగా విచారించారు. ప్రశాంత్‌ నుంచి గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు పొందిన సమాచారం వెనుక ఏదైనా విధ్వంస కుట్ర ఉందా, తీవ్రవాద చర్యల నేప«థ్యమా అని కోణంలో పోలీసులు  కేసును పరిశోధిస్తున్నారు. 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top