మంత్రి వర్గ విస్తరణ | Cabinet expansion | Sakshi
Sakshi News home page

మంత్రి వర్గ విస్తరణ

May 10 2014 1:15 AM | Updated on Aug 29 2018 8:56 PM

రాష్ర్ట మంత్రి వర్గాన్ని త్వరలో విస్తరించనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మంత్రి వర్గంలో ముగ్గురికి చోటు కల్పించడంతో...

ముగ్గురికి చోటు    
 కొందరికి శాఖల మార్పు
 బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్షుల నియామకం    
 ‘లోక్‌సభ’ ఫలితాల తర్వాత కార్యాచరణ
 నీటి ఎద్దడి నివారణకు రూ. 516 కోట్లు  
 ‘రేషన్’ పంపిణీ కాకుంటే అధికారులపై చర్యలు

 
మైసూరు, న్యూస్‌లైన్ : రాష్ర్ట మంత్రి వర్గాన్ని త్వరలో విస్తరించనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మంత్రి వర్గంలో ముగ్గురికి చోటు కల్పించడంతో పాటు బోర్డులు, కార్పొరేషన్లకు అధ్యక్షులను నియమిస్తామని వెల్లడించారు. ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి గురువారం రాత్రి ఇక్కడికి వచ్చిన ఆయన స్థానిక రామకృష్ణ నగరలోని తన నివాసంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.

ఇటీవల పార్టీ పెద్దలు కొందరు మంత్రి వర్గ విస్తరణతో పాటు కొందరు మంత్రుల శాఖల మార్పు గురించి మీడియా ద్వారా తమ అభిప్రాయాలను చెప్పారని అన్నారు. అయితే ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున, దీనిపై తానేమీ మాట్లాడదలచుకోలేదని తెలిపారు. మంత్రి వర్గ విస్తరణతో పాటు బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్షుల నియామకాలపై అధిష్టానంతో చర్చించాల్సి ఉందని చెప్పారు. దీనిపై ఇదివరకే ఆయా జిల్లాల నాయకుల నుంచి అభిప్రాయాలను సేకరించామన్నారు.

కాగా తాగు నీటి సమస్య పరిష్కారానికి  రూ.516 కోట్లను  ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. 1,250కి పైగా గ్రామాల్లో నెలకొన్న నీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి ఈ నిధులు ఖర్చు చేస్తారని చెప్పారు. అనంతరం ఆయన తన నివాసం వద్ద గుమికూడిన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున, ప్రస్తుతం ఎలాంటి హామీలు ఇవ్వలేనని పేర్కొన్నారు.

నియమావళి తొలగిపోయిన తర్వాత సమస్యలపై స్పందిస్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు ఆయన జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తాగు నీటికి ఇబ్బందులు ఎదురు కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. చౌక దుకాణాల ద్వారా సరుకులు సక్రమంగా పంపిణీ కాకపోతే సంబంధిత అధికారులపై నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement