నీ ముక్కు చాలా పొడవు.. నిన్ను పెళ్లి చేసుకోలేను!

Bride refuse to marry groom because his Bigger Nose - Sakshi

సాక్షి, బెంగళూరు: కాబోయే భర్త ముక్కు పొడవుగా ఉందంటూ ఓ యువతి నిశ్చితార్థం చేసుకున్నాక పెళ్లికి నిరాకరించింది. అప్పటికే పెళ్లి ఏర్పాట్లు చేసుకున్న యువకుడి తరఫు బంధువులు లబోదిబోమంటున్నారు. కోరమంగలకు చెందిన జ్యోతిప్రకాష్‌ బెంగళూరులో టెక్కీగా పనిచేస్తున్నాడు. ఓ మాట్రిమోనీ సైట్‌ ద్వారా హిమబిందు అనే యువతితో పరిచయం కాగా.. ఆన్‌లైన్‌లో చాటింగ్‌ చేస్తూ మాట్లాడుకున్నారు. ఇద్దరి ఉద్యోగాలు, అభిరుచులూ నచ్చడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇరు కుటుంబాలు గతేడాది సెప్టెంబర్‌ 9న వీరి నిశ్చితార్థం నిర్వహించారు. 

యువతి కోరిక మేరకు తిరుపతిలో జనవరి 30 వివాహం చేసేందుకు నిర్ణయించారు. దీంతో యువకుడి బంధువులు తిరుమలలో 70 రూమ్‌లు బుక్‌చేశారు. రూ.4 లక్షలతో పెళ్లిదుస్తులు కొనుగోలు చేశారు. అంతలో తనకు పెళ్లి ఇష్టం లేదంటూ అక్టోబర్‌ 23న హిమబిందు కబురు పంపింది. పెళ్లికొడుకు ముక్కు పొడవుగా ఉందని.. ప్లాస్టిక్‌ సర్జరీతో సరిచేయించుకుంటే పెళ్లికి ఒప్పుకుంటానని షరతు విధించింది. అతని ఫోన్‌ నంబర్‌నూ బ్లాక్‌ చేసింది. దీంతో జ్యోతిప్రకాష్‌.. కుటుంబ సభ్యులతో కలిసి కోరమంగల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం శనివారం వెలుగులోకి వచ్చింది. పెళ్లి ఏర్పాట్ల కోసం రూ.5 లక్షల వరకూ ఖర్చు చేశామని ఆవేదన వ్యక్తం చేశారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top