చెన్నై,తిరువొత్తియూరు: బిచ్చమెత్తిగా వచ్చిన నగదును ఓ వృద్ధుడు కరోనా నివారణకు సాయంగా ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నాడు. శివగంగై సమీపంలోని అళగిచ్చి పట్టికి చెందిన ముత్తుకరుప్పన్ (87) పదేళ్లుగా శివగంగై శివాలయం ఎదుట బిచ్చమెత్తుకునేవాడు. ఇడయమేలూరు మాయాండి సిద్ధర్ ఆలయంలో ఆశ్రయం పొందుతున్నాడు. కరోనా వైరస్‌తో వలస కూలీల అవస్థలు, ప్రజల కష్టాలను గమనించాడు. ఇన్నేళ్లు తనకు అండగా నిలిచిన ప్రజలకు ఏదైనా చేయాలని తపించాడు. తాను దాచుకున్న రూ.5 వేల నగదును కరోనా నివారణ సాయంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. గురువారం శివగంగై తహసీల్దార్ మైలావతిని కలిసి నగదు అందజేశాడు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని నిరూపించాడు.


