
అనితకు సీమంతం!
అనితకు సీమంతమైతే వింతేమీ లేదు.. కాని ఆ అనిత ఓ శునకం కావడమే వింత.
హిందూపురం: అనితకు సీమంతం అందులో వింతేముంది అంటారా...నిజమే అనితకు సీమంతమైతే వింతేమీ లేదు కాని ఆ అనిత ఓ శునకం కావడమే వింత. ఆశ్చర్యపోకండి.. మీరు చదివింది నిజమే. అందరూ కూతుళ్లకి సీమంతం చేసి ముచ్చట తీర్చుకున్నట్లే అనంతపురం జిల్లా హిందూపురంలోని దంపతులు తాము ప్రేమగా పెంచుతున్న శునకానికి (అనిత) ఆదివారం సీమంతం చేశారు. హిందూపురం ఒకటో వార్డు కొట్నూరులో ఉంటున్న బేల్దారి శ్రీనివాసులు, లీలావతమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. కుమార్తెలు లేని వారు రెండేళ్ల క్రితం ఓ శునకాన్ని తెచ్చుకున్నారు.
దానికి అనిత అని పేరు పెట్టి కుటుంబ సభ్యురాలిగానే చూసేవారు. ఇటీవల అది గర్భం దాల్చడంతో దానికి సీమంతం చేయూలని భావించారు. ఇంటింటికీ వెళ్లి తమ బిడ్డ అనిత సీమంతానికి రావాలని ఆహ్వానించారు. ఇంటిముందు వేదిక ఏర్పాటు చేశారు. ఆపై శునకాన్ని కుర్చీపై కూర్చోబెట్టి కొత్త దుస్తులు వేసి పసుపు కుంకుమలు పూసి మంగళ హారతులిచ్చారు. వచ్చిన మహిళలందరికీ వాయినాలు ఇచ్చి, భోజనాలు కూడా పెట్టారు..చివర్లో శునకానికి కాదు..కాదు అనితకు ఆశీర్వాదాలు ఇప్పించారు.