అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించిన మంత్రి | Anganwadi centers of the observed | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించిన మంత్రి

Oct 15 2014 4:43 AM | Updated on Jun 2 2018 8:36 PM

రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, కన్నడ సంస్కృతీ శాఖ మంత్రి ఉమాశ్రీ బళ్లారి నగరం, తాలూకాలోని అంగన్‌వాడీ కేంద్రాలు, చిన్నారులకు పౌష్టికాహారం సరఫరా చేసే పలు గోడౌన్లను పరిశీలించారు.

సాక్షి, బళ్లారి: రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, కన్నడ సంస్కృతీ శాఖ మంత్రి ఉమాశ్రీ బళ్లారి నగరం, తాలూకాలోని అంగన్‌వాడీ కేంద్రాలు, చిన్నారులకు పౌష్టికాహారం సరఫరా చేసే పలు గోడౌన్లను పరిశీలించారు. మంగళవారం ఆమె బెంగళూరు నుంచి బళ్లారికి విచ్చేసి బళ్లారి తాలూకాలోని మోకా గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారులతో కాసేపు గడిపి వివరాలు సేకరించారు. అటెండెన్స్ జాబితాలో ఉన్న ప్రకారం చిన్నారులు ఉన్నారో లేదో లెక్కకట్టారు. చిన్నారులకు మెనూ ప్రకారం అన్ని రకాల పౌష్టికాహారం అందిస్తున్నారో లేదో తెలుసుకున్నారు.

గర్భిణులకు అందించే పౌష్టికాహారం అంగన్‌వాడీ కేంద్రాలకు సం బంధించిన వారు స్వాహా చేస్తున్నారని ఫిర్యాదులు చేయడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా అంగన్‌వాడీ కేంద్రాల వద్ద చిన్నారుల నుంచి నేరుగా వివరాలు సేకరించిన తర్వాత పౌష్టికాహారం అందించే గోడౌన్ల వద్దకు వెళ్లి పరిశీలించారు. మోకా, బళ్లారి నగరంలోని హవంబావి వద్ద ఉన్న గోడౌన్లను పరిశీలించి మంత్రి అవాక్కయ్యా రు. గోడౌన్ల నిండా వేరుశనగ, పెసర, శనగ బేడలు, బెల్లం తదితరాలు ప్యాకెట్లలో ఉంచి నేరుగా అంగన్‌వాడీలకు సరఫరా చేస్తున్నట్లు కళ్లారా చూశారు.

ఇలా అంగన్‌వాడీ కేంద్రాలకు నెల కా దు రెండు నెలలు కాదు ఏకంగా మూ డు సంవత్సరాల నుంచి ఇదే తరహాలో సరఫరా చేస్తున్నారని, అక్కడ పని చేస్తున్న సిబ్బంది ద్వారా తెలుసుకుని మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారులు పొడి చేయకుండా గింజలు నేరుగా సరఫరా చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. పెసలు, శనగలు, గోధుమలు, బెల్లం, వేరుశనగ విత్తనాలు బాగా పిండి చేసిన తర్వాత చిన్నారులకు అందిస్తే పౌష్టికాహారం అందించినట్లు అవుతుందని గుర్తు చేశారు.  

మూడు సంవత్సరాలుగా నిర్లక్ష్యంగా పని చేస్తూ, ఇప్పుడు తాను పరిశీలించిన తర్వాత చేస్తామంటున్నారంటూ మండిపడ్డారు. చిన్నారులు పౌష్టికాహారం కోసం ప్రభుత్వం ఎన్నో నిధులు వెచ్చించి అన్ని రకాలుగా పౌష్టికాహార పదార్థాలు సరఫరా చేస్తుంటే ఇక్కడ ఏమి జరుగుతుందో అర్థం కావ డం లేదని మండిపడ్డారు. వెంటనే సంబంధిత సీడీపీఓలు సోమశేఖర్, కృష్ణమ్మలను ఇద్దరినీ సస్పెండ్ చేయాలని బెంగళూరు ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా కబురు పంపారు.

అలాగే జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డెరైక్టర్ కలాదగికి నోటీసులు జారీ చేయాలని సక్రమంగా జవాబు ఇవ్వకపోతే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఎస్‌పీ సర్కిల్‌లోని బాలికల రిమాండ్ హోంను సందర్శించి అక్కడ బాలికలతో వివరాలు సేకరించారు. సౌకర్యాలు సక్రమంగా అందిస్తున్నారా? లేదా? అని అడిగి తెలుసుకుని, బాగా చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని రావాలని, పెళ్లి ఈడు వచ్చిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలని సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement