ఆంధ్రా వాసుల ఆందోళన | Andhra residents concern | Sakshi
Sakshi News home page

ఆంధ్రా వాసుల ఆందోళన

Jan 16 2014 11:41 PM | Updated on Jun 2 2018 7:11 PM

అక్రమ కేసులను బనాయించి ప్రభుత్వ రవాణా శాఖాలో పనిచేస్తున్న వ్యక్తిని అనవసరంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ నిందితుడు తల్లి,

 తిరువళ్లూరు, న్యూస్‌లైన్: అక్రమ కేసులను బనాయించి ప్రభుత్వ రవాణా శాఖాలో పనిచేస్తున్న వ్యక్తిని అనవసరంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ నిందితుడు తల్లి, సోదరి కిరోసిన్ క్యాన్‌తో తిరువళ్లూరు ఫుడ్‌సెల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.ఆంధ్ర రాష్ట్రం చిత్తూరు జిల్లా నగరి, ఇంద్రానగర్ ప్రాంతానికి చెందిన సుగుణ (40). ఈమె భర్త నగరి ప్రాంతంలో పార్శిల్ సర్వీస్ సెంటర్ నిర్వహిస్తున్నారు. వీరితో పాటు సుగుణ  తల్లి రత్నగణి నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి సెలవులు కావడంతో తూత్తుకుడి జిల్లాకు చెందిన సుగుణ  సోదరుడు థామస్ సురేందర్ తన కుటుంబంతో కలిసి నగరికి వచ్చాడు. మూడు రోజలు పాటు సెలవులను గడిపాడు. ఇదే సమయంలో సుగుణ  కుమారుడు తిరువళ్లూరు జిల్లాలోని పంచెట్టి పరిధిలో ఉన్న  ప్రైవేటు పాఠశాలలో ఇంటర్ చదువుతుండడంతో అతనిని వదలి పెట్టడానికి ఇన్నోవా కారులో బయలుదేరాడు.  పంచెట్టిలోని పాఠశాలలో వదలిపెట్టి తిరిగి వస్తుండగా పొన్నేరి వద్ద థామస్‌ను రేషన్‌బియ్యం తరలిస్తున్నారన్న నెపంతో  తిరువళ్లూరు ఫుడ్‌సెల్ ఇన్‌స్పెక్టర్ ప్రకాష్ బృందం  అరెస్టు చేశారు. 
 
 కిరోసిన్ క్యాన్‌తో ఆందోళన
 తూత్తుకుడి జిల్లాలోని రవాణా శాఖలో డ్రైవర్‌గా పని చేస్తున్న థామస్‌ను అరెస్టు చేయడంతో అతని తల్లి రత్నగణి, సోదరి సుగుణ  తదితరులు ఫుడ్‌సెల్ కార్యాలయానికి చేరుకుని అరెస్టుకు గల కారణాలను చెప్పాలని ఇన్‌స్పెక్టర్ ప్రకాష్‌ను నిలదీశారు. దీనిపై సమాధానం ఇచ్చిన ఇన్‌స్పెక్టర్ ప్రకాష్, ఇన్నోవా కారులో అక్రమంగా బియ్యం తరలిస్తున్నట్టు తమకు అందిన సమాచారం మేరకు అరెస్టు చేసినట్టు ఆయన వివరించారు. దీనిపై సంతృప్తి చెందని బంధువులు, పాఠశాలకు వెళ్లి వస్తున్న తమపై నేరాన్ని మోపి అరెస్టు చేసారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆగ్రహించిన ఇన్‌స్పెక్టర్ థామస్ బంధువులను బలవంతంగా బయటకు పంపి విచారణ ప్రారంభించారు. కారును, నిందితుడిని వదలిపెట్టే ప్రసక్తే లేదని వారు తేల్చి చెప్పడంతో ఆగ్రహించిన థామస్ తల్లి కి రోసిన్ క్యాన్ తెచ్చి ఆత్మాహత్యకు పాల్పడుతామని హెచ్చరించింది. దీంతో ఫుడ్‌సెల్ కార్యాలయం వద్ద దాదాపు రెండు గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం బయటకు వచ్చిన పోలీసులు వారిని సముదాయించి అక్కడి నుంచి పంపించారు. తమపై అక్రమంగా కేసులు బనాయించారని వారు విలపించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement