తీవ్రవాదుల కదలికలపై రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఏమాత్రం అప్రత్తంగా ఉందో పరీక్షించేందుకు శుక్రవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన
తీవ్రవాదుల కదలికలపై రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఏమాత్రం అప్రత్తంగా ఉందో పరీక్షించేందుకు శుక్రవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఆపరేషన్ ఆమ్లా శనివారం సాయంత్రం ముగిసింది. ఈ 36 గంటల్లో 71 మందిని పట్టుకున్నారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: 2008లో పాకిస్థాన్ తీవ్రవాదులు సముద్రమార్గం ద్వారా రహస్యంగా ముంబయిలో ప్రవేశించి మారణహోమం సృష్టించడం, వందలాది మందిని బలిగొనడం దేశ ప్రజలు నేటికీ మర్చిపోలేదు. ఆ సంఘటన తరువాత దేశంలో తీవ్రవాదులు కార్యకలాపాలను సమూలంగా తుడిచిపెట్టేందుకు దేశవ్యాప్తంగా ఆపరేషన్ ఆమ్లా అమలు చేస్తున్నారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఆ ఏడాది నుంచి తమిళనాడులో సైతం ఆరు నెలలకు ఒకసారి చొప్పున ఏడాదికి రెండుసార్లు ఆపరేషన్ ఆమ్లా అమలు చేస్తున్నారు. ప్రధానంగా రాష్ట్రంలోని 14 సముద్రతీర జిల్లాల్లో ఆపరేషన్ ఆమ్లాను మరింత ఉధృతంగా నిర్వహిస్తుంటారు.
రాష్ట్ర డీజీపీ అశోక్‌కుమార్, సముద్రతీర గస్తీ దళాల డీజీపీ శైలేంద్రబాబు నేతృత్వంలో ఈనెల 11వ తేదీ ఉదయం 6 గంటలకు ఆపరేషన్ ఆమ్లాను ఆరంభించారు. శుక్రవారం నాడు అనేక చోట్ల మారువేషాలతో నగరంలోకి ప్రవేశించిన గస్తీ దళాలకు చెందిన 60 మంది పట్టుబడ్డారు.శనివారం ఉదయం కాశిమేడు ఫిషింగ్ హార్బర్‌లో నిలిచి ఉన్న ఒక నౌకలో 11 మంది దాక్కుని ఉన్నట్లు గుర్తించారు. వారిని తీరంలోకి తీసుకువచ్చి విచారించగా ఆపరేషన్ ఆమ్లాలో భాగంగా చొరబాటుకు ప్రయత్నిస్తున్న గ స్తీదళాలని చెందిన కమెండోలుగా గుర్తించారు. శని వారం 6 గంటలతో ఆపరేషన్‌ఆమ్లా ముగియగా మొత్తం 71 మందిని పట్టుకున్నట్లు తెలిసింది.
నాటుబాంబులు స్వాధీనం-ముగ్గురి అరెస్ట్ : తిరునెల్వేలీ పుళియరైలో ఏడు నాటుబాంబులను స్వాధీనం చేసుకుని ఈ కేసులో ముగ్గురు నిందితులను పేలుడు పదార్దాల నిరోధకశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. అధికారులకు అందిన సమాచారం మేరకు పుళియరై పురందనై ఓడై రోడ్డులో పూడ్చిపెట్టిన ఉన్న నాటుబాంబులను తవ్వి తీశారు. కరప్పుస్వామి (32), శరవణకుమార్ (28), ఎబనేష్ (46)లను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో ఐఎస్ తీవ్రవాదుల కదలికలను అనుమానించిన పోలీసులు నిఘాపెంచారు. ఐఎస్ తీవ్రవాద సంస్థకు చెందిన ఆప్షన్ జబీన్ అనే మహిళ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో పట్టుబడింది. అధికారుల విచారణలో దక్షిణాదిపై దృష్టిపెట్టి అనేక మందిని ఐఎస్‌లో చేర్చుకున్నట్లు ఆమె తెలిపింది. అరెస్టయిన మహిళా తీవ్రవాది ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం తమిళనాడులో కూడా ఐఎస్‌లో చేరిక సాగినట్లు అనుమానిస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.