మెట్టుదిగని కెప్టెన్‌

AIADMK BJP Alliance Vijayakanth Demanding 9 Seats - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే–బీజేపీ కూటమి దాదాపు ఖరారైపోగా ఒక్క డీఎండీకే విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. 9 స్థానాలకు డీఎండీకే పట్టుబడుతుండగా నాలుగు లేదా ఐదు స్థానాలు మాత్రమేనని అన్నాడీఎంకే స్పష్టం చేసింది. మొత్తం 40 పార్లమెంటు స్థానాల్లో కనీసం 20 స్థానాల్లో ఖచ్చితంగా పోటీచేయాలని అన్నాడీఎంకే నేతలు భావిస్తున్నారు. మిగిలిన 20 స్థానాలను మిత్రపక్షాలకు వదిలేశారు. ఇందులో బీజేపీకి ఐదు, పీఎంకేకు ఏడు స్థానాలపై ఒప్పందం జరిగిపోయింది. ఇక మిగిలిన 8 స్థానాల్లో పుదియతమిళగం, తమిళ మానిల కాంగ్రెస్‌ (ఇంకా చర్చల దశలో), ఇండియా జననాయక కట్చి, పుదియనీదికట్చిలకు తలా ఒకటి కేటాయించాలని నిర్ణయించారు.

ఇక డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌కు మిగిలింది నాలుగుస్థానాలే. అయితే ఆయన 9 స్థానాలను కోరుతుండగా ఎంతమాత్రం వీలుకాదని అన్నాడీఎంకే తేల్చిచెప్పేసింది. మూడు లేదా నాలుగుస్థానాలు మాత్రమే కేటాయించగలమని స్పష్టం చేసింది. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్, కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌ మంగళవారం రాత్రి వరకు విజయకాంత్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఎంతకూ ఆయన మెట్టుదిగకపోవడంతో పీయూష్‌గోయల్‌ ఢిల్లీకి వెళ్లిపోయారు. ఈ దశలో ఇరుపక్షాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. ఇదిలా ఉండగా బీజేపీ కూటమిలో పీఎంకే చేరడానికి నిరసనగా పీఎంకే యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి రాజేశ్వరి ప్రియా రాజీనామా చేశారు.

ఉప ఎన్నికల షరతుపై డీఎండీకే నో:
సీట్ల సర్దుబాట్లు అలా ఉంచితే ఖాళీగా ఉన్న 21 అసెంబ్లీ స్థానాల్లో మిత్రపక్షంగా ఎన్నికల ప్రచారం చేయాలని, పోటీ అభ్యర్థులను పెట్టరాదు, ఎన్నికల ప్రచారం చేయాలనే నిబంధనలకు బీజేపీ, పీఎంకే సమ్మతించినట్లు సమాచారం. అయితే డీఎండీకే మాత్రం ఈ నిబంధనకు ససేమిరా అని కుండబద్దలు కొట్టడం ప్రతిష్టంభనకు మరోకారణౖమైంది. పార్లమెంటు స్థానాల్లో్ల మిత్రపక్షం, అసెంబ్లీ స్థానాలో ప్రతిపక్షంగా వ్యవహరించడం ఏమిటని డీఎండీకేను అన్నాడీఎంకే ప్రశ్నిస్తోంది. ఉప ఎన్నికల్లో అభ్యర్థులను పోటీపెట్టబోమని హామీ ఇచ్చినట్లయితేనే నాలుగు లేదా ఐదు స్థానాలను కేటాయించగలమని అన్నాడీఎంకే వాదిస్తోంది. ఇదిలా ఉండగా, తాము కోరినన్ని సీట్లు కేటాయించని పక్షంలో తీవ్రమైన నిర్ణయం తీసుకోకతప్పదని విజయకాంత్‌ హెచ్చరించారు. బుధవారం రాత్రికి డీఎండీకే, అన్నాడీఎంకే మధ్య సామరస్యపూర్వకమైన ఒప్పందం జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top