రద్దయిన పాత రూ.500, రూ.1,000 నోట్లను బెంగళూరులో అక్రమంగా కొత్త నోట్లుగా మార్పిడి చేస్తున్న ముఠా గుట్టును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రట్టు చేసింది.
బెంగళూరులో ఏడుగురు మధ్యవర్తుల అరెస్ట్
సాక్షి, బెంగళూరు : రద్దయిన పాత రూ.500, రూ.1,000 నోట్లను బెంగళూరులో అక్రమంగా కొత్త lనోట్లుగా మార్పిడి చేస్తున్న ముఠా గుట్టును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రట్టు చేసింది. ఏడుగురు మధ్యవర్తులను అరెస్ట్ చేయడంతో పాటు వారి నుంచి రూ.93 లక్షల (అన్నీ రూ.2 వేల నోట్లే) విలువైన కొత్త నోట్లను సీజ్ చేసింది. అరెస్టయిన వారిలో ఓ ప్రభుత్వ అధికారి బంధువు ఉన్నారు. ఈడీ అధికారులు పాత నోట్లను మార్చుకునే వ్యక్తులుగా స్టింగ్ ఆపరేషన్ చేపట్టి.. అక్రమంగా నగదు మార్పిడి చేస్తున్న ముఠాను పట్టుకున్నారు.
జేడీఎస్ నేత వీరేంద్ర అరెస్ట్..
ఐటీ దాడుల్లో ఓ ఇంటి బాత్‌రూమ్‌లో రూ. 5.7 కోట్ల కొత్త కరెన్సీని సీజ్ చేసిన కేసులో జేడీఎస్ నేత, గోవాలోని కేసినో అధిపతి కేసీ వీరేంద్రను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 10న వీరేంద్రను హుబ్లీలో అరెస్ట్ చేసి.. బెంగళూరు తీసుకొచ్చామని, కోర్టు ఆరు రోజుల కస్టడీ విధించిందన్నారు.
ముంబైలో 33 లక్షలు సీజ్
ముంబై: ముంబై, థానేల్లో రెండు ఉదంతాల్లో రూ. 33 లక్షల విలువైన కొత్త 2 వేల నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వడోదరలో ఓ మద్యం వ్యాపారి ఇంట్లోంచి రూ. 19.67 లక్షల నగదును పట్టుకున్నారు. మరోపక్క.. థానేలో పోలీసులు రూ. కోటి విలువైన కొత్త నోట్లను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు. రూ. 1.20 కోట్ల పాత నోట్లు తీసుకుని రూ. కోటి కొత్త నోట్లు ఇచ్చేందుకు వెళ్తుండగా థానే సివిల్ ఆస్పత్రి సమీపంలో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.