దివ్యాంశ్‌ శ్రేయ జంటకు కాంస్యం 

World Shooting Championship  - Sakshi

ప్రపంచ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌

చాంగ్‌వాన్‌ (కొరియా): అంతర్జాతీయ షూటింగ్‌ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నాలుగో రోజు భారత సీనియర్‌ షూటర్లు విఫలమైనా జూనియర్లు సత్తా చాటారు. 10 మీ. ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ జూనియర్‌ ఈవెంట్‌లో దివ్యాంశ్‌ సింగ్‌–శ్రేయ అగర్వాల్‌ జోడీ కాంస్యం సాధించింది. ఫైనల్లో దివ్యాంశ్‌–శ్రేయ జంట 435 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సొంతం చేసుకుంది. అంతకుముందు 42 జట్లు పాల్గొన్న క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో దివ్యాంశ్‌–శ్రేయ జోడీ 834.4 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరగా... మరో భారత జంట ఎలవనీల్‌ వలరివన్‌–హిృదయ్‌ హజారికా జంట (829.5 పాయింట్లు) 13వ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌ ప్రస్తుతం మూడు స్వర్ణాలు, మూడు రజతాలు, మూడు కాంస్యాలతో పతకాల పట్టికలో సంయుక్తంగా మూడో స్థానంలో ఉంది.  

సీనియర్లు విఫలం... 
2020 టోక్యో ఒలింపిక్స్‌కు తొలి అర్హత టోర్నమెంట్‌గా నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్‌లో పురుషుల 50 మీ. రైఫిల్‌ ప్రోన్‌ విభాగంలో చైన్‌ సింగ్‌ 623.9 పాయింట్లతో 14వ స్థానంలో నిలిచి నిరాశపరచగా... తాజా ఆసియా క్రీడల రజత పతక విజేత సంజీవ్‌ రాజ్‌పుత్‌ (620 పాయింట్లు) 48వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. టీమ్‌ విభాగంలో చైన్‌ సింగ్, సంజీవ్, గగన్‌ నారంగ్‌ల త్రయం 1856.1 పాయింట్లతో 15వ స్థానం దక్కించుకుంది. మహిళల 50 మీ. రైఫిల్‌ ప్రోన్‌ విభాగంలో తేజస్విని సావంత్‌ 617.4 పాయింట్లతో 28వ స్థానం దక్కించుకోగా... అంజుమ్‌ మౌద్గిల్‌ (616.5 పాయింట్లు) 33వ స్థానం... శ్రేయ సక్సేనా (609.9 పాయింట్లు) 54వ స్థానంలో నిలిచారు. టీమ్‌ విభాగంలో అంజుమ్, తేజస్విని, శ్రేయలతో కూడిన భారత జట్టు 1848.1 పాయింట్లతో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top