విరాట్‌ కోహ్లి రికార్డుల పర్వం

Virat Kohli Records In 3rd Test Against England - Sakshi

నాటింగ్‌హామ్‌: ఇంగ్లండ్‌పై రెండు టెస్టుల ఓటమి తర్వాత జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా కసిగా ఆడుతోంది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో టీమిండియా ఆటగాళ్లు అదరగొడుతున్నారు. ఈ టెస్టులో టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి మరోసారి తన బ్యాట్‌కు పనిచెప్పాడు. నాటింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న టెస్టులో విరాట్‌ కోహ్లి పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించడంతో సారథిగా అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో కోహ్లి(16) మూడో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో అలెన్‌ బోర్డర్(15)‌, స్టీవ్‌ వా(15), స్టీవ్‌ స్మిత్‌(15)లను అధిగమించాడు. ఈ జాబితాలో గ్రేమ్‌ స్మిత్‌(25) తొలి స్థానంలో నిలవగా, రికీ పాంటింగ్‌(19) రెండో స్థానంలో నిలిచాడు. 

ఆసియా ఖండం బయట అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లి(11) నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ క్రమంలో పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ ఇంజమాముల్‌ హక్‌ను రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో సచిన్‌ టెండూల్కర్‌(18), గవాస్కర్‌(15), రాహుల్‌ ద్రవిడ్‌(14) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక భారత్‌ తరుపున టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో అజారుద్దీన్‌(22)ను దాటేశాడు. దీంతో కోహ్లి మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానాన్ని పంచుకున్నాడు. ఇక టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన భారత ఆటగాళ్లలో సచిన్‌(51), ద్రవిడ్‌(36), గవాస్కర్‌(34)లు తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఒక టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి రెండు వందలకు పైగా పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లి(12సార్లు) ఐదో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో సంగక్కర(17), లారా(15), బ్రాడ్‌మన్‌(14), పాంటింగ్‌(13) తొలి నాలుగు స్థానాల్లో నిలిచారు. 

కోహ్లి రెండో ఇన్నింగ్స్‌లో 63 పరుగులు సాధించడంతో ఈ సిరీస్‌లో 400 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లండ్‌ గడ్డపై కెప్టెన్‌గా ఆతిథ్య జట్టుపై ఒక్క సిరీస్‌లో 400కి పైగా పరుగులు సాధించిన రెండో భారత కెప్టెన్‌గా కోహ్లి రికార్డు సాధించాడు. గతంలో అజారుద్దీన్‌(426) ఈ ఫీట్‌ సాధించాడు. ఒక ఇన్నింగ్స్‌లో తొలి మూడు వికెట్లకు అర్థసెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసి టీమిండియా ఆటగాళ్లు అరుదైన రికార్డును నెలకోల్పారు. 1968లో ఆస్ట్రేలియాపై తొలిసారి ఈ ఘనత సాధించారు. ఇక ఈ మైదానంలో ఇంగ్లండ్‌ అత్యధిక ఛేజింగ్‌ 332 పరుగులే(1928లో ఆస్ట్రేలియాపై) కావడం గమనార్హం.   
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top