‘శత’క్కొట్టిన విహారి, పృథ్వీ షా

Vihari, Shaw shine as India A win - Sakshi

విండీస్‌ ‘ఎ’పై 203 పరుగులతో భారత్‌ ‘ఎ’ విజయం

నార్తంప్టన్‌: ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి (131 బంతుల్లో 147; 13 ఫోర్లు, 5 సిక్స్‌లు) భారీ శతకానికి తోడు యువ సంచలనం పృథ్వీ షా (90 బంతుల్లో 102; 16 ఫోర్లు) సెంచరీతో చెలరేగడంతో ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత ‘ఎ’ జట్టు 203 పరుగలతో వెస్టిండీస్‌ ‘ఎ’పై గెలిచింది. ఈ ఇద్దరు శతకాలతో కదం తొక్కడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 50 ఓవర్లలో 6 వికెట్లకు 354 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం వెస్టిండీస్‌ 37.4 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌటైంది. అక్షర్‌ పటేల్‌ 4, చహర్‌ 2 వికెట్లు పడగొట్టారు.  టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. రిషభ్‌ పంత్‌ (5), శ్రేయస్‌ అయ్యర్‌ (0) నిరాశ పర్చడంతో 28 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.

ఈ దశలో మరో ఓపెనర్‌ పృథ్వీ షాతో జతకట్టిన విహారి విండీస్‌ బౌలర్లను ఆటాడుకున్నాడు. అలవోకగా బౌండరీలు బాదుతూ భాగస్వామ్యాన్ని పెంచుతూ పోయాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 160 పరుగులు జోడించారు. ఆ తర్వాత  పృథ్వీ ఔటైనా మిడిలార్డర్‌తో కలిసి కీలక భాగస్వామ్యాలు నమోదు చేసిన విహారి జట్టుకు భారీ స్కోరు అందించి ఇన్నింగ్స్‌ చివరి బంతికి వెనుదిరిగాడు. విండీస్‌ బౌలర్లలో చెమర్‌ హోల్డర్‌కు 3 వికెట్లు దక్కాయి. భారీ లక్ష్యంతో బరిలో దిగిన విండీస్‌ భారత బౌలర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి లక్ష్యంలో సగం పరుగులైనా చేయకుండానే ఆలౌటైంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట గెలిచిన భారత్‌ ‘ఎ’ సోమవారం జరిగే టోర్నీ ఫైనల్లో ఇంగ్లండ్‌ ‘ఎ’తో తలపడనుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top