విదర్భ... విజయం ముంగిట

Vidarbha Ranji is ready to retain the title - Sakshi

డకౌటైన పుజారా

విదర్భను నిలబెట్టిన సర్వతే

సౌరాష్ట్ర లక్ష్యం 206; ప్రస్తుతం 58/5

రంజీ ట్రోఫీ ఫైనల్‌

సౌరాష్ట్రకు రంజీ ఫైనల్‌ మరో‘సారీ’ చెప్పేసింది. పరాజయానికి బాట వేసింది. విదర్భ వరుసగా విజయగర్వానికి సిద్ధమైంది. కీలకమైన పుజారాను డకౌట్‌ చేయడంతోనే మ్యాచ్‌ను చేతుల్లోకి తెచ్చుకున్న విదర్భ... ప్రత్యర్థి 60 పరుగులైనా చేయకముందే సగం వికెట్లను పడగొట్టింది.  

 నాగ్‌పూర్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ విదర్భ రంజీ టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు సై అంటోంది. భారత స్టార్‌ చతేశ్వర్‌ పుజారా అందుబాటులో ఉన్న సౌరాష్ట్ర జట్టు స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక విలవిల్లాడుతోంది. విదర్భ చాంపియన్‌షిప్‌కు ఐదు వికెట్ల దూరంలో ఉంటే... లోయర్‌ ఆర్డర్, టెయిలెండేర్లే ఉన్న సౌరాష్ట్ర ఇంకా 148 పరుగులు చేయాల్సివుంది. విదర్భను ఆదిత్య సర్వతే తన ఆల్‌రౌండ్‌ షోతో నిలబెట్టాడు. నాలుగో రోజు ఆటలో బ్యాటింగ్‌లో విఫలమైన విదర్భ బౌలింగ్‌లో జూలు విదిల్చింది. మొత్తానికి బుధవారం ఆటను ఇరు జట్ల బౌలర్లు శాసించారు. ముందుగా 55/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆట కొనసాగించిన విదర్భ రెండో ఇన్నింగ్స్‌లో 92.5 ఓవర్లలో 200 పరుగుల వద్ద ఆలౌటైంది.

ఆదిత్య సర్వతే (49; 5 ఫోర్లు) ఒక్కడే ప్రత్యర్థి బౌలింగ్‌కు ఎదురు నిలిచాడు. సౌరాష్ట్ర బౌలర్‌ ధర్మేంద్రసింగ్‌ జడేజా (6/96) స్పిన్‌ ఉచ్చులో 73 పరుగులకే 5 వికెట్లను కోల్పోయిన విదర్భను టెయిలెండర్‌ ఆదిత్య 200 పరుగుల దాకా లాక్కొచ్చాడు. మోహిత్‌ కాలే 38, గణేశ్‌ సతీశ్‌ 35 పరుగులు చేశారు. కమలేశ్‌ మక్వానాకు 2 వికెట్లు దక్కాయి. తర్వాత తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని కలుపుకొని 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌరాష్ట్రను సర్వతే (3/13)స్పిన్‌తో కొట్టాడు.

ఓపెనర్లు హర్విక్‌ దేశాయ్‌ (8), స్నెల్‌ పటేల్‌ (12)లతో పాటు పుజారా (0)ను ఖాతా తెరువకుండానే సాగనంపాడు. క్వార్టర్స్, సెమీస్‌లో జట్టును నడిపించిన పుజారా ఫైనల్లో మాత్రం చేతులెత్తేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో అతను ఒక పరుగే చేశాడు. అర్పిత్‌ వాసవద (5)ను ఉమేశ్, షెల్డన్‌ జాక్సన్‌ (7)ను అక్షయ్‌ వఖారే పెవిలియన్‌ చేర్చడంతో సౌరాష్ట్ర 55 పరుగులకే 5 కీలక వికెట్లను కోల్పోయింది. ఆట నిలిచే సమయానికి విశ్వరాజ్‌ జడేజా (23 బ్యాటింగ్, 3 ఫోర్లు), కమలేశ్‌ మక్వానా (2 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

సంబంధిత వార్తలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top